ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆవిర్భావ దినమైన ఏప్రిల్ 7న ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణలో ప్రాధాన్యత కలిగిన ఏదో ఒక అంశాన్ని విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతిఏటా ప్రకటిస్తుంది. 2024 సంవత్సరానికి గాను ”నా ఆరోగ్యం -నా హక్కు” అన్న అంశాన్ని ప్రకటించింది. ప్రతివ్యక్తికీ ”ఆరోగ్యం ప్రాథమిక హక్కు”గా గుర్తించిన ఏడు దశాబ్దాల తర్వాత నేటి పరిస్ధితి మనం స్థూలంగా అవగాహన చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ 1948లో ఆరోగ్యం ప్రతి మనిషికీ ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ మానవ హక్కుల ఒప్పందాలలో కూడా ఆరోగ్యం ప్రజలకు ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్యసంస్థలోని సభ్య దేశాలన్నీ అత్యున్నత ప్రమా ణాలు కలిగిన ఆరోగ్య హక్కును పౌరులందరికీ కల్పించేలా ఒప్పందంలో భాగస్వాములయ్యాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్ధిక ప్రణాళికలలో భాగంగా ఆరోగ్యం గురించి కేటాయింపులు, నామ మాత్రపు కృషి తప్పించి ప్రత్యేక లక్ష్యాలు, విధానాల గురించి చర్చ 1978 సంవత్సరానికి ముందు జరగలేదు. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న 450 కోట్ల మందికి అవసరమైన మేరకు ఆరోగ్య సంరక్షణ కల్పించబడటం లేదని 2021 గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని ఈ విధంగా నిర్వచించింది. అరోగ్యమంటే కేవలం వ్యాధి లేక బలహీనత లేకపోవడం కాదు. ఒక పరిపూర్ణమైన శారీరక, మానసిక, సామాజిక స్వస్ధత కలిగి వుండటం. ఈ నిర్వచనాన్ని మనం సమగ్రంగా అర్ధం చేసుకోవాల్సి వుంది. ఆరోగ్యమంటే కేవలం ఒక వైద్యుని సంప్రదించగలగడమో, మందులు వాడు కోగలగడమో, ఒక శస్త్రచికిత్స చేసుకోగలగడమో అనుకోవడం కాదు.. శారీరక, మానసిక, సామాజిక స్వస్ధతల్ని కలిగి వుండటమే ఆరోగ్యమన్న పదానికి పరిపూర్ణమైన నిర్వచనంగా మనం అర్థం చేసుకోవాలి. శారీరక స్వస్థత అంటే హానిరహితమైన పోషకాహారం కలిగివుండటం, పరిశుభ్రమైన తాగునీటి వసతి కలిగివుండటం, పరిశుభ్రమైన వాతావరణం కలిగివుండటం వంటి హక్కులతో ముడిపడి వుంటుంది. మానసిక ఆరోగ్యమంటే తమ వ్యక్తిగత సామర్ధ్యాలను సద్వినియోగం చేసుకోగలగడం, దైనందిన జీవన ఒత్తిడులను ఎదుర్కోగలగడం, మెరుగైన సమాజానికి దోహదపడగలగడం వంటి అంశాలు కలిగి వుంటుంది. సామాజిక స్వస్ధత అంటే సరైన విద్యా వకాశాలు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, అంతరాలు లేని సామాజిక జీవితం, వివిధ వర్గాల ప్రజల మధ్య సౌభ్రాతృత్వం, హింస నుండి స్వేచ్చ, వ్యక్తిగత అంశాల గోప్యతకు, రాజ్యాంగం కల్పించిన మానవహక్కులకు భరోసా వంటి అంశాలు కలిగి వుంటుంది. ఇంతటి సమగ్రమైన నిర్వచనం కలిగిన ఆరోగ్యాన్ని కేవలం ఆసుపత్రుల సంఖ్య, వైద్యుల సంఖ్య, మందుల లభ్యత వంటి అంశాల ఆధారంగా పరీశీలించకూడదు.
ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలంటే ప్రభుత్వాలు తమ ఎజెండాలో ఈ అంశాలన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చి తగినన్ని వనరుల్ని కేటాయించి ప్రణాళికలు రూపొందించాల్సి వుంది. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించాలన్న అజెండాను 1978లో అప్పటి సోవియట్ యూనియన్‌లో జరిగిన ప్రపంచ దేశాల సదస్సులో ఆల్మా-ఆటా డిక్లరేషన్ ద్వారా ఆ సదస్సులో పాల్గొన్న 134 దేశాలు ఆమోదించాయి. 2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం అందించాలన్న ఆ డిక్లరేషన్‌లోనే అందుకు సరైన మార్గం పటిష్టమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను రూపొందించు కోవడమే అని కూడా పేర్కొన్నాయి. అందుకనుగుణంగా తదనంతర కాలంలో ఆయా దేశాలు తమ తమ జాతీయ ఆరోగ్య విధానాలు రూపొందించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్మా-ఆటా డిక్లరేషన్ తర్వాత 1983లో మనదేశ జాతీయ ఆరోగ్య విధానం ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ ప్రధానాంశంగా రూపొందించబడింది. ఈ డిక్లరేషన్ అనంతర కాలంలో కూడా మెజారిటి దేశాలలో అందరికీ ఆరోగ్యం సుదూరపు కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఆల్మా-ఆటా డిక్లరేషన్ చేయబడ్డ నలభై సంవత్సరాల తర్వాత 2018 అక్టోబర్‌లో కజకిస్ధాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఆరోగ్య విధాన సదస్సులో 120 దేశాలు పాల్గొన్నాయి. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సాధనలో లోపాలు సరిదిద్ది ప్రజలందరికీ అత్యున్నత స్ధాయి ఆరోగ్య సంరక్షణను పొందే హక్కును అమలు జేస్తామని తీర్మానించాయి. ‘ఆస్తానా డిక్లరేషన్’ అనంతరం కూడా మనదేశంలో ఆరోగ్యంపై కేటాయింపులు అరకొరగానే కొనసాగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఐదుశాతం ప్రజారోగ్యం కోసం కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. తాజా గణాంకాలు పరిశీలిస్తే 2022-2023 ఆర్థిక సంవత్సంలో ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు జీడీపీలో 2.1 శాతం మాత్రమే ఉంది.
ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పటిష్టం కాకుండా ద్వితీయ, తృతీయ స్థాయి ఆసుపత్రులను, స్పెషలిస్టుల సంఖ్యను పెంచడం ద్వారా ప్రయత్నించినట్లయితే ప్రజారోగ్య సాధనకు చేసే కృషి పదేపదే విఫలమవుతుంది. సమగ్రమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను ఏర్పరచడం ద్వారా మాత్రమే ఏ దేశమైనా ప్రజారోగ్య సాధనలో ముందడుగు వేయగలుగుతుంది. అందుకే ఆరోగ్య హక్కు సాధనను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను అవగాహన చేసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో నాలుగు కీలకమైన అంశాలు ఆవిష్కృతం కావాలి. ఒకటి భౌగోళికం గా అన్ని ప్రాంతాలలో సమానమైన వైద్యసౌకర్యాలు, మానవ జీవన ప్రమాణాలు సాధ్యమవ్వాలి. ఇప్పటికీ మనదేశంలో గ్రామీణ ప్రాంతాలు, ఆటవీ, గిరిజన మారుమూల పల్లెల్లో సరైన రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వలన వందల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి.
రెండవది శాఖల మధ్య సమన్వయం. ఉదాహరణకు ఒక గ్రామంలో అతిసార ప్రబలితే చికిత్సకు వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం పెట్టి మందులు అందజేసి, సెలైన్ సీసాలు ఎక్కించినంత మాత్రాన పరిష్కారం కాదు. ఆ గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలడానికి మంచినీటి ట్యాంక్‌లో లేదా తాగునీటి పైపులైన్‌లలో కాలుష్యం కారణమై ఉంటే దానిని సరిచేసే పనికి సంబంధిత నీటి పారుదల శాఖ పూనుకోవాల్సి వుంటుంది. మూడవది ప్రజల భాగస్వామ్యం. ప్రజారోగ్య ప్రణాళికలు విజయవంతంగా అమలవడానికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. నాలుగవది సరైన సాంకేతికత. స్థానిక అవసరాల్ని తీర్చగలిగేవి. ఉపయోగించే వారికి (వైద్యసిబ్బంది), ఉపయోగపెట్టుకునే వారికి(ప్రజలు) అందుబాటులో ఉండేవి. శాస్త్రీయ నిరూపణ కలిగినవి. మనదేశంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా వ్యవస్ధను బలోపేతం చేయలేని స్ధితికి కోవిడ్-19 సంక్షోభం తార్కాణంగా నిలుస్తుంది. కరోనా సంక్షోభంలో సంభవిం చిన మరణాలు మనదేశ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలోని లోటుపాట్ల ను బట్టబయలు చేసాయి. వైద్య వ్యవస్ధ సంసిద్ధత కొరత, ఆక్సిజన్ లభ్యత లోపం, సరిపడా లేని పడకల లభ్యత వంటి అంశాలు ఆరోగ్య సంరక్షణా వ్యవస్ధలో దీర్ఘకాలికంగా నెలకొన్న దుస్ధితిని ప్రతిబింబించాయి. అరకొర కేటాయింపులు, సిబ్బంది, ప్రాణావసర మందులు, వైద్య సామాగ్రి కొరతల వంటివి ఇందుకు దారితీసాయి.
ఇలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తు ఆరోగ్య భద్రతపై ఫ్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ఆరోగ్యం ప్రజల హక్కుగా ఆచరణలో సాధ్యమయ్యేందుకు జీడీపీలో ఐదుశాతం బడ్జెట్ కేటాయించాలి. వ్యాధి చికిత్సకంటే ముందు వ్యాధి నివారణకు ప్రాధాన్యత ఉండే దిశగా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో మార్పులు చేయాలి. ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించేందుకు అత్యంత కీలకమైన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలి. ప్రజలందరికీ రక్షిత నీటి సరఫరా, పారిశుధ్య కల్పన, గృహవసతి కల్పించాలి. ఉపాధి, సామాజిక సామరస్యం వంటి అంశాల సాధనకు చిత్తశుద్ధితో కూడిన విధానాల్ని పాలక, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పోషించాలి.
(ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)
డా. కె.శివబాబు