కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా– 26నపరిశీలిస్తాం :రౌస్‌ ఎవెన్యూ కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై తీహార్‌ జైళ్లో ఉన్న తనను సీబీఐ విచారించడాన్ని సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రౌస్‌ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈనెల 26న ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని పేర్కొంది. తీహార్‌ జైళ్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ… గత వారం సీబీఐ స్పెషల్‌ కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేసింది.ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా ఆమెను జైళ్లోనే విచారించేందుకు అనుమతిచ్చారు. అయితే, జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను విచారించడానికి సీబీఐకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ మరుసటి రోజు ఈ నెల 6న కవిత తరపు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై న్యాయమూర్తిని స్టేటస్‌ కో ఉత్తర్వులు కోరారు. సీబీఐ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని న్యాయమూర్తికి వివరించారు. కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. స్టేటస్‌ కో ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో బుధవారం ఈ పిటిషన్‌ పై స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా మరోసారి విచారణ చేపట్టారు. అయితే కోర్టు ఆదేశాలతో గత శనివారమే కవితను విచారించినట్లు సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ ఫైల్‌ చేయలేమని కోర్టుకు నివేదించారు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌ రావు జోక్యం చేసుకొని, కవిత విచారణపై సీబీఐ తమకు ఎలాంటి సమాధానం అందించలేదన్నారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి… భవిష్యత్‌లో సీబీఐ చేపట్టే విచారణకు ముందస్తుగా అప్లికేషన్‌ ఇవ్వమని అడగాలని కవిత న్యాయవాదులకు సూచించారు. అయితే, సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై తమ వాదనలు వినిపిస్తామని మోహిత్‌ రావు కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అనుమతించిన కోర్టు… తదుపరి విచారణను ఏప్రిల్‌ 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.