– మహిళల జట్టుకు పసిడి పతకం
– ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్
షా ఆలమ్ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర. మన అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం కొల్లగొట్టారు. అగ్రజట్లు చైనా, జపాన్, థారులాండ్, మలేషియా పోటీపడే ఈవెంట్‌లో భారత అమ్మాయిలకు ఇప్పటివరకు ఒక్క మెడల్ దక్కలేదు. కానీ తాజా ఈవెంట్‌లో యువ షట్లర్లు చరిత్ర తిరగరాశారు. ఆదివారం జరిగిన ఫైనల్లో థారులాండ్‌పై 3-2తో ఉద్విగ విజయం సాధించారు. ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చారిత్రక పసిడి పతకం అందించారు. తొలి సింగిల్స్‌లో పి.వి సింధు 21-12, 21-12తో సుపనిదపై వరుస గేముల్లో గెలుపొంది శుభారంభం చేయగా.. తొలి డబుల్స్‌లో ట్రెసా జాలి, గాయత్రి పుల్లెల సైతం విజయం సాధించారు. 21-16, 18-21, 21-16తో మూడు గేముల మ్యాచ్‌లో పైచేయి సాధించారు. దీంతో భారత్ 2-0తో పసిడికి అడుగు దూరంలో నిలిచింది. కానీ రెండో సింగిల్స్‌లో అష్మిత చాలిహ 11-21, 14-21తో, రెండో డబుల్స్‌లో ప్రియ, శృతి మిశ్రా 11-21, 9-21తో పరాజయం పాలయ్యారు. నిర్ణయాత్మక ఐదో గేమ్ ముంగిట భారత్, థారులాండ్ 2-2తో సమవుజ్జీలుగా నిలిచారు.
అన్మోల్ అదుర్స్ : వరల్డ్ నం.472 అన్మోల్ కార్బ్ మళ్లీ అద్భుతం చేసింది. వరల్డ్ నం.45 చోకివాంగ్‌పై సంచలన విజయం నమోదు చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా ఆసియా చాంపియన్‌షిప్స్‌కు వచ్చిన అన్మోల్.. వరుస విజయాలతో అందరి దృస్టిని తనవైపునకు తిప్పుకుంది. 21-14, 21-9తో థారులాండ్ షట్లర్‌ను చిత్తు చేసిన అన్మోల్ వరుస గేముల్లోనే నిర్ణయాత్మక మ్యాచ్‌ను భారత్ వశం చేసింది. అన్మోల్ విజయంతో 3-2తో భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. భారత్ కంటే మెరుగైన ర్యాంక్ షట్లర్లతో బరిలోకి దిగిన థారులాండ్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.