క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకుంటే ఏవైనా సంభావ్య అనారోగ్య సమస్యలను ప్రారంభంలోనే గుర్తించవచ్చు, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే మన ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల పరీక్షలు ఉంటాయి. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకునే బదులు, ఒకేసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే చాలా ప్రయోజనం. అవేంటో ఎందుకో ఒకసారి చూద్దాం.
ఫుల్ బాడీ చెకప్ అనేది మీ శరీరంలోని వ్యవస్థలన్నింటి ఆరోగ్యాన్ని అంచనా వేసే ఒక సమగ్రమైన పరీక్ష. ఇందులో భాగంగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మల పరీక్ష, మధుమేహం పరీక్ష, థైరాయిడ్ పరీక్ష, శారీరక పరీక్షలు సహా ఇతర రోగనిర్ధారణ పరీక్షలు అన్నీ చేస్తారు. దీంతో మీ శరీరంలో ఏ చిన్న సమస్యనైనా గుర్తించే వీలు ఉంటుంది, తద్వారా ఏవైనా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు, సమర్థవంతంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. తద్వారా మీరు మీ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.
వ్యాధులను ముందస్తుగా గుర్తిండానికి
ఫుల్ బాడీ స్కాన్ ద్వారా వ్యాధులను వాటి ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు, ఇది మీకు చికిత్స విజయవంతం కావడానికి, మీరు వేగంగా కోలుకోవడానికి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
తీవ్రమైన అనారోగ్య సమస్యల నివారణ
రెగ్యులర్ చెకప్‌లు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
మీ ఆరోగ్యంపై సమగ్ర అంచనా
పూర్తి బాడీ చెకప్ ద్వారా మీ శారీరక , మానసిక ఆరోగ్యంతో సహా మీ సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర అంచనాను అందిస్తుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నియంత్రణ
హైపర్‌టెన్షన్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారికి, ఈ రెగ్యులర్ చెక్-అప్‌లు వారి పరిస్థితిని నియంత్రించడానికి, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సహాయపడతాయి.
క్యాన్సర్‌ను సైతం జయించవచ్చు
క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు, రెగ్యులర్ చెక్-అప్‌ల ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి, అది మరింత అభివృద్ధి చెందకుండా విజయవంతమైన చికిత్స తీసుకోవడానికి, క్యాన్సర్ వ్యాధిని జయించటానికి అవకాశం ఉంటుంది.