ఆధిపత్య రాజకీయాలు – దళితుల దుస్థితి

Hegemonic Politics - The Plight of Dalits”సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌” (అభివృద్ధి అందరి కోసం) అని బీజేపీ నినదిస్తున్నప్పటికీ, సమాజంలోని బడుగు బలహీన వర్గాల దుస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది. ఆధిపత్య రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా పరిగణలో ఉండగా, అంతే సమానంగా ఈ రాజకీయాలు దళితులను కూడా లొంగదీసుకోవడం ప్రధానమైన అంశం. ఓవైపు దళితుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు బీజేపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దళితులకు దగ్గరవుతున్న పరిస్థితులు పెరగు తుండటం చూస్తున్నాం. దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకునే లక్ష్యంతో ఆధిపత్య రాజకీయాలకు మూలాధారమైన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రభావం కూడా పెరుగుతుంది.
19వ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ‘దళితుడు’ అనే పదాన్ని కనుగొన్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే, స్వామీ వివేకానంద ”భారతదేశ భవిష్యత్తు”పై చేసిన ప్రసంగంలో పేర్కొన్న విధంగా, ఇంతకుముందు ఈ వర్గాల ప్రజలు చాలా మంది కుల వ్యవస్థ అణచివేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్‌ చేపట్టిన దళితుల ప్రజా తాగునీటి వద్దకు ప్రవేశం, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు, ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ (1935) స్థాపన లాంటి అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం కోసం జరిగిన పోరాటాల స్థాయి కొంతవరకు పెరిగింది. విద్య, ఉద్యోగాలు, ఎన్నికల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయాత్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇది దళితుల జీవితాల్లో కొంత ప్రభావం చూపించగా, కొద్ది సంఖ్యలో సంభవించిన మార్పులు మాత్రం నత్తనడకన సాగాయి.
గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు నాటకీయంగా మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ పతన పరిస్థితుల్ని తెలియజేస్తాయి. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలను బలోపేతం చేయడానికి ఏర్పడిన జాతీయ కూటమి గణాంక నివేదిక ప్రకారం… ”షెడ్యూల్డ్‌ కులాల వారికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు లేదా అకృత్యాలు 2021లో 1.2శాతం పెరిగాయి. అదే 2021లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్సీలకు వ్యతిరేకంగా జరిగిన అకృత్యాలు అత్యధికంగా 25.8శాతం నమోదు కాగా, రాజస్థాన్‌ 14.7శాతం, మధ్యప్రదేశ్‌ 14.1శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి.” హిందూత్వ ఎజెండా మార్గ దర్శకత్వంలో బీజేపీ, సమాజాన్ని రెండుగా విభజించడానికి, అట్టడుగువర్గాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని దాటవేసేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతుంది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడుల ద్వారా మనుషుల్ని హతమార్చడం మామూలు విషయంగా మారింది. ప్రేరేపించబడిన మూకల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న దళితుల్ని కూడా ఈ మూకలు లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇలాంటి హింస ముస్లింలపై అసమానమైన ప్రభావం చూపుతుంటే, గణనీయమైన సంఖ్యలో దళితులు కూడా మూకదాడుల్లో హత్య గావించబడుతున్నారు. వాస్తవంగా ఏమి జరుగుతుందో తెలియచేయడానికి, ఉనాలో జరిగిన భయంకర సంఘటన మన ముందుంది.
చారిత్రక తప్పిదాలను సరిచేయడంలో దళితులకు రిజర్వేషన్ల కల్పన చాలా కీలకమైన అంశమే కానీ, బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి, ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా రిజర్వేషన్లను నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. కేవలం ఐదు శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందుతున్నారని సామాజిక శాస్త్రవేత్త సుఖ్‌ దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికపై ఆధారపడి దళితేతరులకు రిజర్వేషన్ల కల్పన కూడా వారి అర్హతల్ని, హక్కుల్ని బలహీనపరుస్తుంది. ‘క్రీమీ లేయర్‌’ (పైపొర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలోని వ్యక్తిగత ఆదాయాల్ని కలపడం వల్ల రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేసినట్లే అవుతుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5శాతం పోస్ట్‌లు, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈ వర్గాల ప్రజల దుస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళికలు
ప్రతి సందర్భంలో బీజేపీ దళితుల హక్కులు, నిబంధనలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. దీనిని అర్థం చేసుకోవడానికి బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను, అది ఏ పరిస్థితుల్లో స్థాపించబడిందో క్లుప్తంగా తెలుసుకుందాం. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడంతో, దళితుల్లో విద్యను ప్రోత్సహించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో బ్రహ్మాండమైన సామాజిక అవగాహనకు లేదా స్పృహకు దారి తీసింది. ఈ అవగాహనే 1920లో మహారాష్ట్రలోని విదర్భలో ”బ్రాహ్మణేతర ఉద్యమానికి” దారి తీసింది. ఇలాంటి మార్పుల కారణంగా అగ్రకులాలకు చెందిన వారు నిరాశ చెందారు, వారే ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీసిన కారణాలలో ఒకరయ్యారు. ఓవైపు హిందూ రాష్ట్ర ఎజెండా, ముస్లింలను, క్రైస్తవులను ‘విదేశీయులుగా’ పేర్కొంటూ మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదేపనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగే ఏ ఉద్యమాన్నైనా అగ్రకులాలకు చెందిన వారు వ్యతిరేకించారు. భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం వల్ల దళితులు సామాజిక రంగంలోకి రావడం మొదలైంది. 1980లో దళిత సమాజం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతిరేకించారు. అహ్మదాబాద్‌లో దళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమీషన్‌ నివేదికను అమలు చేయడంతో రథ యాత్రకు బ్రహ్మాండమైన ఊపు రావడంతో, అది 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారి తీసింది. వీటన్నిటి ద్వారా బీజేపీకి పెద్దఎత్తున ఎన్నికల ఆధిపత్యానికి మార్గం తెరుచుకుంది.
