– ఆదివాసీల అణచివేత…మావోయిస్టుల ఎన్‌కౌంటర్లు
– అదానీ కోసం లక్షల చెట్ల నరికివేత
– వనరులపై కార్పొరేట్ల పంజా
– ఈసారి బీజేపీకి షాకే..: కాంగ్రెస్‌కు రాహుల్ జోడో యాత్ర మేలు
– రేపు 7 స్థానాల్లో పోలింగ్
– గిరిజన హక్కులను కాలరాసి కార్పొరేట్ ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేస్తోంది. కార్చిచ్చులు పేరిట, మైనింగ్ ప్రాజెక్టుల కోసం అరణ్యాలను కరిగించేస్తోంది. నీరు, అరణ్యం, భూముల కోసం ఆదివాసీల ఆందోళనలను రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అమానుషంగా అణచివేస్తోంది.
– రెండేండ్లలో నక్సలైట్లను ఏరిపారేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఏప్రిల్ 16న 29 మంది, 30న 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 91 మంది మావోయిస్టులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. 123 మంది అరెస్టు కాగా, 250మంది లొంగిపోయారు. లోక్‌సభ ఎన్నికలపై ఈ పరిణామాల ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 11 నియోజకవర్గాల్లో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 26న జరిగిన రెండవ దశలో 4 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన ఏడు సీట్లకు మూడో విడతలో మే 7న పోలింగ్ జరగనుంది. జాంజ్‌గీర్, బిలాస్‌పుర్, కోర్బా, రారుగఢ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగాఉంది. బీజేపీ హిందుత్వ రాజకీయాలను, కార్పొరేటీకరణకు గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. రాజధాని రారుపుర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వికాస్ ఉపాధ్యరుకు పోటీగా బిజెపి అభ్యర్థి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ పోటీ పడుతున్నారు. ఈసారి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునీల్ సోనీని మార్చేసి సీనియర్ ఎంఎల్‌ఎ అగర్వాల్‌కు ఇచ్చింది. ఈ స్థానంలో ఏడుసార్లుగా బీజేపీ గెలుస్తోంది. స్టీల్, ఇనుము, పరిశ్రమల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మూడు లక్షల మంది ఎస్సీలు, 1,28 లక్షలమంది ఎస్టీలు ఉన్నారు. ఇక్కడ 11.29 లక్షల పట్టణ ఓటర్లే కీలకం. దుర్గ్ లోక్‌సభ స్థానంలో ఒకసారి కాంగ్రెస్, మరోసారి బిజెపి గెలుస్తున్నాయి. దుర్గ్ పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ ఒకటి గెలిచాయి. దుర్గ్ ప్రాంతానికి దగ్గరలోనే బిలారు స్టీల్ ప్లాంట్ ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరాల్లో దుర్గ్ ఒకటి. కాంగ్రెస్ నుంచి రాజేంద్ర సాహుకు పోటీగా బిజెపి సిట్టింగ్ ఎంపీ విజరు బఘెల్ పోటీపడుతున్నారు.
