హర్యానా శాసనసభ ఎన్నికలు అక్టోబరు ఐదో తేదీన ఒకేవిడతగా జరగనున్నాయి. సెప్టెంబరు పదహారుతో నామినేషన్ల చివరి దశ ముగుస్తుంది. కేంద్రలో మూడోసారి మూలు గుతూ అధికారానికి వచ్చిన బీజేపీ ఇక్కడ కూడా మూడోసారి ఎలాగైనా అధికారం నిలుపు కోవాలని నానా తంటాలు పడుతుంటే కాంగ్రెస్ కూడా అంతే ఆశతో వ్యూహాలు రచిస్తున్నది. ఏమంటే మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో వున్న పది స్థానా లలో ఇరు పార్టీలకూ సమానంగా చెరి అయిదు వచ్చాయి. అటూ ఇటూ కలుస్తూ అధికారంపై ప్రభావం చూపుతున్న ప్రాంతీయ పార్టీల మనుగడ కాపాడుకునే పరిస్థితిలో పడిపోయాయి.ఆ విధంగా చూస్తే హిందీ రాష్ట్రాలలో హర్యానాది ప్రత్యేక పరిస్థితి.ఇక్కడ ప్రధాన పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యనే జరుగుతున్నా ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని కాదనడానికి వుండదు.అలా అవే చక్రం తిప్పడమూ జరగదు.దేశ రాజధానికి దగ్గరగా వుంటూ ఢిల్లీని అమితంగా ప్రభావితం చేసే హర్యానాలో బీజేపీ హిందూత్వ ప్రభావం కన్నా రాజకీయ వ్యూహాలతోనే ఎక్కువగా పట్టు సాధించగలిగింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే మధ్య మధ్య విరామాలతో వారు ప్రధాన శక్తిగా కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్‌లోనే లేక అప్పటి జనతా జనతాదళ్ వంటి పార్టీలతోనో వుండి అధికారం పోయాక ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న రాజకీయ కుటుంబాలు ప్రాబల్యం సాగిస్తుం టాయి. వాటాను పొందుతుంటాయి. హర్యానా వికాస్ పార్టీ, ఇండియన్ యూనియన్ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ వంటివి ఆ విధంగా చెప్పుకోదగినవి. ఓం ప్రకాశ్ చౌతాలా, దుష్యంత్ చౌతాలాలతో కూడిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుటుంబం, బన్సీలాల్ దీపేందర్ హుడా, రావు బీరేంద్రసింగ్‌ల కుటుంబాలు అక్కడ రాజకీయాలలో కీలక స్థానమాక్రమించి నడిపిస్తూ వచ్చాయి. వారి మధ్యనే ముఖ్యమంత్రి పీఠం అటూ ఇటూ మారుతూ వచ్చింది. కానీ గత పదేండ్లలో మాత్రం బీజేపీ పాలనలోనే కొనసాగింది.ఆర్థిక, సామాజిక నేపథ్యంలో చూసినా హర్యానా రాజకీయాలలో జాట్ ప్రాబల్యం ఒక కీలకాంశంగా వుంటుంది.పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానాకు అక్కడి రాజకీయాలతో ఏ మాత్రం పోలిక వుండదు. కానీ రైతు ఉద్యమంలో మాత్రం ప్రధాన పాత్ర పోషించింది. బడా వాణిజ్య, భూస్వామ్య వర్గాలు కూడా హర్యానాలో ఏకకాలంలో పట్టుకలిగి వుండటం విశేషం.
