చంద్రబాబు పిటిషన్‌ విచారణ వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 3కు వాయిదా పడింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్‌ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్‌ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోరారు. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ఎదుట మెన్షన్‌ చేశారు. మెన్షన్‌ చేసే సందర్భంలో స్వల్ప వాదనలు జరిగాయి. న్యాయవాది లూథ్రా వాదనలను ప్రభుత్వ లాయర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు బెయిల్‌ కోరుకుంటున్నారా? అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. తాము బెయిల్‌ కోరుకోవడం లేదని లూథ్రా తెలిపారు. త్వరగా లిస్ట్‌ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన అని, మధ్యంతర ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని అన్నారు. సెక్షన్‌ 17 ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని, ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడనుటువంటి కేసు ఇది అని అన్నారు. జెడ్‌ కేటగిరీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలానే ట్రీట్‌ చేస్తారా? ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని తెలిపారు. యశ్వంత్‌ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలు పొందుపరిచారని తెలిపారు. పోలీసులు కస్టడీ అడుగుతున్నారని, దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇదిలావుండగా తగిన ధర్మాసనం ఎదుట కేసును బదిలీ చేసి అక్టోబర్‌ 3న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.