మతతత్వానికి బీజేపీ పదును
ఆదివాసీ ప్రాబల్యమున్న జాంజ్‌గీర్ ఎస్సీ రిజర్వుడు సీటు. కాంగ్రెస్ నుంచి శివ్‌కుమార్ డిహియా, బీజేపీ నుంచి కమలేశ్ జంగడే తలపడుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. రాహుల్ జోడో యాత్ర ఛత్తీస్‌గఢ్‌లో జాంజ్‌గీర్ నుంచే ప్రారంభ మైంది. గిరిజనులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మోడీ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 23న జంజ్‌గిర్-చంపాలో జరిగి న ర్యాలీలో రామనామి తెగ మత పెద్దలను (ముఖంపై రామనామ ం పచ్చబొట్టు వేయించుకున్నవా రు) మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకోవడం, అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం రాముడి తల్లి ఇలాకా అయిన ఛత్తీస్‌గఢ్‌కు అగౌరవం కాదా అని మోడీ చేసిన వ్యాఖ్యలు మతతత్వ రాజకీయాలకు అద్దంపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. క్రైస్తవ మిషనరీల ముసుగులో మతమార్పిడిలకు పాల్పడుతున్నారని బిజెపి సిఎం స్వయంగా ఆరోపించారు. రాయగఢ్‌లో గోండు గిరిజనుల ప్రాబల్యమెక్కువ. ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన ఈ స్థానంలో కాంగ్రెస్‌కు పట్టుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ పుష్పాదేవికి బదులు ఆమె చెల్లి మేనకా దేవికి టిక్కెట్టు దక్కింది. మేనకా తండ్రి రాజానరేష్ చంద్రసింగ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీఎంగా, మంత్రిగా పనిచేశారు. బిజెపి నుంచి రాథేశ్యాం రాఠియా పోటీ చేస్తున్నారు.
బొగ్గు కాలుష్య సమస్య
దేశంలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి జరిగే జిల్లా కోర్బాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పోటీ కూడా మహిళల మధ్యే నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జోత్స్న మహం త్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థి సరోజ్ పాండే పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్‌కు పట్టుంది. 2014 మినహా ప్రతిసారీ కాంగ్రెస్ గెలుపొందుతోంది. సరోజ్‌పాండే రాజ్యసభ సభ్యురాలు, గతంలో దుర్గ్ నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. బొగ్గు గనుల నుంచి వచ్చే దుమ్ము వల్ల పర్యావరణ కాలుష్యం, గనుల కోసం భూములిచ్చిన వారికి పరిహారం, ఉద్యోగ కల్పన వంటి స్థానిక సమస్యలున్నాయి.
అదానీ చెట్ల నరికివేతపై వ్యతిరేకత
బిలాస్‌పుర్‌లో కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థి తోఖన్‌సా హు బరిలో నిలిచారు. దేవేంద్ర యాదవ్ బిలారు నగర్ ఎమ్మేల్యేగా గెలుపొందారు. అయితే ఈ టిక్కెట్ జగదీష్ కౌశిక్ తనకు కేటాయించాలని కోరినప్పటికీ దేవేంద్రకే సీటు దక్కింది. దేవేంద్ర యాదవ్ దేశంలోనే అతి చిన్న వయస్సులో 25 ఏండ్లకే మేయరుగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలోనూ రాహుల్ పర్యటించారు. సర్గుజా ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గోండ్ వర్గానికి చెందిన యువనాయకురాలు శశి సింగ్‌తో బిజెపి అభ్యర్థి చింతామణి మహారాజ్ పోటీ పడుతున్నారు. 2023లో చింతామణి కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి చేరడంతో ఆయనకు ఈ సీటు దక్కింది. అదానీ గ్రూపు బొగ్గు గనుల కోసం 2 లక్షలకు పైగా చెట్ల నరికివేత బిజెపి ప్రభుత్వం పట్ల స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం : కెఎల్ శర్మ
అమేథీ : కాంగ్రెస్ పార్టీ ఎన్నోరోజులు చర్చలు జరిపి అమేథీ, రారుబరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రారుబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి బరిలోకి దిగిన కెఎల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం. ఇది నేను చేస్తున్న పెద్ద ప్రకటన. నేను అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం.’ అని అన్నారు. కాగా, కెఎల్ శర్మ 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేశారు. 1991లో రాజీవ్ గాంధీ తర్వాత కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియగాంధీ 1999లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రారుబరేలీ, అమేథీ రెండుస్థానాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. గాంధీయేతర కుటుంబ సభ్యులు అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి. గతంలో 1991లో ఈ స్థానం నుంచి సతీష్ శర్మ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో రాహుల్‌గాంధీ ఓడిపోయే వరకు అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది.