– మోడీని గద్దెదించాల్సిందే..
– అప్రకటిత ఎమర్జెన్సీని ప్రతిఘటించాలి
– క్రికెట్ తరహాలో మోడీ మ్యాచ్ ఫిక్సింగ్
– బీజేపీ 180 సీట్లు గెలవడమే కష్టం : ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో ఇండియా ఫోరం నేతలు
ఢిల్లీ రాంలీలా మైదానం నుంచి దేశ రాజకీయాల్లో కొత్త శక్తి పుంజుకుంది. బీజేపీని ఓడించి దేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఐక్యపోరాటానికి శ్రీకారం చుట్టింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఒక్కటిగా నినదించింది. ఉప్పెనలా తరలివచ్చిన జనం దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించింది
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ నియంత. మతం పేరుతో సమాజాన్ని చీలుస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసి, ప్రతిపక్షాలను వేటాడుతున్నారు. ఏకపక్ష విధానాలతో అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అప్రకటిత ఎమర్జన్సీని ప్రతిఘటించాలి. మోడీ సర్కారును గద్దెదించాలి. అని దేశ ప్రజానీకానికి ఇండియా ఫోరమ్ నేతలు పిలుపునిచ్చారు. ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో ఆదివారం ఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా ఫోరమ్ నిర్వహించిన మహార్యాలీ, బహిరంగ సభకు ప్రజానీకం వెల్లువెత్తింది. కేవలం 20 వేల మందికే అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు విధించిన ఆంక్షలను ప్రజానీకం ఏమాత్రం ఖాతరు చేయలేదు. లక్షలాది మంది తరలిరావడంతో రామ్‌లీలా మైదాన్ నిండిపోయింది. చిన్న చిన్న నదుల్లాగా ప్రదర్శనకు వచ్చిన ప్రతిపక్ష కార్యకర్తలు రాంలీలాలో జన సముద్రాన్ని తలపించారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత సోరెన్‌లను అరెస్టు చేసి, మొత్తం ప్రతిపక్షాలను వేటాడటంతో ఏకపక్ష ఎన్నికలతో అధికారాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్న మోడీని ఇండియా ఫోరం మహా ర్యాలీ హెచ్చరించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపారు సోరెన్, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, డిఎంకె నేత తిరుచ్చి శివ, టీఎంసీ నేత డెరిక్ ఓబ్రెయిన్, వీసీకే నేత తిరుమవళవన్, ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాదుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటమన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విషం. దానిని రుచి చూడకండి. వారు దేశాన్ని నాశనం చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. ”దేశంలో బీజేపీ నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యింది. మీరంతా నియంతృత్వం కోరుకుంటున్నారా..? ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా..?’ అని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఖర్గే ప్రశ్నించారు. ఈ ఏన్నికల్లో బీజేపీకి ఓటువేస్తే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టేనని ఆయన అన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక వేదిక. మన భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అందుకే ఈ ర్యాలీని నిర్వహించాం.’ అని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యంగా వ్యవహరించాలని అప్పుడే బీజేపీని ఓడించగలమని అన్నారు.
దేశం ఏకమౌతోంది- సీతారాం ఏచూరి
ఇండియా ఏకమవుతుందని, ఇండియా గెలుస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘భారత్ ఏకమై గెలుస్తుంది’ అన్నది ఇండియా ఫోరం నినాదంగా మారిందన్నారు. 49 ఏండ్ల క్రితం రాంలీలా మైదానంలో జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన లెజెండరీ ర్యాలీకి ప్రస్తుత ఇండియా ఫోరం ర్యాలీకి ఎంతో పోలిక ఉందని చెప్పారు. ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తరిమికొడతారని చెప్పారు.ఈస్టర్ పునరుత్థాన దినమని, దేశ పునరుత్థానం రాంలీలాతో ప్రారంభమవుతుందని అన్నారు. ‘1975 ర్యాలీలో జెపి స్వేచ్ఛ, బానిసత్వం నిర్మూలన అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ రోజు మళ్లీ అదే నినాదం ఎత్తాల్సిన సమయం వచ్చింది.’ అని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందని, అవినీతి రాజ్యమేలుతోందని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆకలి పెరుగుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారానే ఈ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ‘క్షీరసాగర మథనంలో అమృత కలశం మొదట దుష్టశక్తుల చేతికి చేరింది. అది ప్రస్తుత పరిస్థితి. దుష్ట శక్తుల నుంచి అమృత కలశాన్ని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే నిజమైన అమృతకాలం సాధ్యమవుతుంది. మతతత్వ శక్తులను ఓడించడం ద్వారానే భారతదేశాన్ని రక్షించగలం’ అని చెప్పారు.
అవకాశం ఇస్తే నవ భారతాన్ని నిర్మిస్తాం
– కేజ్రీవాల్ సందేశం : ర్యాలీలో సునీత కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి మహార్యాలీకి సందేశం పంపారు. ఆయన సతీమణి సునీత చదివిన సందేశంలో.. తాను ఓట్లు అడగడం లేదని.. 140 కోట్ల మంది ప్రజలను నవ భారతాన్ని నిర్మించాలని అడుగుతున్నానన్నారు. వేల సంవత్సరాల సంప్రదాయం ఉన్న సంస్కృతి మనదని, భారతమాత కూడా బాధపడుతోందని, దేశం ఐక్యతకు అవకాశం ఇస్తే నవ భారతాన్ని నిర్మిస్తామన్నారు. ఆరు హామీలు కూడా ప్రకటించారు.. దేశంలో 24 గంటల కరెంటు, కరెంటు కోతలు ఉండవు. పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి, రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ మద్దతు ధర, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా వంటి హామీలు వచ్చే ఐదేళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఆర్థిక ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు కేజ్రీవాల్ సందేశంలో పేర్కొన్నారు.
”మీ కేజ్రీవాల్ మీ కోసం జైలు నుంచి ఒక సందేశం పంపారు. సందేశం వినిపించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. నా భర్తను మన ప్రధాని నరేంద్ర మోడీ జైలుకు పంపారు. ప్రధాని చేసినది సరైన పనేనా? కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడు, నిజాయితీ పరుడని మీరు విశ్వసిస్తున్నారా? ఈ బీజేపీ వాళ్లు కేజ్రీవాల్ జైలులో ఉన్నారని, రాజీనామా చేయాలని అంటున్నారు. ఆయన రాజీనామా చేయాలా? మీ కేజ్రీవాల్ ఒక సింహం. వాళ్లు ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేరు” అని సభికులను ఉద్దేశించి ఉద్వేగంగా సునీత ప్రసంగించారు.
బీజేపీకి అంత సీన్ లేదు
వ్యక్తం చేశారు. ఈవీఎంల రిగ్గింగ్, సోషల్ మీడియాలో అవకతవకలు, మీడియాపై ఒత్తిడి చేస్తే తప్ప బీజేపీకి 180 సీట్లు దాటవని స్పష్టం చేశారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారని, ఇవి ఎలాంటి ఎన్నికలని ఆయన ప్రశ్నించారు. ”మీరు మ్యాచ్ ఫిక్సింగ్ (క్రికెట్‌లో) గురించి విన్నారా? లోక్‌సభ ఎన్నికలను చూస్తున్నాం. అంపైర్‌ను ఎవరు ఎంపిక చేస్తున్నారు? నరేంద్ర మోడీ. ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లను ఎవరు అరెస్టు చేశారు? మోడీ. ఈ ఎన్నికల్లో మోడీ మ్యాచ్ ఫిక్సింగ్‌ను కూడా చేస్తున్నారు” అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఈ పోరాటం భారతదేశపు గుండె చప్పుడుకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికని అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో దేశంలోని కొంతమంది ధనవంతులు ప్రధాని మోడీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై దాడి జరిగిన రోజున అది దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, ఇతరులందరూ తమ హక్కులను కోల్పోతారని వివరించారు.
జార్ఖండ్, ఇండియా తలవంచవు
– హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ మాట్లాడుతూ ”రెండు నెలల క్రితం, హేమంత్ సోరెన్‌ను జైలులో పెట్టారు. ఇప్పుడు నియంతను నిర్మూలించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. జార్ఖండ్ తలవంచబోదు. ఇండియా ఫోరం కూడా తలవంచబోదు” అని ఆమె స్పష్టం చేశారు. ”దేశంలోని సగం మంది మహిళా జనాభాకు, తొమ్మిది శాతం గిరిజన సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ నేను మీ ముందు నిలబడ్డాను. అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కులను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ విలువలను ధ్వంసం చేశారు. దేశంలోని నాయకులు, పార్టీల కంటే ప్రజలు శక్తివంతులు. మీ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షం ఉందని ఇక్కడున్న జనం నిరూపించారు. ఈ చారిత్రాత్మక గడ్డపై నేటి సభకు మీరంతా దేశం నలుమూలల నుంచి తరలివచ్చి నియంతృత్వం అంతమొందిస్తారనే దానికి సాక్ష్యం” అని కల్పనా సోరెన్ అన్నారు.
రాజ్యాంగాన్ని హైజాక్ చేశారు
– రాహుల్ గాంధీ
క్రికెట్‌లో ఫిక్సింగ్ తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి, ముగ్గురు, నలుగురు క్రోనీ క్యాపిటలిస్టులు కుమ్మక్కయి రాజ్యాంగాన్ని హైజాక్ చేశారని దుయ్యబట్టారు. పూర్తి స్థాయిలో ఓటు వేయకుంటే వారి కుమ్మక్కు ఫలిస్తుందని, అది జరిగితే రాజ్యాంగం కూలిపోతుందని వివరించారు. రాజ్యాంగం ప్రజల గొంతుక, అది ముగిసిన రోజు దేశం అంతమవుతుందని ఆవేదన
దేశాన్ని రక్షించడం భారతీయ సమాజం కర్తవ్యం : డి రాజా
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ బీజేపీిని తరిమికొట్టి దేశాన్ని రక్షించడం భారతీయ సమాజం కర్తవ్యమని అన్నారు. ”ఈడి, ఇతర కేంద్ర సంస్థలు ప్రతిపక్షాలను వేటాడుతున్నాయి. కేజ్రీవాల్, సోరెన్‌ల అరెస్టులే అందుకు నిదర్శనం. రాజకీయ నాయకులు రాజ్యాంగ నైతికతను పాటించాలని అంబేద్కర్ చెప్పారు. మోడీకి ఆ నైతికత ఉందా? అని అడుగుతున్నాం. దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చి, దేశాన్ని మత రాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికల్లో బీజేపీని ఓడించి లౌకికవాదాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి : దీపాంకర్ ముఖర్జీ
సీపీిఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ ముఖర్జీ మాట్లాడుతూ ”ఎలక్టోరల్ బాండ్ స్కామ్ దేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద కుంభకోణం, ప్రభుత్వాలను పడగొట్టి, కార్పొరేట్ల నుంచి బాండ్ల ద్వారా సంపాదించిన కోట్లతో ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ధరకు అమ్మడుపోని వారిని నకిలీ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నే నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద అవినీతి పార్టీగా అవతరించింది. మోడీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా మారింది. ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి” అని పిలుపునిచ్చారు.
బీజేపీని చిత్తుగా ఓడించాలి : ఫరూక్ అబ్దుల్లా
రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని, తుదిశ్వాస విడిచే వరకు తమ పార్టీ ఇండియాతోనే ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ”అన్ని మతాల వారు కలసిమెలసి ఉండే పరిస్థితి లేదు. ఈ విపత్కర పరిస్థితికి వ్యతిరేకంగా మనమంతా కలిసి గళం ఎత్తుదాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ముప్పు పొంచి ఉంది. ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి” అని పిలుపునిచ్చారు.
ఓట్లతోనే దేశాన్ని కాపాడుకోగలం : అఖిలేష్
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అబద్ధాలకోరు పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. 400 సీట్లు దాటాలని నినాదాలు చేస్తున్న వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను ఎందుకు అరెస్టు చేసి జైలుకు పంపారని ప్రశ్నించారు. ”నేడు, దేశ ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోంది. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ఏజెన్సీలను చూపించి డబ్బులు వసూలు చేసింది. వారు ఈ డబ్బును ప్రతిపక్షాలపై ఉపయోగించుకుంటారు. మీ ఓటు మాత్రమే ఈ దేశాన్ని, మన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, 90 శాతం జనాభాను కాపాడుతుంది” అని అఖిలేష్ యాదవ్ సూచించారు.
అధికారం శాశ్వతం కాదు : ప్రియాంక
అధికారం శాశ్వతం కాదు, వచ్చి పోతుందని మోడీకి శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు. ”అధికారం శాశ్వతంగా ఉండదు. శక్తి వస్తుంది. పోతుంది. పడిపోతుంది. అహం ఒక రోజు కూలిపోతుంది. ఇది రాముడు, ఆయన జీవిత సందేశం” అని అన్నారు. ప్రియాంక గాంధీ భారతీయ సమాజానికి సంబంధించిన ఐదు డిమాండ్లను లేవనెత్తారు. ”ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖల వ్యతిరేక వేటను ఆపాలి. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను తక్షణమే విడుదల చేయాలి. ప్రతిపక్షాలపై ఆర్థిక దాడి ఆపాలి. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలి” అని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఓటు : చంపై సోరెన్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు వేయాలని జార్ఱండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ పిలుపునిచ్చారు. బీజేపీ నియంతృ త్వాన్ని, భావజాలాన్ని ఎదగనివ్వబోమన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రజల కోసం పనిచేస్తున్నందుకు హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ మేం కలిసి ఉన్నామనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ‘మేం కలిసికట్టుగా బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం’ అని అన్నారు. ”హేమంత్ సోరెన్ ఎప్పుడూ తలవంచలేదు. భవిష్యత్‌లో అలా చేయడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నియంతృత్వాన్ని తొలగించాలి” అని నొక్కివక్కాణించారు.
ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం దేశానికి ప్రమాదం : ఉద్ధవ్ ఠాక్రే
ఒకే వ్యక్తి, ఒకే పార్టీ ప్రభుత్వం దేశానికి ప్రమాదమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ”దేశం నియంతృత్వం దిశగా పయనిస్తోంది. మొన్నటి వరకు అనుమానమే ఉండేది. ఇప్పుడు నిజమవుతోంది. ముందు ఆరోపణలు చేస్తారు. ఆ తరువాత జైల్లో పెడుతారు. బీజేపీ, మేం ఇద్దరం అన్నదమ్ములమైతే, తమ్ముళ్లు ఎలా మౌనంగా ఉంటున్నారు. దేశం మొత్తం కల్పన, సునీత వెంట ఉంది. భారతీయులు భయపడరు. పోరాడుతారు. బీజేపీ కేంద్ర సంస్థలను మిత్రపక్షాలుగా ప్రకటించాలి. ర్యాలీ ఎన్నికలు ప్రచారం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం దీని లక్ష్యం” అని ఆయన వెల్లడించారు. బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్ధానాలు గెలుచుకోవాలని కలలు కంటోందని, ఒక పార్టీ, ఒక వ్యక్తి సారధ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. గతంలో అవినీతిలో కూరుకుపోయిన వారిని బీజేపీ వాషింగ్‌మెషీన్‌లో శుభ్రం చేసి పునీతులను చేస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిపోయిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడు కోవడం మన బాధ్యత : శరద్ పవార్
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ”ఈ ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం) ఢిల్లీ సీఎం, జార్ఖండ్ సిఎంలను అరెస్టు చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది నాయకులనూ జైలులో పెట్టింది. ఈ చర్య ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా దాడి. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత” అని అన్నారు.
అత్యంత అవినీతిమయం : మెహబూబా ముఫ్తీ
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. మోడీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. ”వారు నిధుల దుర్వినియోగంతో అవినీతికి పాల్పడ్డారు. ఇప్పుడు రికవరీ కోసం ఈడీని ఉపయోగిస్తున్నార”ని దుయ్యబట్టారు. ”ప్రస్తుతం, దేశం సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సరైన విచారణ లేకుండానే వ్యక్తులను నిర్బంధిస్తున్నారు. ఇది ‘కలియుగ్ కా అమృత్ కాల్’ను పోలి ఉంటుంది. ఉమర్ ఖలీద్ లేదా మహ్మద్ జుబేర్ వంటి నిర్దిష్ట వ్యక్తులే కాదు, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, నాతో పాటు మాజీ సిఎంలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించిన వారిని దేశద్రోహులుగా పరిగణిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం జీరో వారెంటీ : డెరెక్ ఓబ్రెయిన్
టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ టీఎంసీ ఇండియా ఫోరంలో భాగంగానే ఉందని, ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యం, సంస్థల రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం జీరో వారెంటీ ఇస్తుందని విమర్శించారు. ఈ ర్యాలీ ప్రజాస్వామ్యం పోరాటంలో భాగమని అన్నారు. ఈ మేరకు రాసి ఉన్న బ్లాక్ టీ షర్టును ఆయన ధరించారు.
దేశమంతటా నిరసనలు : గోపాల్ రాయ్
మార్చి 21 తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రారు అన్నారు. ”సిట్టింగ్ సిఎంను ఎందుకు అరెస్ట్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇది అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే కాదు. ఢిల్లీ సిఎం అరెస్ట్ కాకముందే జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఈడీ, సీబీఐ దుర్వినియోగంతో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది” అని గోపాల్ రారు దుయ్యబట్టారు. నిజం గెలుస్తుందని మరో మంత్రి కైలాష్ గహ్లోట్ అన్నారు.
జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్ కూడా ర్యాలీకి హాజరయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ర్యాలీ తరువాత రాంలీలాలో ర్యాలీ నిర్వహించారు.
రెండు కుర్చీలు ఖాళీగా..
వేదికమీద మెదటివరుసలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ల కోసం రెండు కుర్చీలను ఖాళీగా వదిలారు. శనివారం కేజ్రీవాల్‌ను కలిసిన సునీత ఆయన సందేశాన్ని వినిపిస్తున్నప్పుడు, హేమంత్ సోరెన్ భార్య కల్పన మాట్లాడుతున్నప్పుడు సభలో ఉద్వేగ భరితవాతావరణం నెలకొంది.