ఎవరికైనా ‘రెక్క ఆడుతేనే డొక్కాడుతది’. ఎవల రెక్కల కష్టం వాళ్లదే అయినా ఒక నమ్మిక ఉంటది. ఇప్పుడు కాదు గాని పూర్వకాలంలో ఎక్కువమంది పిల్లలను కనే కుటుంబాలు కనపడుతయి. ఇంతమంది ఎందుకు? సంసారం ఎట్ల నడుస్తుది? అని ఎవరైనా అడిగితే ‘నారు పోసిన వాడు నీరు పోయ్యడా’ అని ఎదురు సమాధానం ఇస్తారు. అదొక విశ్వాసం నిజం కావచ్చు, కాకపోవచ్చు. అది వేరే విషయం గానీ ఇట్లనే మరొకటి అంటారు. ‘కండ్లు పోగొట్టిన పరమాత్ముడు తవ్వచూపుతడు’ అంటూ నడుస్తారు. ఏదో ఒక పాజిటివ్ దృక్పథం అలవర్చుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని కావచ్చు. ‘గాశారం మంచిగా లేకపోతే తాడే పామై కరుస్తుది’ అనేది గ్రహచారం మీద పుట్టిన మరొక సామెత. అంటే కావాల్సింది అయితది. జరగవలసింది జరుగుతది. అయ్యేదాన్ని ఎవ్వడు ఆపలేడు. ఇట్లాంటి మాటల మధ్య పుట్టిన సామెత ఇది. అట్లనే ‘కడుపు వచ్చినంక కనక తప్పది’ అన్నట్టు చేసుకున్నంక తప్పనిసరి జరిగే పరిస్థితిని ఇలా సులువుగా చెబుతారు. అట్లనే ‘ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళ అనుభవించాల్సిందే’ అనే సామెత కూడా ఉంది. వట్టిగ కూసుంటే కడుపులకు ఎట్లా ఎల్లుతది అన్నట్టు. ‘దేవుడు ఇస్తుడు గాని వండి పెడతాడా’ అని సామెత మాట మాట్లాడతరు. ఊరివాళ్లు మాట్లాడుకునే సామెతల మీద ఎన్నైనా రాసుకోవచ్చు. అయితే ‘నందిని చేయ్యపోతే పంది అయితది’ అని ముందే ఊహించుకోవద్దు.
– అన్నవరం దేవేందర్, 9440763479