అశ్వారావుపేట లో భారీ వర్షం

– చేలోనే తడిసిన వేరుశనగ…
– నేలకొరిగిన వరి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అశ్వారావుపేట పై తీవ్రంగా పడింది.మంగళవారం ఈ తుఫాన్ తో ఉదయం నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఆకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.దీనితో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు సైతం జలమయం అయ్యాయి .మీచౌంగ్ తుఫాన్ వల్ల సోమవారం చిరు జల్లులతో మొదలైన వర్గం మంగళవారం ఉదయానికి తీవ్ర స్థాయికి చేరింది.ఎడతెరపి లేకుండా కుండపోతగా వర్షం భారీగా కురిసింది.ఇప్పటికే చేలల్లో ఉన్న వేరుశనగ,వరి పంటలు తడిసిపోయాయి. విక్రయానికి సిద్ధం చేసిన వరి కుప్పలు వర్షానికి  తడిసిపోయాయి. చేతికందిన వరి పంట తుఫాన్ వల్ల దెబ్బతినటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడి అయినా చేతికందుతుందన్న నమ్మకం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టం తుఫాన్ పాలైందని, తమకు కలిగిన ఈ ఆర్ధిక నష్టణ ఎలా పూడ్చుకోవాలో అర్థం కాక మనోవేదన చెందుతున్నారు. వీటితో పాటు పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాన్ ప్రభావం మరో 20 గంటలకు పైగా ఉండొచ్చొని వాతావరణ శాఖ ప్రకటన రైతులను మరింత కృంగదీస్తుంది.నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకుని చేయూతనివ్వాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాదటంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.జోరు వానతో బయటకు రావటానికి వీలు లేకపోవటంతో నే ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు 52 ఎం.ఎం, మధ్యాహ్నం 2 గంటల వరకు 23.8 మి.మీ, వర్షపాతం నమోదు కాగా సాయంత్రం 4 గంటల వరకు సుమారు 63..5 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు వ్యవసాయ కళాశాల వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. వేరుశనగ, వరి పంటలకు పాక్షిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని  వ్యవసాయ అధికారి నవీన్ అన్నాను.ఉద్యాన పంటలకు ఈ వర్షాలతో అపాయం ఏమీలేదని ఉద్యాన అధికారి సందీప్ తెలిపారు.