హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌

Healthy breakfastఉదయాన్నే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలనుకునేవారు ముందుగా ప్రిఫర్‌ చేసేది ఇడ్లీ. ఆవిరి మీద ఉడికించే ఈ ఇడ్లీలు అంటే అందరికీ ఇష్టమే.. ఉదయాన్నే వేడివేడిగా ఫ్లఫీగా ఉండే ఇడ్లీలను చట్నీ, సాంబార్‌తో తినడానికి చాలా మంది ప్రిఫర్‌ చేస్తారు. ఇందులో నూనె పాత్ర జీరో అనే చెప్పాలి. కాబట్టి, డైట్‌లో ఉన్నవారు కూడా వీటిని చక్కగా తినొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ అని చెప్పొచ్చు. దీనిని సాధారణంగా, ఇడ్లీ రవ్వ, మినపప్పుతో కలిపి చేస్తారు. అయితే, ఈ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ని మరింత హెల్దీగా మార్చాలంటే కొన్ని వేరే ఫుడ్స్‌తో కూడా కలిపి చేయొచ్చు. వీటి కాంబినేషన్‌ మన ఆరోగ్యాన్ని పెంచడంలో కీ రోల్‌ పోషిస్తాయి. వాటిలో కొన్ని రకాలు నేటి మానవిలో…
బీట్‌రూట్‌తో..
కావలసిన పదార్థాలు: బియ్యం – రెండు కప్పులు, మినప్పప్పు – ఒక కప్పు
బీట్రూట్‌ – ఒకటి, నెయ్యి – ఒక స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం: ఈ బీట్‌రూట్‌ ఇడ్లీ తయారు చేయడానికి ముందుగా బియ్యం, మినపప్పును విడివిడిగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక బీట్‌రూట్‌ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని, మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యం, మినపప్పును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రెండింటిని కలిపి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బీట్రూట్‌ పేస్ట్‌ను కూడా ఇందులో కలిపి మిశ్రమాన్ని రాత్రిపూట పులియబెట్టాలి.
ఆ తరువాత ఇడ్లీ ప్లేట్‌లలో ఈ బీట్‌రూట్‌ పేస్ట్‌ కలిపిన పిండిని పోసుకొని ఉడికించాలి. వాటిని తీసి ఓ ప్లేట్‌లో పెట్టుకుంటే బీట్‌రూట్‌ ఇడ్లీలు సిద్ధమైనట్లే. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో లేదా సాంబార్‌తో తినొచ్చు.
దహీ ఇడ్లీ
కావలసిన పదార్థాలు:
దహీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి వీలైనంత వరకు మెత్తగా ఉండే 5 ఇడ్లీలను తీసుకోవాలి. పెరుగు – ఒక కప్పు, ఉప్పు, చక్కెర – ఒక స్పూను, నూనె – తాలింపుకు సరిపడా. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమర్చి తరుగు, ఇంగువా, దానిమ్మ గింజలు కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా పెరుగును తీసుకొని కాస్త పలుచగా అయ్యేందుకు నీటిని కలుపుకోవాలి. అనంతరం అందులో ఉప్పు, చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రిజ్‌లో పెడితే బాగుంటుంది. ఇడ్లీలు తయారు కాగానే పోపు కోసం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్‌ తీసుకొని అందులో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి వేడి చేసుకోవాలి. అనంతరం అన్ని దినుసులను వేసి వేయించాలి. ఆ తర్వాత ఒక ప్లేట్‌ తీసుకొని వాటిలో ఇడ్లీలను తీసుకోవాలి. వాటిపై పెరుగును పొరలాగా పోసుకోవాలి. అప్పటికే తయారు చేసుకున్న తాలింపును ఇడ్లీలపై వేసుకోవాలి. అలాగే కాస్త పచ్చి మిర్చి తరుగు, దానిమ్మ గింజలను వేసుకోవాలి. అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే దహీ ఇడ్లీ రడీ అయినట్లే. ఒకవేళ మీ పిల్లలు ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోయినా, ఇడ్లీలు మిగలినా ఇలా చేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
పెసరపప్పు ఇడ్లీ
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 4-5 (రుచికి తగ్గట్టు), ఇంగువ – చిటికెడు, కొబ్బరి తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. వంటసోడా – 1/4 టీస్పూన్‌, పెరుగు – 1/2 కప్పు, నూనె – ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసేందుకు.
తయారీ విధానం:
పెసరపప్పును కనీసం 4-5 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన పప్పును, పచ్చిమిర్చి, ఇంగువ, కొబ్బరి తురుము, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకొని, పెరుగు వేసి బాగా కలపాలి. చివరగా వంటసోడా వేసి మళ్ళీ కలపాలి. ఇడ్లీ ప్లేట్‌లకు కొద్దిగా నూనె రాసి, పిండిని నింపి ఇడ్లీ స్టీమర్‌లో వేయాలి. మీడియం ఫ్లేమ్‌పై ఉడికించాలి. అంతే పెసరపప్పు ఇడ్లీ రడీ.
కొర్రలతో
కావలసిన పదార్థాలు : కొర్రలు – మూడు కప్పులు, మినపగుళ్లు – కప్పు, మెంతులు – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం : కొర్రలు, మినపగుళ్లు, మెంతులను శుభ్రంగా కడిగి కొర్రలను విడిగా, మినపగుళ్లు, మెంతులను కలిపి ఐదుగంటలు నానబెట్టాలి. కొర్రలు, మినపగుళ్లు చక్కగా నానాక కొద్దిగా నీళ్లు పోసుకుని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రెండిటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసి పులియనియ్యాలి. పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కొర్రల ఇడ్లీలు సాంబార్‌, చట్నీతో చాలా బావుంటాయి.
పెసరపప్పు, పాలకూరతో
కావలసిన పదార్థాలు : పెసరపప్పు – అరకప్పు, ముప్పావు కప్పు – పాలకూర, పచ్చిమిర్చి-మూడు, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడా. వంట సోడా – పావు స్పూను, నూనె – కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా, అరకప్పు పెసరపప్పుని 3 గంటల పాటు నీటిలో నానబెట్టండి. దీనిని నీరు వేయకుండానే గ్రైండ్‌ చేయండి. ఇందులో ముప్పావు కప్పు శుభ్రం చేసి తరిగిన పాలకూర వేసి బ్లెండ్‌ చేయండి. ఇందులోనే 3 పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టండి. దీనిని ఓ బౌల్‌ వేయండి. కన్సిస్టెన్సీ వచ్చే వరకూ పెరుగు వేసి కలపండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మిక్స్‌ చేయండి. దీనిని ఇడ్లీ ప్లేట్స్‌లో వేసే ముందు ఫ్రూట్‌ సాల్ట్‌ అర టీస్పూన్‌ లేదా తినే సోడా వేసి కలిపి ఇడ్లీలు వేయండి. ఇడ్లీలు వేసే ముందు ప్లేట్స్‌కి కొద్దిగా నూనె రాయండి. దీంతో ఈజీగా ఇడ్లీలు వస్తాయి.
ఇలా పెసరపప్పు, పాలకూరతో చేసిన ఇడ్లీల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఈ, విటమిన్‌ కె, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. ఇవి షుగర్‌ ఉన్నవారికి కూడా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్‌. ఆకుకూరలు తినడం ఇష్టం లేని వారికి, మారాం చేసే పిల్లలకి ఇలా ఇడ్లీలు తయారుచేసి పెడితే వాటిలోని పోషకాలు అందుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఇలా కేవలం పాలకూరతోనే కాదు. మీకు ఇష్టమైన ఆకుకూరతో కూడా ఇడ్లీలను తయారుచేసుకోవచ్చు. తోటకూర ఇలా ఏ ఆకుకూరైనా వేయొచ్చు. అయితే, వీటిని చేయడమే కాదు.. కాంబినేషన్‌ కూడా చాలా ముఖ్యం. కొద్దిగా టేస్టీగా ఉండే టమాట చట్నీ, కొబ్బరిచట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.