బీజేపీ వ్యూహాత్మక రాజకీయం
పదేండ్లుగా హర్యానాను బీజేపీ పాలిస్తున్నా సంప్రదాయికంగా ఇది వారి కంచుకోట కాదు. 1977 జనతా ప్రయోగం తర్వాత కూడా జనతా జనతా దళ్(సమతా) లేదా ఆ నాయకులు ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలే నిర్ణాయకపాత్ర పోషిస్తూ వచ్చాయి.1996లో ఇన్‌చార్జిగా వచ్చిన నరేంద్ర మోడీ బన్సీలాల్ హర్యానా వికాస్‌పార్టీతో కలసి మొదటిసారి అధికారంలో భాగం వచ్చేలా చేశారు. అయినా తర్వాత మళ్లీ 2000లో బీజేపీకి ఆరు,2005లో రెండు స్థానాలే దక్కాయి.2000లో ఓం ప్రకాశ్ చౌతాలా ఐఎన్‌ఎల్‌డి తరపున 47 స్థానాలతో ముఖ్యమంత్రి కాగా తర్వాతి రెండు పర్యాయాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భూపేందర్‌సింగ్‌్ హుడా కొనసాగారు. 2014, 2019లో బీజేపీ కొనసాగింది.దేవీలాల్ కుటుంబం నుంచి చీలిపోయిన దుష్యంత్ చౌతాలా ఐఎన్‌ఎల్‌డికి పోటీగానే జేజేపీని ఏర్పాటు చేశారు.అయితే గత పర్యాయం అవసరమైన మెజార్టీ రాకపోవడంతో దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జేజేపీతో చేతులు కలిపాల్సి వచ్చింది. తగు గౌరవం ఇవ్వలేదనే కారణంతో జేజేపీ 2024 ఎన్నికలకు ముందే ప్రభుత్వం నుంచి వైదొలగగా ఇండిపెండెంట్ల సహాయంతో నెట్టుకువస్తున్నారు. అయితే తీరా ఆ ఎన్నికల ప్రాంగణంలో అప్పటిదాకా ముఖ్య మంత్రిగా వున్న మనోహర్‌లాల్ కట్టార్‌ను తొలగించి నయాబ్ సింగ్ సైనీని నియమించింది బీజేపీ అధిష్టానం.
వ్యతిరేకతకు కారణాలు
ఇన్ని మార్పులు చేసినా లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశవ్యాపితంగా సాగిన రైతు ఉద్యమంలో హర్యానా రైతులు ఓక ముఖ్యపాత్ర పోషించారు. కనీస మద్దతు ధర నిర్ణయంలో నిర్లక్ష్యం ఈ రాష్ట్రంపై చాలా ప్రభావం చూపింది.ఆ సందర్భంగా సాగిన నిర్బంధం, కర్నాల్ చెక్‌పోస్టు వద్ద ఘటనలు దేశమంతా సంచలనం కలిగించాయి.ఫసల్ బీమా కింద సహాయం కోసం రైతులు ఈ అకౌంట్లు తెరవాలని హడావుడి చేసినా ఆచరణలో ఫలితం లేకపోయింది.నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుండగా అగ్నివీర్ పథకం కింద తాత్కాలిక సైనిక నియామకాల విధానం కూడా నిరసనకు గురైంది.రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా వున్నా నియామకం చేపట్టలేదు. కాంగ్రెస్ సగం తెచ్చుకోగలిగింది.2019 ఎన్నికలలో ఆప్ ఇక్కడ అన్ని స్థానాలకు పోటీ చేయడంతో ఓట్లు చీలిపోవడం బీజేపీకి మేలు చేసింది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ చెరి అయిదు స్థానాలు తెచ్చుకున్నా ఇండియాలోని కాంగ్రెస్, ఆప్‌లకు కలిపి చూస్తే 46 (42+4) అసెంబ్లీ విభాగాల్లో మెజార్టీ వచ్చినట్టయింది. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యత తెచ్చుకోగలిగింది. దీనికి తోడు జాతీయ స్థాయిలోనూ బీజేపీ ఆధిక్యత తెచ్చుకోలేక మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడవలసిన పరిస్థితి రాష్ట్రంపైనా ఇప్పుడు మరింత ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో యువతకు ఉద్యోగ భద్రత కల్పించడంపై ఏకంగా ఆర్డినెన్సునే జారీ చేశారంటే ఎంత ఆందోళనగా వున్నదీ విదితమవుతోంది. బిసీ తరగతుల క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంపు. పొలాలతో వచ్చే ఆదాయంపైన పన్ను వుండదనే హామీ ఇలా వరస ఉత్తర్వులతో ఓట్లు రాబట్టడానికి బీజేపీ తంటాలు పడుతున్నా పరిస్థితి గడ్డుగానే వుంటోంది.రెజ్లర్ వినేష్ ఫొగట్ ఉదంతం కూడా విముఖత పెంచింది. బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని ఇది ఎంతగా దెబ్బతీసిందంటే ఎన్నికల తేదీలే వాయిదా వేయాలని, ఎన్నికల సంఘాన్ని కోరేవరకూ వెళ్లింది. ఎన్నికల ప్రకటన తర్వాత బీజేపీ నాయకత్వం అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్‌లాల్ కట్టర్ వంటివారు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తులు చేసినా ఆరెస్సెస్ మాత్రం సగంమంది అభ్యర్థులను మార్చాల్సిందేనని హుకుం జారీచేసింది. గత తప్పిదాలను దిద్దుకోవడానికి అవస్థలు పడుతుంటే కంగనా రనౌత్ రైతు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసి వుండాల్సిందని నోరుపారేసుకోవడం మరింత దెబ్బగా పరిణమించింది. ఆభయంతోనే కేంద్ర నాయకత్వం ఆగమేఘాల మీద రంగంలోకి దిగి ఖండించాల్సి వచ్చింది. అయినా నష్టం తప్పడం లేదు. పైగా ఆమె తర్వాత కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ అవకాశాలు, అనైక్యత
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అనైక్యత షరామామూలు సమస్యే. అందులోనూ కాస్త అనుకూల వాతావరణం కనిపించడంతో తగాదాలు మరింత ముదురుపాకాన పడుతున్నాయి.భూపేందర్ సింగ్ హుడా,ఆయన కుమారుడు దీపేందర్ సింగ్ హుడా, కోడలు ప్రేమలత, కేంద్ర మాజీమంత్రి సెల్జా, సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జీవాలా వంటివారు తమ తమ ఆధిపత్యాల కోసం పెనుగులాడుతున్నారు.ఇదే చాలక బీజేపీలోకి వెళ్లిన మాజీ మంత్రి రావుబీరేంద్రసింగ్ ఆయన కుమారుడు బ్రిజేంద్ర సింగ్ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చి పోటీ పడుతున్నారు. వీరిలో సెల్జా, దీపేందర్ సింగ్, బ్రిజేంద్ర సింగ్ వంటివారు మొన్ననే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటు సభ్యులెవరూ శాసనసభ పోటీలో వుండబోరని స్పష్టం చేసింది. ‘ఇండియా’ కూటమి అంటున్నా కాంగ్రెస్‌కు ఎవరితో పొత్తులేదు. పక్కనే పంజాబ్‌ను పాలిస్తున్న ‘ఆప్’ సరిహద్దులలో వున్న 28 సీట్లపై కేంద్రీకరిస్తుందని చెబుతున్నారు.ఫలితాల తర్వాత కూడా బీజేపీ ఆప్ మద్దతునిచ్చే అవకాశం వుండకపోవచ్చు. ఒపీనియన్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యత కనిపిస్తున్నా కొన్ని బీజేపీకీ మొగ్గు చూపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల తర్వాత దృశ్యం మారిందనే సంకేతమివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటిని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం ఐక్యతను పెంచడానికి, తామే విజేతలమన్న భావం బలోపేతం చేయడానికి నడుం కట్టింది.మరింత మంది పరిశీలకులను వినియోగిస్తోంది. వాస్తవానికి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో జాట్ ఆధిక్యత వున్న హిస్సార్, సోనేపట్, సిర్సా,రోహ్తక్ వంటి చోట్ల , రైతు ఉద్యమం బలంగా సాగిన అంబాలాలో కాంగ్రెస్ గెలుపొం దడం సామాజిక సమీకరణల సంకేతాలు మార్చింది. కర్నాల్, కురుక్షేత్ర, బివానీ,గుర్గావ్,ఫరీదాబాద్ వంటి చోట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి వున్నా బీజేపీ లోక్‌సభ స్థానాలు తెచ్చుకుంది.
సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కమిటీ సమావేశం బీజేపీని ఓడించడం, ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పర్చడం, వామపక్షాల బలం పెంచుకోవడం మూడు లక్ష్యాలుగా ప్రకటించింది. ఈ కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చీలిక నివారించడం కోసం అభ్యర్థులను నిలపలేదు. ఇప్పుడు కూడా మత రాజకీయాలను ఓడించడం, ఇండియా వేదిక విజయానికి ప్రాధాన్యత తమ విధానంగా రాష్ట్ర కార్యదర్శి సురేంద్రసింగ్ వివరించారు. జిల్లా కమిటీల సూచనలు తెప్పించామనీ, మరికొంత కసరత్తు ఇతర పార్టీల ఎంపికలు చూసి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రాంతీయుల ప్రభావమెంత?
ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరాటంగా వుంటే ప్రాంతీయ పార్టీల మనుగడ మరో సవాలుగా మారింది. పైనే చెప్పుకున్నట్టు ఈ రెండు పార్టీల మధ్యన గతంలో రాష్ట్రాన్ని పాలించిన నేపథ్యం వాటికి వుంది.అయితే మొన్నటి లోక్‌సభ ఎన్నికల దెబ్బతో అవి ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఈ పార్టీలే పొత్తులకు కూడా సిద్ధమవడానికి కారణమదే. ఐఎన్‌ఎల్‌డి బీఎస్పీతో జట్టుకట్టింది.మాయావతి నుంచి విడిపోయిన చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఎస్పీ(కాన్షీరాం)వర్గం జేజేపీతో పొత్తు పెట్టుకుంది. గతంలో బీఎస్పీకి స్థానాలువచ్చిన ఉదాహరణలున్నాయి, జనాభాపరంగా కూడా జాట్‌లు 25శాతం అయితే దళితులు 20శాతం వున్నారు, మొత్తం 17 రిజర్వుడు స్థానాలున్నాయి. 2019లో పదిస్థానాలు తెచ్చుకున్న జేజేపీతో జట్టుకట్టిన బీజేపీ ఇప్పుడు దూరం కావడం ఇతర వర్గాలలో పట్టు పెంచుకోవడమే. ఆపార్టీ తరపున గెలిచిన పదిమందిలో ముగ్గురే మిగలగా తక్కిన వారు కాంగ్రెస్, బీజేపీలలో కలసిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు కూడా రానిస్థితి. బీజేపీపై వ్యతిరేకత తమను దెబ్బతీసిందని జేజేపీ భావనగా వుంది. వీటన్నిటి అంతిమ ఫలితం ఏమిటో చూడవలసిందే.ప్రజాస్వామ్య లౌకిక విలువలు, రాష్ట్రాల హక్కుల కోసం గట్టిగా నిలబడకపోతే ప్రాంతీయ పార్ట్లీల అవకాశవాద పోకడలు వాటి అస్తిత్వానికే ముప్పు తెస్తాయనే వాస్తవాన్ని కూడా హర్యానా అనుభవం చెబుతున్నది. జేజేపీ మద్దతు తీసుకుని కూడా నిష్కర్షగా గెంటివేసిన బీజేపీ తీరువాటికి ఒక హెచ్చరికగానూ వుంటుంది. మొత్తంపైన సర్వేలు,లోక్‌సభ ఫలితాల తీరు చూస్తే ఇక్కడ బీజేపీ ఎదురుదెబ్బ తినే అవకాశం ఎక్కువగా వుంటుందన్న పరిశీలకుల భావన నిజమయ్యే అవకాశాలే ఎక్కువ.
తెలకపల్లి రవి