అదే సమయంలో బీజేపీ ఆధిపత్య రాజకీయాలు, ఓవైపు దళిత సమాజాన్ని అదుపులో ఉంచుతూనే, వారిని సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థాయిలో సంతోషపెట్టాలనుకుంది. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‘సామాజిక్‌ సంరాష్ట మంచ్‌’ (సామాజిక సామరస్య వేదిక)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల శ్రేణీగత వ్యవస్థను కాపాడుకుంటూనే ”హిందూ ఐక్యతా” సందేశాన్నిచ్చింది. అంబేద్కర్‌ ”కుల నిర్మూలనకు” భిన్నంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తూనే దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ (తమ రాజకీయ విశ్వాసాలకు అనుగుణంగా సామాజిక మార్పుకోసం ప్రయత్నం), కో-ఆప్షన్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ దళిత సమాజంలో కొంత భాగాన్ని గెలిచింది.దళితుల్ని సంతోషపెట్టేందుకు, యూపీలో సుహేల్‌ దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను ముస్లిం వ్యతిరేకులుగా చిత్రించడం మొదలు పెట్టింది. ఇది ఒకే రాయికి రెండు పిట్టలను చంపడం లాంటిది. దళితుల ఇళ్ళలో తినడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకునే బీజేపీ ప్రయత్నాలు, ”సంస్కృతీకరణ” అనే ప్రక్రియ ద్వారా సమాజంలోని ఒక వర్గ ప్రజల్ని గెలిపించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌, స్వయం సేవకుల(కార్యకర్తలు) విశాలమైన నెట్‌ వర్క్‌ ద్వారా దళిత సమాజంలో ఎన్నికల పునాదిని నిర్మించింది. ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీల వారిని ముస్లింలను ప్రసన్నం చేసుకునే వారిగా ప్రచారం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను ప్రసన్నం చేసుకోని పార్టీ బీజేపీ మాత్రమేనని దళితుల్లో ప్రచారం చేసింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఇలాంటి వ్యూహాలతో, 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 84 సీట్లకుగాను 44సీట్లను గెలుచుకుంది.
దళిత ముస్లింల సమస్య
ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితులకు, రిజర్వేషన్లు కల్పించాలా, వద్దా అనేది ప్రాధాన్యతను సంతరించుకున్న మరో అంశం. ”దళిత ముస్లింలు” రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. ముస్లింలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటారు. దళితులుగా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసిస్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పించాలని అనేకమంది దళిత రచయితలు, మేధావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల శ్రేణీగత వ్యవస్థను అనుమతించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేధావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లింలైన దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాంలో కుల శ్రేణీగత వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. వారి వాదనలో ఉన్న లోపం ఏమంటే, మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్నత వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్థారిస్తాయి. దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అనేక అంశాలను ప్రభావితం చేసే వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు. ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు ప్రారంభించినపుడు, నిమ్న కులాల ముస్లింలకు ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే కారణంతో ఆధునిక విద్యను అందించడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
కనీస నిర్ణయాత్మక చర్యల నుండి ఇతర దళితుల లాంటి దళిత ముస్లింలను దూరం చేయడం అంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేక్‌ను ఎక్కువ మంది కోరినప్పుడు, దాని పరిమాణాన్ని పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్ల పై ప్రభావం చూపి, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేధావులు వాదిస్తున్నారు. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిథ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే క్రమంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోకూడదు.
(”ద వైర్‌” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
రామ్‌ పునియానీ