– భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
– మేలు కన్న కీడు చేస్తున్న గోదావరి- కిన్నెరసాని
– బూర్గంపాడు -సోంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు బంద్
– మండల అధికారుల జాడకరువు
నవతెలంగాణ -బూర్గంపాడు
భద్రాచలం వద్ద వరద గోదావరి ఉధృతి రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించడంతో బూర్గంపాడు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఇప్పటికే గోదావరి వరద 48 అడుగుల ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపంగా ఉండటంతో ప్రధానంగా మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలతో పాటు బూర్గంపాడు ముంపునకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బూర్గంపాడు ఉత్తర- దక్షిణప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు వరద గోదావరి ఉధృతితో మునిగిపోయాయి. అటు గోదావరి వరద.. ఇటు కిన్నెరసాని నది ప్రవాహం ఉధృతంగా ప్రవహించటంతో బూర్గంపాడు లోని పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గ్రామంలోని నివాస ప్రాంతాలకు సమీపంగా వరద చేరుకోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 53 అడుగుల మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ఒకవేళ ప్రవహిస్తే మండల కేంద్రమైన బూర్గంపాడు మూడు వైపులా వరద చేరుకొని ముంపునకు గురవుతుంది. ఇప్పటికే కిన్నెర సాని నదీ పరివాహక ప్రాంతాల్లో వరి నాట్లు వేసిన పొలాలు… నారుమళ్ళు పూర్తిగా వరద ముంపుకు గురి కావడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. అదేవిధంగా గోదావరి నది పరిపాక ప్రాంతా ల్లోని సారపాక, రెడ్డిపాలెం, బూర్గంపాడు, ఇరవెండి, మోతే గ్రామాలలోని పంట పొలాలు కూడా వరద ముంపునకు గురయ్యాయి.
బూర్గంపాడు -సోంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు బంద్:
బూర్గంపాడు- సోంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు సోమవారం సాయంత్రం నుంచి నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద 48 అడుగులు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించడంతో బూర్గంపాడుకు సమీపంలోని దోమల వాగు ప్రాంతం మీదుగా ఈ రహదారిపై వరద నీరు చేరుకుంది. ఈ క్రమంలో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సోంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు బూర్గంపాడుకి రావాలంటే బుడ్డగూడెం, మోరంపల్లి బంజర, మీదుగా ఈ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది.
మేలు కన్నా కీడు చేస్తున్న గోదావరి- కిన్నెరసాని:
బూర్గంపాడుకు అటు గోదావరి నది.. ఇటు కిన్నెరసాని నది ప్రవహించడంతో మండల కేంద్రానికి చెందిన రైతులకు, ప్రజలకు మేలు కన్నా కీడే ఎక్కువ కలుగుతోంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో వచ్చే గోదావరి వల్ల బూర్గంపాడుకు దక్షిణం వైపున ప్రవహిస్తున్న కిన్నెరసాని నది ఉత్తరం వైపు ఉన్న గోదావరి నదిలో కలుస్తుంది. ఈ క్రమంలో గోదావరి వరద ఉధృతి అధికంగా ఉన్న సమయంలో కిన్నెరసాని నదీ ప్రవాహం గోదావరి నదిలో కలిసే సమయంలో గోదావరి ఎగ పోటు వల్ల కిన్నెరసాని జలాలతో పాటు గోదా వరి నీటి వరద పోటు చేయటంతో మండల కేంద్రం బూర్గంపాడు ముంపునకు గురవుతుంది. దీంతో బూర్గంపాడులో ఉన్న ప్రజలకు ఇటు రైతులకు కిన్నెరసాని, గోదావరి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ ప్రతీ సంవత్సరం జరుగుతోంది.
లోతట్టు ప్రాంతాలలో కనిపించని అధికారుల బృందం:
మండలంలోని వరద ముంపుకు గురయ్యే లోత ట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలు గురవుతూ ఏ క్షణమున ఏమి జరుగుతుందనే ఆందోళనలో ఉన్నా రు. వరద ముంపు గురయ్యే ప్రాంతాలలో బూర్గం పాడు మండల అధికారుల బందం కనీసం ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. కేవలం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గోదావరి వరద ఉధతులు చూసేందుకు భద్రాచలం వెళ్లే సమయంలో బూర్గం పాడులోని గోమ్మూరు గోదావరి రేవును పరిశీలించారు ఈ సమయంలో మండల అధికారులు అక్కడ మంత్రి తో కొద్దిసేపు ఉండి మంత్రి వెళ్ళిన తర్వాత వీరంతా ఎటు వెళ్లారో వారికి తెలియకుండా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారులు ఎవరికి వారే యమునా తీరుగా…ఉండటంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం పత్రికా విలేకరులకు సైతం సమాచారం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తు న్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో గోదావరి వరదలు వచ్చిన సమయంలో మండల అధికారుల బందం లోతట్టు ప్రాంతాలలో పర్యటించడంతోపాటు పత్రిక విలేకరులకు వరద సమాచారం ఎప్పటికప్పుడు అందించే సాంప్రదాయం ఉండేది.ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరించటం పై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.