ఆరోగ్యం

healthప్రతి మనిషికీ ఆరోగ్యం ఎంతో అవసరం. ఏ పని చేయాలన్నా, ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం. అయితే మన శరీరములో ఎలాంటి జబ్బు లేనంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటే అది పొరపాటే. ఒక వ్యక్తి శారీరకంగాను, మానసికంగాను, శరీరకవిధుల నిర్వహణలోను, ఆర్ధికంగాను, సామాజికంగాను తను ఉన్న ప్రదేశంలో సమర్ధవంతంగా నివసించగలిగినప్పుడే నిజమైన ఆరోగ్య వంతులు అవుతారు. ఆరోగ్యం మనిషి ప్రాధమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి.
ప్రస్తుత రోజుల్లో మనిషి ఆరోగ్యంగా ఉండడం అంటే అదో అద్భుతమైన విషయంగా మారిపోయింది. అతి చిన్న వయసులోనే అనేక రకాల రోగల బారిన పడిపోతున్నారు. ఇరవై ఏండ్లకే గుండెపోటుతో మరణిస్తున వారినీ చూస్తున్నాం. ఆరోగ్యకరమైన జీనశైలి అనేది ఒక నైపుణ్యం. శాస్త్రీయంగా నేర్చుకోవాల్సిన విషయం. ‘ఆరోగ్యమంటే జబ్బులేకపోవడం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఒక మంచి పద్ధతిగా ఉండడమే ఆరోగ్యం అని ప్రప్రంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. మనిషి శరీరంలో జరిగే లక్షలాది రసాయనిక చర్యలు, అనువంశికత, మనిషి చుట్టూ ఉండే పర్యావరణం, స్థానిక సంస్కృతులూ ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది వైద్య శాస్త్రం, సామాజిక శాస్త్రాలు కలిస్తే వచ్చే దృక్పథం ఇది.
ఆరోగ్యకరమైన జీవనశైలిలో నాలుగు అంశాలుంటాయి. సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, వ్యక్తిగత జీవితంలో ఆశావహత-వాస్తవిక దృష్టి, సామాజికంగా సానుకూల దృక్పథం-సమిష్టితత్వం. ఈ నాలుగు అంశాలను పాటిస్తున్న వారు ఆరోగ్యకరమైన జీవనశైలితో ఉన్నట్టు లెక్క. మనం మరి వీటిని పాటిస్తున్నామో లేదో ఒక్క సారి పరిశీలించుకోవాలి.
పుష్టి కరమైన ఆహారం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. శాఖాహారులకైనా మాంసాహారులకైనా ఎవరికైనా ఎవరు తినే ఆహారంలో అయిన అన్ని రకాల విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పాలు, పండ్లు, పప్పులు ఆకుకూరలు, కాయకూరలు మున్నగు వాటితో కూడుకొని ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, తగినంత నీరు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. తినే తిండి ఎంత అవసరమో.. వ్యాయామం కూడా అంతే అవసరమని గుర్తించాలి.
ఇటీవల కాలంలో గంటల కొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలే ఎక్కువైపోయాయి. దాని వల్ల శారీక శ్రమకు చాలా వరకు దూరమైపోతున్నారు. దీనికి చక్కని పరిష్కారం వ్యాయామం మాత్రమే. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. కనుక ప్రతి రోజు ఒక గంట కచ్చితంగా నడవాలి. అయితే ఒక్క రోజే, వారం రోజులో చేసి మానేస్తే కుదరదు. నడక మీ జీవితంలో ఓ భాగమై పోవాలి. చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఎప్పుడు మనషు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నవ్వుతూ బతకాలి, నవ్విస్తూ బతకాలి. మనసు స్థిరంగా, నిలకడగా ఒకే విషయంపై లగం అయ్యేట్లు చూసుకోవాలి. దీని కోసం ప్రత్యేకంగా కొన్ని ఆటలు ఉన్నాయి. వాటిని ప్రయత్నించాలి.