జెనీవా : గాజా పరిస్థితులు నరకంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణే ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు. గాజా ఇప్పుడు నరకంగా మారిందని, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని గాజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై జరిపిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను ఎదుర్కొన్నారు. 1998-2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో ఆయన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఆయన చిన్నప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని తన సొంత అనుభవంతో చెబుతున్నానని అన్నారు. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, వ్యాధులతో మరింత మంది చనిపోతారని టెడ్రోస్ అన్నారు. టెడ్రోస్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి భిన్నంగా ఉందని విమర్శించారు.