ముంబయిలో పెను గాలుల బీభత్సం

ముంబయి, ఆ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు సోమవారం పెను బీభత్సం సృష్టించాయి. ఘట్‌కోపర్‌ ప్రాంతంలోని చెద్దానగర్‌ జంక్ష– భారీ హోర్డింగ్‌ కూలి ఎనిమిది మంది మృతి
– 60 మందికి పైగా గాయాలు
– ఆరే, అంధేరీ ఈస్ట్‌ మెట్రో స్టేషన్ల మధ్య మెట్రో సేవల నిలిపివేత
దాదర్‌ : ముంబయి, ఆ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాలు సోమవారం పెను బీభత్సం సృష్టించాయి. ఘట్‌కోపర్‌ ప్రాంతంలోని చెద్దానగర్‌ జంక్షన్‌ వద్ద వంద అడుగుల ఎత్తయిన భారీ హోర్డింగ్‌ కుప్పకూలి పక్కనే వున్న పెట్రోల్‌ బంకు, సమీపంలోని నివాసాలపై పడింది. దీంతో, ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది అక్కడ చిక్కుకోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘట్కోపర్‌, ములుంద్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాల్లో వర్షంతోపాటు బలమైన గాలులు వీచాయి. థానే, అంబర్‌నాథ్‌, బద్లాపూర్‌, కళ్యాణ్‌ మరియు ఉల్హాస్‌నగర్‌లలో కూడా ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు పడ్డాయి. హోర్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో గాయపడిన అనేక మందిని ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలందించినట్లు బృహన్‌ ముంబై అధికారులు తెలిపారు. మెట్రో, లోకల్‌ రైలు సేవలకు అంతరాయం కలిగింది. థానే, పాల్ఘర్‌, ముంబైలలో మెరుపులతో కూడిన ఉరుములు, మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ విభాగం (ఐఎండి) ”నౌకాస్ట్‌ హెచ్చరిక” జారీ చేసింది. ముంబైలోని శ్రీ జీ టవర్‌, వడాలా (తూర్పు) సమీపంలో సాయంత్రం 4:22 గంటలకు బర్కత్‌ అలీ నాకాలోని ఒక మెటల్‌ స్టీల్‌ పార్కింగ్‌ కూలిపోయింది. శ్రీ జీ టవర్‌ దగ్గర ఉన్న మెటల్‌ స్టీల్‌ పార్కింగ్‌ మొత్తం కూలిపోయిందని, ఆ సమయంలో సమీపంలో ఉన్న దాదాపు 10 వాహనాలు సమీపంలోని రోడ్డు పక్కన నిలిపివేశారని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి కారులో చిక్కుకున్నాడని, అతనిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈదురు గాలులతో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెయిన్‌లైన్‌, హార్బర్‌లైన్‌ సబర్బన్‌ సర్వీసులు నిర్ణీత సమయానికి ఆలస్యంగా నడుస్తున్నాయి. బలమైన గాలుల కారణంగా థానే, ములుండ్‌ స్టేషన్‌ల మధ్య ఉన్న ఓవర్‌హెడ్‌ పరికరాల స్తంభం వంగిపోవడంతో సెంట్రల్‌ రైల్వేలోని సబర్బన్‌ సర్వీసులు నిలిపివేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.థానే జిల్లాలోని కాల్వా, మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 66 నిమిషాల పాటు విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. 15 విమాన సర్వీసులను మళ్లించింది.