నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం, గోకినపల్లి గ్రామం నివాసి తోటమళ్ళ రవీంద్ర కుమార్ కు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలి పనులు చేసుకుని బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన తోటమళ్ళ రవీంద్ర కుమార్ (35) నరాలు చచ్చుపడటం వలన కాళ్ళు, చేతులు పూర్తిగా పడిపోయి మంచానికి పరిమితం అయ్యారు. ఖరీదైన వైద్యం చేయించుకోనే స్థోమత లేక దాతల సహాకారం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలుసుకున్న మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత శుక్రవారం గోకినపల్లి గ్రామంలోని తోటమళ్ళ రవీంద్ర కుమార్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ నరాల వ్యాధితో తోటమళ్ళ రవీంద్ర కుమార్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షురాలు దరిపల్లి నాగమణి, సభ్యులు గుడిమెట్ల వెంకట రోషన్, భరత్, నర్వనేని పురుషోత్తం పాల్గొన్నారు.