– పేదలకు ఇండ్లు, స్థలాల పట్టాలకు కృషి
– వరంగల్ ఎంపీ కడియం కావ్య
– సీపీఐ కార్యాలయం సందర్శన.. నేతలకు కృతజ్ఞతలు
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎంపీగా గెలిచిన కడియం కావ్య స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి శుక్రవారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి ఎన్నికలలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కడియం కావ్య మాట్లాడారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో తనను సొంత పార్టీ అభ్యర్థిగా భావించి సీపీఐ కార్యకర్తలు కష్టపడి పనిచేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌లో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో పేదలు, గుడిసె వాసులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలకు పట్టాలు అందించేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ…పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని మట్టికరిపించేందుకు సీపీఐ కార్యకర్తలు కృషి చేశారన్నారు. కాంగ్రెస్ గెలుపులో సీపీఐ కీలకపాత్ర పోషించిందన్నారు. పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.విజయసారథి, నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, పి.సుగుణమ్మ, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌కే భాషామియా, మద్దెల ఎల్లేష్ పాల్గొన్నారు.