కేరళ సినీ పరిశ్రమను పూర్తిగా కుదిపివేసిన హేమ కమిటీ నివేదిక యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కోల్‌కతా, తమిళనాడు వంటి వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు హేమ కమిటీ వంటి కమిటీలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలను లేవనెత్తారు. ఇది న్యాయమైన ప్రశ్న. మహిళలపై ఈ తరహా దోపిడీ బాలీవుడ్ మొదలుకొని సినీ పరిశ్రమ అంతటిలో వుందనేది బహిరంగ రహస్యం. కానీ ఈ రంగాన్ని శాసించే శక్తులు మహిళల గొంతు నొక్కేస్తున్నాయి.
సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉమెన్ సినిమా కలెక్టివ్’ (డబ్ల్యుసిసి)ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కేరళ. తమ సహోద్యోగుల్లో ఒకరికి ప్రముఖ నటుడి చేతిలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో ఈ సంస్థ ఏర్పడింది. పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా సంస్థకు గొప్ప మద్దతునిచ్చింది. తమ ప్రాంతంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను డబ్ల్యు.సి.సి సభ్యులు లేవనెత్తడంతో వామపక్ష ప్రభుత్వం ఆ సమస్యను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
పితృస్వామ్యంతో పాతుకు పో యిన ఏ సమాజంలోనైనా ప్రగతిశీల మార్పునకు నాంది పలికేది మహిళలే. భారతదేశంలో మహిళా సంఘాలు, ఉద్యమాల చరిత్ర కూడా ఇదే. మహిళల పట్ల సానుభూతి చూపే, వారి సమస్యలను వినే ప్రభుత్వం.. డబ్ల్యు.సి.సి వంటి ఉద్యమానికి ఎంతగానో తోడ్పడింది. మహిళా ఉద్యమం, రాజకీయ శక్తులు చేతులు కలిపితే పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గట్టి అడుగు పడుతుంది. సామాజిక మార్పుకోసం మహిళలు చేస్తున్న పోరాటాల్లో వామపక్షాలు శక్తివంతమైన మిత్రపక్షంగా ఉన్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది. మహిళలపై దోపిడీని నిరోధించడానికి, అవసరమైన అన్ని రకాల రక్షణలకు అది కట్టుబడి ఉంది. హేమ కమిటీ ఏర్పాటు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బఅందం (సిట్) నియామకం అందుకు అద్దం పడుతోంది.
సినీ పరిశ్రమను శాసించే శక్తులపైన, లైంగిక దోపిడీ, లాబీలకు సంబంధించిన అంశాలపైన హేమ కమిటీ నివేదిక దృష్టి సారించింది. మహిళా కళాకారులు అత్యంత అరక్షిత పని పరిస్థితులలో, విశ్రాంతి గదులు కూడా లేకుండా, ఎటువంటి ఒప్పందాలు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. హేమ కమిటీ నివేదిక ప్రకారం, పరిశ్రమలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక సంఘాలు సినీ రంగంలో ఉన్నాయి. అయితే వాటిలో చాలావరకు నమోదు కాలేదు. అనేక సంఘాలు ఎవరి కోసం నిలబడాలో వారినే దోపిడీ చేస్తున్నాయని తేలింది.అటువంటి సంస్థలన్నిటినీ రిజిస్టర్ చేసి, వాటి కార్యకలాపాలన్నిటినీ చలన చిత్ర పరిశ్రమ నియమ నిబంధనల పరిధిలోకి తీసుకు రావాలని హేమ కమిటీ సిఫారసు చేసింది.
ఫిల్మ్ అసోసియేషన్ ‘అమ్మ’ సంస్థ సభ్యులను ఎంపిక చేయడంలో కూడా వివక్ష చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. హేమ కమిటీ నివేదిక వెలువడ్డాక..ఆ సంస్థ పని తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడంతో సంస్థకు చెందిన మొత్తం ఆఫీస్ బేరర్లు రాజీనామా చేయాల్సి వచ్చింది.సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేసేందుకు ‘సిట్’ను ఏర్పాటు చేసి ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం ఆదర్శప్రాయమైన చర్య తీసుకుంది. వేధింపులు జరిగి ఎంత కాలమైనా ఫిర్యాదు చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. బెంగాల్ కళాకారులు సహా అనేకమంది ‘సిట్’కు ఫిర్యాదులు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడారు. మహిళకు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. అయితే, మహిళలు ఫిర్యాదులు చేయనారంభించినప్పుడు, నిందితులు కూడా వాటిపై తిరుగు ఫిర్యాదులు చేశారు. ఇది పితృస్వామ్య సమాజంలోని సమస్య. తమను తాము సమర్థించుకోవడానికి చాలామంది నుండి ఇలాంటి స్పందనలు రావడం సహజం.
న్యాయం కోసం పోరాడుతున్న వారి పక్షాన వున్నామని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మహిళా ఫిర్యాదుదారులకు రక్షణ కల్పించేందుకు, రౌడీలపై చర్యలు తీసుకునేందుకు ‘సిట్’ అవసరమైన చర్యలు తీసుకుంటుందనడంలో సందేహం లేదు. మహిళలు మాట్లాడితే తప్ప సమాజం మారదు. కాబట్టి దాడి చేసిన వారి పేర్లను బహిర్గతం చేయడమనేది బాధితుల రక్షణకు ఉపయోగపడుతుంది.హేమ కమిటీ నివేదిక ప్రచురణకు సంబంధించిన అన్ని సమస్యలను అధిగమించడానికి ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. అంతేగాక అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకుంది. అయితే కేరళలోని కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించి ఒకే ఒక ఎజెండా ఉంది. అదేమంటే ప్రభుత్వ ప్రయత్నాలను ఏదో ఒక విధంగా అడ్డుకోవడమే. సినీ పరిశ్రమలో మహిళల న్యాయ పోరాటానికి ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం మద్దతుగా నిలిచినప్పుడు, లైంగికదాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రక్షించే పార్టీగా కాంగ్రెస్ మారింది. మీడియాలోని కమ్యూనిస్టులకు వ్యతిరేకమైన ఓ వర్గం వారికి మద్దతు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. దర్యాప్తు బృందానికి అందిన ఫిర్యాదు ఆధారంగా సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ముఖేష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిందితులను కాపాడుతోందన్న కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చింది.
ఇలాంటి విషయాల్లో ‘వారు చేశారు కాబట్టి మేం చేశాం’ అనే ధోరణి ఉండకూడదు. ప్రతి చోటా మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంపై దృష్టి సారించాలి. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో-సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడేందుకు ప్రభుత్వం, సమాజం తమకు తోడుగా నిలుస్తున్నాయని మహిళలు విశ్వసించాలి. కేరళకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. న్యాయపోరాటంలో హేమకమిటీ నివేదిక మరో మైలురాయి వంటిది. ఇందుకు అండగా నిలిచిన మహిళలకు అభినందనలు. మహిళలు చెప్పింది వింటూ వారికి మరింత బలాన్ని ఇచ్చినందుకు కేరళ వామపక్ష ప్రభుత్వానికి ధన్యవాదాలు.
బృందాకరత్