ప్రజల మనసు గెలిచాడు

IAS officer Krishna Tejaఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసేవారు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి వ్యక్తులలో యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ ఒకరు. తొలిరోజు నుంచి అద్భుత పని తీరుతో ఆకట్టుకుంటూ అడుగుపెట్టిన ప్రతిచోటా తనదైన ముద్ర వేస్తున్న ఈ తెలుగుతేజాన్ని జాతీయస్థాయి పురస్కారం వరించింది. కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కలెక్టర్‌గా మాదకద్రవ్యాలపై తాను ప్రకటించిన యుద్ధంలో విజయం సాధించిన తెలుగు రత్నం సేవలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ గుర్తించి ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. మరోవైపు ఆయనను తన ప్రత్యేక కార్యదర్శిగా ఏపీ డిప్యూటి సీఎం పవన్‌ కళ్యాణ్‌ పట్టుపట్టి మరీ సాధించడంతో ఇప్పుడు కృష్ణతేజ డిప్యుటేషన్‌పై ఏపీకి రానున్నారు. యాదృచ్చికంగా జరిగిన ఈ రెండు సందర్భాలతో ఆ యువ అధికారి పేరు అటు కేరళ తోపాటు.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. కేరళలో అనేక విన్నూత సేవా కార్యక్రమాల ద్వారా చిన్న వయసులోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. ఫేస్‌బుక్‌లో I Am For Alleppey అనే పేజీని క్రియేట్‌ చేసి ఒక సంచలనం సృష్టించాడు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా దేశానికి తన వంతుగా సేవలు అందిస్తున్న గుంటూరు కుర్రోడు, ఐఏఎస్‌ ఆఫీసర్‌ పై ప్రత్యేక కధనం ఈ వారం జోష్‌..

ఆగస్ట్‌ 2018 లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల బారిన పడిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజకు అదే ఫస్ట్‌ పోస్టింగ్‌. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాతయనే ముందస్తు సమాచారం సబ్‌ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజకు అందింది. అంతగా అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్‌ పైనో, ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి రాజకీయనాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు. కానీ కష్ణతేజ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. దానికి కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్‌ థామస్‌ ఐజాక్‌ పూర్తి సహకారం అందించారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. డ్యామ్‌లను తెరిస్తే కుట్టనాడ్‌లోని దిగువ ప్రాంతాలకు నీరు వరదలు వస్తాయని, ఆ ప్రాంతం మునుగుతుందిని గ్రహించిన వారు ముందు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావించారు. ఆ వెంటనే ఆపరేషన్‌ కుట్టనాడ్‌ను ప్రారంభించారు. కుట్టనాడ్‌ ప్రజలను రాబోయే గంటల్లో వారు ఎదుర్కోవాల్సిన ప్రమాదం గురించి తెలియకుండానే ఆ స్థలం నుండి ఖాళీ చేయించి పునరావాసం, సహాయ శిబిరాలను ఏర్పాటుచేశారు. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్‌ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్య్కూ ఆపరేషన్స్‌లో ఒకటిగా కుట్టునాడు నిలిచింది.
అంత తేలికైన విషయం కాదు
రానున్న వరదల వల్ల తమకు నష్టం వాటిల్లదని నమ్మిన ప్రజలను ఖాళీ చేయించడం అంత తేలికైన విషయం కాదు. 48 గంటల్లోనే వరదలు రావడంతో మంత్రి థామస్‌ ఐజాక్‌, సబ్‌ కలెక్టర్‌ కృష్ణతేజ అందుబాటులో ఉన్న జిల్లా స్థాయి అధికారులను సమావేశానికి సమీకరించారు. భారీ వర్షాల కారణంగా రహదారి సౌకర్యం లేకపోవడంతో 2 లక్షల మందికి పైగా ప్రజలను తరలించగలరో లేదో అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ప్రజలను రక్షించడానికి పడవలే ఏకైక మార్గం కాబట్టి, కృష్ణతేజ పడవలను సేకరించడం ప్రారంభించారు. ఐజాక్‌ ప్రజలను ఖాళీ చేయమని ఒప్పించేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహాయంతో, వారు స్వచ్ఛందంగా, బలవంతంగా (భౌతికంగా కాదు) ప్రజలను వారి ఇండ్లను విడిచి వెళ్ళమని ఒప్పించగలిగారు. NDRF, BSF బృందాలు కూడా మిషన్‌కు మద్దతు ఇచ్చాయి. ఈ మిషన్‌ కోసం 200కి పైగా పడవలను మోహరించి మూడు రోజుల్లో, వారు కుట్టనాడ్‌ నుండి 2.5 లక్షల మందిని రక్షించగలిగారు. అంటే దాదాపు 95% మంది అక్కడ నివసిస్తున్నారు.
మూడు రోజుల తరువాత కుట్టనాడ్‌ ఆపరేషన్‌ పాక్షికంగా పూర్తయింది. ప్రజలను మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే జంతువులను కూడా రక్షించాల్సి వచ్చింది. జంతువులూ రక్షించబడి… సురక్షితంగా తరలించబడ్డాయి. అందరికి అవసరమైన ఆహారాన్ని, వైద్యాన్ని కూడా అందించారు. అంతటితో వీరు ఆగిపోలేదు. రాబోయే రోజుల్లో వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్న వారికి సహాయక శిబిరాలకు అవసరమైన సామాగ్రి చేరేలా చూసేందుకు వారు అక్కడే ఉండవలసి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, గివ్‌ ఇండియా, ది బెటర్‌ ఇండియా సంస్థలు కలిసి నిధులను సేకరించడం ద్వారా కేరళను పునర్నిర్మించడంలో సహాయం చేశాయి. వరదల వల్ల ప్రభావితమైన 41,000 మందికి మద్దతు ఇచ్చాయి. ప్రకృతి విసిరిన సవాళ్లను స్వతంత్రంగా, అలాగే అధికారుల సహకారంతో కేరళ ఎదుర్కోగలిగింది. చాలా మంది కేరళ ప్రజల పక్షాన నిలిచారు. వీలైనంత వరకు వారి జీవితాన్ని తిరిగి పొందడంలో వారికి మద్దతు ఇచ్చారు. కేరళ స్థితిని తిరిగి బ్రతికించడంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరూ చేసిన వీరోచిత చర్య ఇది.
ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ
ఆపరేషన్‌ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలను సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్‌ నుంచి అందే సాయం కోసమే ఎదురుచూస్తూ కూర్చోకుండా ‘ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ’ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది. అలెప్పీకి తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ఎంతోమంది ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం ఎంతో మంది ప్రముఖల నుంచి సామాన్యుల వరకు అలెప్పీ పున:నిర్మాణానికి చేయూత అందించారు. పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్‌ ఫర్‌ అలెప్పీ ఓ ఫేస్‌ బుక్‌ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్‌ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్‌ ను మెయింటైన్‌ చేశారంటే కృష్ణ తేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్‌రేస్‌ను తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళ వాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్‌ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ను బోట్‌రేస్‌కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.
తల్లడిల్లిన అలెప్పీ
అలెప్పీ సబ్‌ కలెక్టర్‌ పొజిషన్‌ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు అలెప్పీ వాసులు తెలుసుకుని తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు
కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్‌ చూపించారు. ‘మిషన్‌ ఫేస్‌ లిఫ్ట్‌’ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్‌ చేయించారు. రిసార్టులను అభివృద్ధి చేయటంతో పాటు మాయా పేరుతో ఓ చాట్‌ బోట్‌ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్‌ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో సక్సెస్‌ అయ్యారు. క్యారవాన్‌ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవాన్‌ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగిరండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.
కరోనా సమయంలో..
కరోనా విలయం కేరళను చుట్టేయటంతో ప్రజలకు మరింత సేవలను అందించేలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణ తేజకు కేరళ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతీ ఇంటికి ఫుడ్‌ కిట్‌, ఇంకా నిత్యావసరాల కిట్‌లను అందించేలా కృష్ణతేజ రూపొందించి రూట్‌ మ్యాప్‌ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ సమయంలో కేరళ ఆరోగ్యమంత్రి కె.కె.శైలజ టీచర్‌కు దేశవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చిందో.. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణతేజ అంతే గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
అలెప్పి జిల్లా కలెక్టర్‌గా..
అలెప్పీలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రిసార్టు మాఫియాను తరిమికొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 200 కోట్ల విలువైన కళ్లు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు… జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు. అన్నీ అక్రమంగా సరస్సును ఆక్రమించి కట్టుకున్నవి కావడం విశేషం. కేరళలోని అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్‌ సరస్సు… వద్ద కపికో రిసార్టు పేరు తెలియని వాళ్లుండరు. అంత విలాసవంతమైన రిసార్టు అది. సామాన్యులకు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే రూ. 55 వేలు. మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగే వాడెవ్వడని దాన్ని పదెకరాల్లో కట్టారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్య్సకారులను తొక్కి పడేశారు. కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్లకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై ఆ కట్టడాలు తొలగించేందుకు న్యాయం స్థానం అనుమతులు తెచ్చుకున్నారు.
సమస్యంతా ఇక్కడే.. వాటిని అమలు చేసే అధికారి ఎవ్వరనేది. కానీ ఈసారి అలెప్పీ కలెక్టర్‌గా అక్కడకు వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్‌ ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు. ప్రభుత్వ సహకరాంతో అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు.
కలెక్టర్‌ మామన్‌గా పేరు..
కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి, అక్కడి పిల్లలకు కలెక్టర్‌ మామన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్‌ చేశారో లెక్కనే లేదు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో. ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి. వీఐపీ అంటూ ఓటర్‌కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన త్రిసూర్‌లో ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది.
ఇవన్నీ పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి..
ఇవన్నీ గమనించిన పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పవన్‌ కళ్యాణ్‌, కృష్ణతేజ కలిశారు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417