మండలంలో భారీ వర్షం..

Heavy rain in Mandal– మండల కేంద్రంలో వర్షపు నీరుతో నిండిన డ్రైనేజీలు..
– చెరువును తలపించిన ప్రధాన రోడ్డు 
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలో భారీ వర్షం కురిసింది.దీంతో మండల కేంద్రంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ బహిర్గతమైంది. డ్రైనేజీలు వర్షపు నీరుతో పూర్తిగా నిండి రోడ్డుపై ప్రవహించింది.మండల కేంద్రంలోని కరీంనగ్ ప్రధాన రోడ్డుపై వర్షపు నీరు నిలిచి చెరువును తలపించింది.పారిశుధ్యంపై అధికారుల అలసత్వం శుక్రవారం బట్టబయలైంది. డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిలవడం, పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారడం వల్ల దుర్వాసన వెదజల్లడంతో పాటూ దోమలకు నిలయంగా మారి ఇళ్లల్లోకి వస్తున్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.మండల కేంద్రంలో మురుగు నీరు కాలువ వ్యవస్థ అధ్వానంగా మారి ప్రధాన రోడ్డుపై పారుతుండడంతో అవస్థలు పడుతున్నామని రోడ్డు ప్రక్కన ఇళ్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో వాహనదారులు,కాలినడకన వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యాలకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ,టైఫాయిడ్ వంటి విష జ్వరాల భారిన పడుతున్నామని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.మండల,గ్రామాల్లో విధులు నిర్వర్తించే ప్రత్యేకాధికారులు,పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోకపోవడం వల్లే పారిశుధ్యం పడకేసిందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా,మండలాధికారులు స్పందించి అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్ధి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.