ఆమె కళ పదిమందికి ఉపాధి

Her art employs ten peopleఖాళీ సమయం దొరికితే చాలు సీరియళ్లు, షాపింగ్‌లు లేదా ఇరుగింటి పొరుగింటి వారితో ముచ్చట్లు. సాధారణంగా సగటు మహిళల జీవితాల్లో మనం చూస్తున్నది ఇదే. సెల్‌ ఫోన్లు చేతికొచ్చిన తర్వాత మానవ సంబంధాలకు పూర్తిగా దూరమయ్యాము. ఇంట్లో కూర్చునే కావలసినవి ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకుని సరదా తీర్చుకుంటున్నాం. అయితే వీటన్నింటికి భిన్నంగా పదిమందికి ఉపాధి కల్పిస్తూ, ఇంట్లో కూర్చునే ఆర్ధికంగా ఎదగవచ్చు అనే ఆలోచన వచ్చింది ఆమెకు. అంతే తనకు తెలిసిన టెక్నాలజీని కాలక్షేపానికి కాకుండా ఉపాధి కోసం మలుచుకుంది. ఫేస్‌బుక్‌లో ఒక గ్రూప్‌ క్రియేట్‌ చేసి వందల మందికి క్రోచెట్‌ వర్క్‌ నేర్పిస్తున్నారు మాధవి సూరి భట్ల. ‘రికార్డ్స్‌ల్లో మన పేరు ఉండటం కాదు మన పేరు మీదే రికార్డ్స్‌ ఉండాలి’ అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
తండ్రి టీచర్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. తల్లి గృహిణి. అక్కా, అన్నయ్యలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. మాధవి ఎం.ఎ పర్సనల్‌ మేనేజ్మెంట్‌, ఎం.బి.ఏ. మార్కెటింగ్‌ చేసి అంతటితో ఆగిపోకుండా ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు. కొన్నేండ్లు హెచ్‌.ఆర్‌ మేనేజర్‌గా ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేసారు. భర్త ఒక ప్రైవేట్‌ కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. పిల్లలు సెటిల్‌ అయ్యాక జాబ్‌ మానేసి తనకు వచ్చిన క్రాఫ్ట్‌ వర్క్‌, సంగీతం నలుగురికి నేర్పించాలి అని మధు క్రాఫ్ట్‌ ఎన్‌ క్రియేషన్స్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక పేజ్‌ క్రియేట్‌ చేశారు. తను తయారు చేసిన వస్తువులను అందులో పోస్ట్‌ చేసేవారు.
మహిళా మనోవికాస్‌గా…
కోవిడ్‌ టైంలో ఆమె చేసిన క్రాఫ్ట్‌ వర్క్స్‌ చూసి కొంత మంది నేర్పించమని అడిగారు. దాంతో ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టి నేర్పించడం మొదలుపెట్టారు. అలా మొదలైన ఆ శిక్షణలో ఇప్పటి వరకు 1100 మందికి ట్రైనింగ్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌ క్లాసులు కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వాళ్ళు మాధవి వద్ద క్రాఫ్ట్‌ వర్క్‌ నేర్చుకుంటున్నారు. తనతోపాటు ఆమె వద్ద నేర్చుకున్న స్టూడెంట్స్‌ కూడా వారు తయారు చేసినవి ఆ ఫేస్‌ బుక్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టారు. అందుకే పేజ్‌ పేరును మహిళా మనోవికాస్‌గా మార్చేశారు. ఈ గ్రూప్‌ సభ్యులు ఇప్పటివరకు రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. 3వ రికార్డు కోసం ఈ సెప్టెంబర్‌లో ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఇంట్లో ఉంటూనే ఖాళీ సమయంలో క్రోచెట్‌ వర్క్‌ చేసుకుంటూ ఉపాధి పొందుతూ రికార్డ్స్‌ కూడా సాధించవచ్చు అని మాధవి నిరూపించుకున్నారు. ‘ఒక సాధారణ గృహిణి కూడా రికర్ద్స్‌ బద్దలు కొట్టవచ్చు’ అంటారు ఆమె.
నిరాశ చెందకుండా…
మాధవి దగ్గర క్రోచెట్‌ వర్క్‌ నేర్చుకున్న వాళ్లలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు,హెచ్‌ ఆర్‌ మేనేజర్లతో పాటు వివిధ ప్రముఖ రంగాలలో పని చేస్తున్న మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన కళలతో ఏడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ను ఆమె సాధించారు. ‘మనకి వచ్చిన విద్య నలుగురికి ఉపయోగపడడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. గత 35 ఏండ్లుగా ఈ క్రోచెట్‌ వర్క్‌ చేస్తున్నాను. కోవిడ్‌ సమయంలో ఆన్లైన్‌ తరగతులు మొదలుపెట్టాను. గిన్నిస్‌ రికార్డ్‌ కోసం చేసినవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోలేని వారికి, అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేశాను. ప్రతి ఏడాది మన దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు క్యాప్స్‌, కౌల్స్‌ బహుమతిగా ఇస్తుంటాను. ఇంటికే పరిమితమై ఏమీ చేయలేకపోతున్నాం అని నిరాశ పడకుండా ఇంట్లో ఉండి కూడా ప్రపంచ రికార్డులు సాధించి, జీవితంలో గుర్తింపుని, ఖాళీ సమయాన్ని ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చు అని ఈ వర్క్‌ ప్రారంభించిన తర్వాతే తెలిసింది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ కళను నేర్పించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటున్నారు ఆమె.
ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి
నేటి సమాజంలో చాలా మంది దిశా నిర్ధేశం లేకుండా జీవిస్తున్నారు. ఎటువంటి కళా నైపుణ్యం మీద ఆసక్తి చూపకుండా కేవలం సెల్‌ఫోన్‌కి అలవాటుపడిపోతున్నారు. సోషల్‌ మీడియాకు బానిసలైపోతున్నారు. అటువంటి మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడే ఆర్ధిక స్వాతంత్య్రం కలిగి ఉండాలంటారు మాధవి. మున్ముందు ఆమె మరెన్నో ప్రపంచ రికార్డులు సాధించాలని, తాను కోరుకున్నట్టు ఎంతో మందికి ఈ కళను పరిచయం చేయాలని కోరుకుందాం.
– పాలపర్తి సంధ్యారాణి

ఒత్తిడి తగ్గుతుంది
‘ఉద్యోగాలు చేసే మహిళలే ఒత్తిడికి గురవుతారనుకుంటే పొరపాటు. ఇంట్లో ఉండే మహిళలైనా ఇంటి పని, పిల్లల పనితో అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రోచెట్‌ వర్క్‌ వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు ఇంటి అలంకరణకు అవసరమైనవి స్వయంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఆర్డర్స్‌ మీద కూడా చేసి ఆదాయం పొందవచ్చు’ అంటారు మాధవి.