– బుమ్రాపై భారత బౌలింగ్ భారం
– సిరాజ్, ఆకాశ్, హర్షిత్ విఫలం
జార్జ్ లెహ్ మాన్, బ్రూస్ టేలర్, ఇమ్రాన్ ఖాన్, రిచర్డ్ హాడ్లీ.. ప్రపంచ టెస్టు క్రికెట్లో జట్టు బౌలింగ్ భారాన్ని ఒంటిచేత్తో బాధ్యతగా తీసుకున్న దిగ్గజాలు. ఓ టెస్టు సిరీస్‌లో ఒక్క బౌలరే వికెట్ల వేట బాధ్యత తీసుకోవటం 40 ఏండ్ల తర్వాత ప్రపంచ క్రికెట్ చూస్తోంది!. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా అటువంటి అసమాన ప్రదర్శన చేశాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత్, ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ప్రపంచ క్రికెట్లో అగ్రజట్టు తలపడుతున్న ఉత్కంఠ సమరంలో తొలి మూడు టెస్టులు ముగిశాయి. ప్రత్యర్థి శిబిరంలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోశ్ హాజిల్‌వుడ్ లేదంటే మరో బెంచ్ బౌలర్ వికెట్ల వేటలో సమానంగా రెచ్చిపోతున్నారు. ఏ ఒక్క బౌలర్‌పై ఆస్ట్రేలియా అతిగా ఆధారపడటం లేదు. భారత శిబిరంలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే.. వికెట్ల వేట బాధ్యత భుజాలపై వేసుకున్నాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఇప్పుడు 1-1తో సమంగా ఉంది. ఇప్పటికైనా భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రానాలు బుమ్రాకు జతగా నిప్పులు చెరిగితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ముచ్చటగా మూడోసారి ఆసీస్ గడ్డపై నెగ్గవచ్చు.
బుమ్రా ఓ అద్భుతం : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జశ్‌ప్రీత్ బుమ్రా అసమాన ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్‌లో ప్రతి ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా అతడు నిలిచాడు. మూడు మ్యాచుల్లో బుమ్రా ఏకంగా 21 వికెటుల పడగొట్టాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 14 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సగటు 10.90, ఎకానమీ 2.60, స్ట్రయిక్‌రేట్ 25.14తో బుమ్రా ఓ అద్భుతం అనిపించాడు. ఇదే సమయంలో భారత శిబిరంలో ఇతర పేసర్లు మరీ తీసికట్టుగా రాణించారు. మహ్మద్ సిరాజ్ మూడు మ్యాచుల్లో 23.92 సగటుతో 13 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రానా రెండు టెస్టుల్లో 50.75 సగటుతో 4 వికెట్లు, ఆకాశ్ దీప్ ఓ టెస్టులో 41.00 సగటుతో 3 వికెట్లు, నితీశ్ కుమార్ మూడు టెస్టుల్లో 60.00 సగటుతో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా సగటు 10.90 కాగా.. ఇతర భారత బౌలర్ల సగటు 36.81. బుమ్రాతో ఇతర బౌలర్ల సగటు వ్యత్యాసం నిష్పత్తి 3.38. ప్రపంచ క్రికెట్లో ఇటువంటి ప్రదర్శన గత 40 ఏండ్లలో ఇదే ప్రథమం. చివరగా 1985-86 ఆసీస్, కివీస్ టెస్టు సిరీస్‌లో రిచర్డ్ హాడ్లీ 3.78 నిష్పత్తి వ్యత్యాసం చూపించాడు. ఆ తర్వాత అటువంటి అసమాన ప్రదర్శన బుమ్రా చేశాడు. ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్ (14 వికెట్లు), మిచెల్ స్టార్క్ (14 వికెట్లు), జోశ్ హాజిల్‌వుడ్ (6 వికెట్లు), స్కాట్ బొలాండ్ (5 వికెట్లు) సమిష్టిగా వికెట్ల వేటలో రాణిస్తున్నారు. హాజిల్‌వుడ్ రెండు టెస్టుల్లో ఆడగా.. అందులో ఓ టెస్టు ఆరంభంలోనే గాయంతో తప్పుకున్నాడు. స్కాట్ బొలాండ్ ఒక్క టెస్టులోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఇటువంటి సహకారం సహచర భారత పేసర్ల నుంచి లభించటం లేదు.
‘ఉదయం నుంచి సాయంత్రం వరకు వికెట్‌కు రెండు వైపులా బుమ్రానే బౌలింగ్ చేయాలని ఆశించలేమని’ రోహిత్ శర్మ భారత బౌలింగ్ విభాగంపై వ్యాఖ్యానించాడు. ‘ఒకరికొకరు వేలెత్తి చూపించే పరిస్థితిలోకి వెళ్లాలని అనుకోవద్దు. ఇది తరం మార్పిడి దశ. సహచర బౌలర్లకు మద్దతుగా నిలువటం నా బాధ్యత’ అని బుమ్రా హుందాగా మాట్లాడాడు. మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో కలిసి మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌పై కసరత్తులు చేస్తున్నాడు. రానున్న మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లోనైనా సిరాజ్, ఆకాశ్ దీప్‌లు ఆశించిన సహకారం అందిస్తే బుమ్రా తన మ్యాజిక్‌తో సిరీస్‌ను సాధించగలడు!.