
– ప్రజలు అటవీశాఖ సిబ్బందికి సహకరించాలి
– రేంజ్ అధికారి రవీందర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కొన సముందర్ గ్రామంలో గురువారం ముందస్తు సమాచారం మేరకు రేంజ్ సిబ్బందితో కలిసి దాడులు చేసి పెద్ద ఎత్తున టేకు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కమ్మర్ పల్లి అటవీ రేంజ్ అధికారి రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముందస్తుగా అందిన సమాచారం మేరకు స్థానిక కార్పెంటర్ షాప్ ఏరియాలో పాటుపడ్డ పొదల్లో రైడ్ చేసి దాచి ఉంచిన సుమారు 100 నుంచి 150 వరకు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి తెలిపారు. ఈ టేకు దుంగలను ఎవరు తీసుకొచ్చారు అనే విషయమై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు. టేకు దుంగలు తీసుకొచ్చిన వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు చేపడతామన్నారు. టేకు దుంగలు దాచి ఉంచిన ప్రదేశానికి చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఉన్న కార్పెంటర్ షాపుల వారిపై కేసులు నమోదు చేసి, మెషిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను, కార్పెంటర్ షాప్ లో ఉన్న మెషిన్లను కమ్మర్ పల్లి అడవి రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. టేకు కలప దుంగల విలువ తమ అంచనా ప్రకారం రూ.లక్ష 50 వేల నుండి రూ.2లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న దుంగలను కొలతలు చేసి పూర్తి విలువ పై అధికారులకు నివేదిస్తామన్నారు. దాచి ఉంచిన టేకు దుంగలను ఎక్కడెక్కడ కట్ చేసి తీసుకువచ్చారో పట్టా భూమి, అటవీశాఖ భూమి అనేది విచారణలో తేల్చి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. అడవి సంపదను కాపాడడంలో ప్రజల అటవీ శాఖ సిబ్బందికి సహకారం అందించాలని ఆయన కోరారు. అటవీ సంపద ప్రజలది కాబట్టి దాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలన్నారు. అడవి సంపదను దోచుకునే స్మగ్లర్లు, దొంగ చాటుగా టేకు కల్ప నిల్వ ఉంచుకునే కార్పెంటర్ షాపుల వివరాలు ఉంటే ప్రజలు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన కోరారు.