ఆళ్ళపల్లి వెళ్తే అన్నం పెట్టేది ఈయనే.. 

– తన ప్రధాన అనుచరుడు అతహార్ పై తమ్మల సరదా వ్యాఖ్య
– మండల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అతహార్
– సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
“ఆళ్ళపల్లికి వెళ్తే అన్నం పెట్టేది ఈయనే”.. అని స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు, తన ప్రధాన అనుచరుడైన మొహమ్మద్ అతహార్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు రానున్న కాలంలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇల్లందు పట్టణంలో పర్యటనలో తుమ్మల ఉండగా అతహార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రితో ఆయన మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి, మామకన్ను మధ్య కిన్నెరసాని నదిపై బ్రిడ్జి నిర్మాణం పనులు ఫారెస్ట్ శాఖ అనుమతులు లేక సుమారు దశాబ్ద కాలంగా నిర్మాణ పనులు నిలిచాయని, పనులు పూర్తయ్యేలా పరిష్కారం చూపాలని అడిగారు. అదేవిధంగా మండల పరిధిలోని మర్కోడు గ్రామం నుంచి కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం పనులు సైతం ఫారెస్ట్ అనుమతులు లేక సుమారు రెండు దశాబ్దాలుగా నిలిచాయని, ప్రజల సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాటు అన్ని మండలాలకు డబుల్ రోడ్డు ప్రభుత్వం కల్పించిన విధంగానే ఆళ్ళపల్లి మండలానికి అనిశెట్టిపల్లి నుంచి సుమారు 35 కిలోమీటర్ల డబుల్ రోడ్డు జిల్లా కేంద్రానికి మండల వాసులు వెళ్లేందుకు మంజూరు చేయాలని కోరారు. ఆళ్ళపల్లిలో మసీద్ దగ్గర నుంచి ఎస్సీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం వరకు నూతన సీసీ రోడ్డు మంజూరు, బస్టాండ్ సెంటర్ లోని పార్టీ గద్దెల నుంచి యూనియన్ బ్యాంక్ వరకు ఉన్న పాత సీసీ రోడ్డు గుంతల మయంగా మారి ప్రజల, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, దానికి సైతం నూతన సీసీ రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కల్తీ మొక్కజొన్న విత్తనాలతో రబీ సాగు చేసి, ఆర్ధికంగా నష్టపోయిన 5గురు రైతులకు సంబంధిత వసుధ 161 ఆడామగా మొక్కజొన్న కంపెనీ యాజమాన్యం ద్వారా ఇప్పించాలని వివరాలు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తుమ్మల అనంతోగు గ్రామం వద్ద కిన్నెరసానిపై బ్రిడ్జి నిర్మాణం, బీటీ రోడ్డు ఏర్పాటు చేపించి సుమారు 10 సంవత్సరాలు గడిచినా ఇల్లందు డిపో నుంచి ఆళ్ళపల్లి మండలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, దాంతో అనేక మంది అనంతోగు, కాచనపల్లి గ్రామాల మధ్య ప్రయాణించి మృత్యువాత పడ్డారని, ఇకనైనా బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పై సమస్యల పరిష్కారానికి మంత్రి తుమ్మలకు వినపత్రాలను అందించారు. సమస్యల పరిష్కారానికి గాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. మంత్రి త్వరలో ఆళ్ళపల్లి పర్యటించనున్నట్లు సూచనప్రాయంగా అనుచరులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ పేరయ్య, గౌరిశెట్టి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.