అత‌ను మారాల‌ని..?

He wants to change..?మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు ఓ మేధావి. ఇటువంటి సమాజంలో డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. వ్యసనాలకు బానిసలై అవసరాలు తీర్చుకునేందుకు వావివరస లను మర్చిపోతున్నారు. కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన బిడ్డల జీవితాలను ఫణంగా పెడుతున్నారు. అయినా భర్తలో మార్పు కోసం తపించే భార్యలు, తల్లి కండ్లలో ఆనందాన్ని చూడాలనుకునే బిడ్డలు ఉండబట్టే బంధాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
45 ఏండ్ల పల్లవి తన కూతురు రుచికను తీసుకొని మా ఆఫీస్‌కు వచ్చింది. పల్లవి కంటే ఆమె సమస్య గురించి రుచికనే ఎక్కువగా మాట్లాడింది. వారి సమస్య అలా ఉంది మరీ. పల్లవికి రఘుతో పెండ్లి జరిగి 25 ఏండ్లు అవుతుంది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మొదటి పాప రుచిక నర్సింగ్‌ చేస్తుంది. రెండో పాప రాగిణి డిగ్రీ చదువుతోంది. అయితే ఆమె భర్తకు పెండ్లికి ముందు నుండే తాగే అలవాటు వుంది. పెండ్లి చేస్తే మారతాడని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అతనిలో ఎలాంటి మార్పూ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు.
పల్లవికి తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఎంత కష్టం వచ్చినా రఘుతోనే కలిసి ఉంటుంది. రఘు వాళ్ళ నాన్న ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఆయన ‘నా కొడుకుతో పెండ్లి చేసి పల్లవికి నేను అన్యాయం చేశాను. ఎలాగైనా ఆమె తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలి’ అనుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని అత్త చూసుకునేది. పల్లవి మళ్లీ చదవడం ప్రారంభించింది. మామగారే ఫీజు కట్టేవారు. అలా పల్లవి మామ ప్రోత్సాహంతో లాబ్‌ టెక్నీషన్‌ కోర్సు చేసి ఉద్యోగం సంపాదించింది. పిల్లల్ని అత్త ఎంతో ప్రేమగా చూసుకునేది. రఘు గురించి ఆలోచించకుండా పల్లవి జీవితం హాయిగా సాగిపోతుంది. ఇలాంటి సమయంలో అంతా మారిపోయింది. పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునే అత్త చనిపోయింది.
తల్లి చనిపోయిన బాధ కూడా లేకుండా రఘు మాత్రం తాగుతూనే ఉన్నాడు. పైగా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. పల్లవి ఉద్యోగం చేసే దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగేవాడు. ఇవ్వనంటే కొట్టేవాడు. భర్తను వదిలి వెళ్లిపోతే సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఆమెలో ఉండేది. అలాగే తనను చదివించి ఉద్యోగం వచ్చేలా చేసిన మామను వదిలి పెట్టి వెళ్ళడం కూడా ఆమెకు కరెక్టు అనిపించలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత ఆయన కూడా చనిపోయాడు. అయితే చనిపోయే ముందు ‘రఘును ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లొద్దు’ అని పల్లవి దగ్గర మాట తీసుకున్నాడు. దాంతో ఇప్పటి వరకు అతను ఎన్ని వేషాలు వేసినా భరిస్తూ వచ్చింది. కానీ ఆమె ఉద్యోగం మాత్రం చాలా ఆస్పత్రుల్లో మారాల్సి వచ్చింది.
ఆమె ఎవరితో మాట్లాడినా వారితో సంబంధం అంటగడుతుంటాడు. అంతే కాదు అందులో కొంత మంది ఫోన్‌ నెంబర్లు తీసుకొని పల్లవి పేరుతో చాట్‌ చేయడం ప్రారంభించాడు. పల్లవి అడుగుతున్నట్టు అడిగి డబ్బులు తీసుకునేవాడు. ఇలా మూడేండ్ల నుండి దాదాపు పది మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే ఆన్‌లైన్‌లో వివిధ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. వాటిని తిరిగి కట్టడు. డబ్బులు చెల్లించకపోవడంతో ఒక యాప్‌ వారు పల్లవి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా మెసేజ్‌ పెట్టారు. అవి చూసి రఘు, పల్లవి పేరుతో చాట్‌ చేస్తున్న వారిలో ఇద్దరు ఆమె ఇంటికి వచ్చారు.
వచ్చీ ‘నేను నీకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూనే ఉన్నాను. అయినా ఏం అవసరం వచ్చిందని ఇలాంటి పనులు చేస్తున్నావు. మేము నీ దగ్గరు వస్తామంటే ఒప్పుకోకుండా మూడేండ్ల నుండి చాటింగ్‌తో కాలం గడుపుతున్నావు. మరి వాళ్ళలో నీకు ఏం నచ్చింది’ అని నిలదీశారు. అప్పుడు గానీ పల్లవికి అసలు విషయం అర్థం కాలేదు. తనకు తెలియకుండా రఘు వాళ్ళతో చాటింగ్‌ చేస్తున్నాడని. భర్త కదా అని గుడ్డిగా నమ్మినందుకు ఇలా చేశాడని కుంగిపోయింది. ‘ఇలా ఎందుకు చేశావు’ అని అడిగితే ‘తాగడానికి డబ్బులు అడిగితే నువ్వు ఇవ్వడం లేదు, అందుకే నీలా చాటింగ్‌ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నా. నీకు వాళ్ళతో సంబంధం లేకపోతే అడిగిన వెంటనే డబ్బులు ఎందుకు ఇస్తారు’ అని పిల్లల ముందే అసభ్యంగా మాట్లాడాడు.
ఇలాంటి పరిస్థితుల్లో కూతురు రుచిక ఇదంతా భరించలేక తల్లిని తీసుకొని ఐద్వా అదాలత్‌కు వచ్చింది. అతన్ని పిలిచి మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. పైగా తల్లికి సపోర్ట్‌ చేస్తున్న రుచికను టార్గెట్‌ చేశాడు. ఇన్ని రోజులు పల్లవి పేరుతో చాటింగ్‌ చేసే అతను ఇప్పుడు కన్న కూతురని కూడా చూడకుండా రుచిక పేరుతో చాట్‌ చేయడం మొదలుపెట్టాడు.
ఏం చేసినా అతనిలో మార్పు రాకపోవడంతో ఇక పల్లవి భరించలేక పోయింది. ఇంకా ఇంకా దిగజారి పోతున్న అతనితో కలిసి వుండడం కష్టమనే నిర్ణయానికి వచ్చింది. అయినా మామకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తన చివరి ప్రయత్నం గా ఐద్వా సహకారంతో రీహాబిటేషన్‌ సెంటర్‌లో చేర్పించింది. ప్రస్తుతం అక్కడ అతనికి కౌన్సెలింగ్‌ ఇస్తూ చికిత్స చేస్తున్నారు. ఇప్పటికైనా భర్తలో మార్పు వస్తుందేమో అనే ఆశతో ఎదురుచూస్తోంది.

– వై వరలక్ష్మి, 9948794051