– హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోరు
– ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో నువ్వా నేనా?
– మిజోరంలో హంగ్ : ఎగ్జిట్ పోల్స్
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాషాయ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. నవంబరు 30తో రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే గట్టి పోటీ నెలకొందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానికి స్వల్ప మెజారిటీ ఇస్తూ వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ సర్వే వివరాలను వెల్లడించాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వుంది. మిజోరంలో ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) ప్రభుత్వం వుంది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో బీజేపీ కన్నా ముందంజలో వుంటుందని యాక్సిస్ ఇండియా టుడే అంచనా వేసింది. ఇంతకుముందు వెలువడిన ఒపీనియన్ పోల్స్ చూసినట్లైతే రాష్ట్ర ప్రజలు తమ చారిత్రక సాంప్రదాయాన్ని అనుసరించి, ప్రస్తుతం అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని పక్కనబెట్టి బీజేపీని గెలిపిస్తారని పేర్కొన్నాయి.
అదే సమయంలో, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ వుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. అయితే ఎక్కువ ఒపీనియన్ పోల్స్ వివరాలు చూసినట్లైతే కాంగ్రెస్‌కు మంచి విజయం అందుతుందని అంచనా వేశాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు నెలకొన్నా..కాంగ్రెస్‌కు కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పోల్స్ వివరాలు తెలియచేస్తున్నాయి.
మిజోరంలో ముఖ్యమంత్రి జొరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), మరో ప్రాంతీయ పార్టీ అయిన జొరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్‌ఎన్‌ఎఫ్)కి మధ్య గట్టి పోటీ వుందని వెల్లడైంది. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర వుంటుందని భావిస్తున్నారు. బీజేపీ ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు.