భారీ వర్షాలు – ఉద్యాన రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్దతులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు/తుఫాను తో పాటు వాతావరణంలోని తేమ కారణంగా ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగవుతున్న వివిధ ఉద్యాన పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు,తెగుళ్లు సోకకుండ పాటించవలసిన ముందస్తు నివారణ చర్యలు.
అరటి:
‣లేత మరియు ముదురు తోటలలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తోట నుండి బయటకు పంపించాలి. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత లేత తోటల్లో తేమ త్వరగా ఆరడానికి అంతర కృషి చేయాలి.
గెలలు ఏర్పడని మరియు లేత అరటి మొక్కలలో వర్షం మరియు గాలి కారణంగా పూర్తిగా వాలి నట్లయితే ఒకటి లేదా రెండు ఆరోగ్యవంతమైన సూది పిలకలను వదిలేసి వాలిన మొక్కలని పూర్తిగా తొలగించాలి.ఒకవేళ గెల బాగా గా వృద్ధి చెందుతున్న దశలో ఉన్న అరటి చెట్లు వాలిన చో వెదురు కర్రలతో ఊతం ఇచ్చి సాధ్యమైనంత త్వరగా (15 – – 20 రోజులు లోగా) గెలలు ను మార్కెట్ చేసుకోవాలి. తుఫాను తాకిడికి గురి అయిన తోటల్లో 2% యూరియా (లేదా) 0.5 – 1% KNO3 ద్రావణాన్ని రెండు సార్లు పిచికారి చేయాలి. అదే విధంగా మొక్కలు త్వరగా కోలుకోవడానికి ఒక్కో మొక్కకి 80 గ్రా. మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, 100 గ్రా. యూరియా చొప్పున 2 – 3 దఫాలుగా అందించాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత సిగటోకా ఆకు మచ్చ తెగులు వ్యాపించకుండ, ప్రాప్తికోనజోల్ 0.1% ద్రావణాన్ని 2-3 సార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
బొప్పాయి:
లేత మరియు కాత దశలో ఉన్న తోటల్లో సాధ్యమైనంత త్వరగా వర్షం నీరుని బయటికి పంపించాలి.
తోటల్లోని మొక్క మొదళ్లలో బోర్డో మిశ్రమం 1% తో తడిపినచొ కాండం మొదలు కుళ్ళు రాకుండా అరికట్టవచ్చు.
తుఫాను తాకిడికి గురైన తోటల్లో 2% యూరియా(లేదా) 0.5- 1% KNO3 ద్రావణాన్ని రెండు సార్లు పిచికారి చేసిన మొక్కలు త్వరగా కోలు కుంటాయి.
తోటల్లో ని వాలిన మొక్కలకి మట్టి ఎగ దోయడం, వెదురు కర్రలతో ఊతం అందించాలి. కాయ కోతకు సిద్ధమైన కాయలని మరియు రాలిన కాయలని సాధ్యమైనంత త్వరగా మార్కెట్ చేసుకోవలెను.
ఆయిల్ పామ్:
లేత మరియు ముదురు తోటల్లో నీరు నిలిచినట్లు గమనించినట్లయితే సాధ్యమైనంత త్వరగా మొక్క మొదళ్ల దగ్గర నుండి వర్షపు నీరు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. లేత తోటల్లో 1% కార్బెండజం ద్రావణాన్ని మొవ్వు భాగంలో తడిచేలా పిచికారి చేసిన మొవ్వుకుళ్ళు రాకుండా అరికట్టవచ్చు.
లేత తోటల్లో ఆకు తినే పురుగును నివారించడానికి వేప నూనెని పిచికారీ చేయాలి. లేత మరియు ముదురు తోటల్లో కొమ్ము పురుగు నివారణకు తోటలోని పెంటకుప్పలపై మెటారైజియం అను శిలీంద్రమును వాడి నివారించాలి. కొమ్ము పురుగు ఉధృతిని నివారించడానికి ఎకరానికి 1 – 2 లింగాకర్షక బుట్టలను వాడి నివారించాలి.లేత మరియు ముదురు తోటలలో వేలాడుతున్న ఆకుమట్టలని తొలగించాలి. ముదురు తోటల్లో మొక్కలు త్వరగా కోలుకోవడానికి సిఫారసు చేసిన ఎరువులను వేసుకోవాలి.
కొబ్బరి:
లేత మరియు ముదురు తోటలలో నీరు నిలిచినట్లు గమనించినట్లయితే సాధ్యమైనంత త్వరగా మొక్క మొదళ్ల దగ్గర నుండి వర్షపు నీరు పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. తుఫాన్ కి గురైన లేత తోటల్లో 3 గ్రా.లీటరు నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని మొవ్వు భాగంలో తడిచేలా పిచికారి చేసిన మొవ్వుకుళ్ళు రాకుండా అరికట్టవచ్చు. లేత మరియు ముదురు తోటల్లో కొమ్ము పురుగు నివారణకు తోటలోని పెంట కుప్పలు పై మెటారైజియం అను శిలీంద్రమును వాడి నివారించాలి.
కొమ్ము పురుగు ఉధృతిని నివారించడానికి ఎకరానికి 1 – 2 లింగాకర్షక బుట్టలను వాడి నివారించాలి. లేత మరియు ముదురు తోటలలో వేలాడుతున్న ఆకుమట్టలని తొలగించాలి. ముదురు తోటల్లో మొక్కలు త్వరగా కోలుకోవడానికి సిఫారసు చేసిన ఎరువులను వేసుకోవాలి.
జీడి మామిడి:
తోటలలో నిలబడిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించవలెను. లేత తోటలలోని మొక్కలు వాలినచో మట్టి ఎగదోసి నిలబట్ట వలెను.అలాగే ముదురు తోటల్లో విరిగిన కొమ్మలను కత్తిరించి బోర్డో పేస్టుని పూయాలి.
కూరగాయలు:
తోటల్లో నిలబడిన వర్షం నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపాలి, వాలిన మొక్కలని మట్టి ఎగ దోసి నిలబెట్టాలి.
ఒక లీ. నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మరియు 2.0 గ్రా. స్టెప్టో సైక్లిన్ కలిపి పిచికారి చేసిన బ్యాక్టీరియా మరియు శిలీంద్ర తెగుళ్ళని అరికట్టవచ్చు.
డా. జి. విజయ కృష్ణ,శాస్త్రవేత్త (ఉద్యాన) ఉద్యాన పరిశోధనా స్థానం, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా