ఈరోజు, రేపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఐఎండి ఆరెంజ్‌ అలర్ట్‌

న్యూఢిల్లీ : ఈరోజు, రేపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ రాష్ట్రాలకు ఐఎండి ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది.కాగా, ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో పాఠశాలలను బృహన్‌ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో గురువారం కూడా వర్షాలు పడనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల విషయానికొస్తే… కొంకణ్‌, గోవాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలో రాబోయే మూడురోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండి అంచనా వేసింది. ప్రత్యేకించి గుజరాత్‌ రాష్ట్రంలో సౌరాష్ట్ర, కచ్‌లలో ఈరోజు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు కూడా తేలికపాటి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో ఈరోజు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఇక రాబోయే మూడురోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.
పశ్చిమబెంగాల్‌, బీహార్‌, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు పడనున్నాయి. నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 2 వరకు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది.