ఐఐటీ విద్యార్థికి సహాయం చేసిన హెల్పింగ్ హాండ్స్  ఉద్యోగులు..

నవతెలంగాణ – తాడ్వాయి   
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ కు చెందిన సంకే పల్లవి ఇటీవల వెలువడిన గేట్ ఫలితాలలో జాతీయ స్థాయిలో 104 వ ర్యాంక్ సాధించి ఐఐటీ బొంబాయిలో సీట్ (ఎం.టెక్.) లభించింది. కానీ ఐఐటీలో చేరి  ప్రవేశ రుసుము మొత్తం చెల్లించే స్థితిలో ఆమె కుటుంబానికి లేదని, ఆమె ఉన్నత చదువుకు సహాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తుందని తెలుసుకున్న హెల్పింగ్ హాండ్స్ సభ్యుడు అయిన శ్రీ వై. కిషోర్ (డిప్యూటీ తహశీల్దార్) వెంటనే తెలంగాణ ఎస్సి & ఎస్టీ ఎంప్లాయిస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన శ్రీ గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్  గారి దృష్టికి తీసుకొనివెళ్ళి, సహాయం చేయవలసిందిగా కోరగా, స్పందించిన అధ్యక్షులు  ఈరోజు హైద్రాబాదులోని తెలంగాణ సచివాలయం యందు తన హెల్పింగ్ హాండ్స్ సంఘ సభ్యుల సమక్షంలో ఆ విద్యార్థికి శాలువాతో సన్మానించి, ఆమె ఉన్నత చదువుకై  Rs .50,000 /- ఆర్థిక సహాయం (చెక్) అందించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జె.దేవేందర్ (ప్రధాన కార్యదర్శి), బి.గుణవంత్ (కోశాధికారి) , జి.ప్రశాంత్ కుమార్ (సంయుక్త కార్యదర్శి), ఎం.రమేష్ (ఉపాధ్యక్షులు) , సి.హెచ్. గంగ లక్ష్మి, బి.సోమన్న, ఏ.ప్రసాద్ (రిటైర్డ్) , పి.శ్యామ్ సుందర్,  ప్రొఫెసర్ ఎం. రామేశ్వర్ రావ్, కే.స్వామి, ఎస్.కిషోర్, కే.పరశురామ్, పి.రవి, టి.ఉమ మొదలగు హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.