కామ్రెడ్ ఎన్ఎస్ లక్ష్మిదేవమ్మ… ఓ ఉత్సాహం. పార్టీ పట్ల, మహిళా ఉద్యమం పట్ల అచంచల విశ్వాసం. నమ్మిన ఆశయం, లక్ష్యం కోసం కడవరకు నిలిచిన ఆదర్శమూర్తి. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలని తపించే సేవా మూర్తి. వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా కీలకపాత్ర పోషించారు. ఏ వయసు వారితో అయినా ఇట్టే కలిసిపోయే ఆధునిక అమ్మమ్మ. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ ఉద్యమంలోనూ తన వంతు కృషి చేశారు. త్వరలో సీపీ(ఐ)ఎం రాష్ట్ర నాలుగువ మహాసభలు జరుగబోతున్న సందర్భంగా ఆమె అందించిన స్ఫూర్తి నేటి మానవిలో…
లక్ష్మిదేవమ్మ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో పుట్టారు. ఆర్థిక స్థోమత కలిగిన కుటుంబం వీరిది. లేకలేక పుట్టిన లక్ష్మిదేవమ్మను తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. చిన్నప్పటినుండీ తన చుట్టూ ఉన్న స్నేహితులను కూడగట్టుకుని చదువులోనూ, అల్లరిలోనూ ఓ ప్రత్యేకత కనబరిచేవారు. చదువంటే ఆమెకు చాలా ఇష్టం. పత్రిక, అభ్యుదయ పుస్తకాలు, మహనీయుల చరిత్రలు, నవలలు ఇలా ఏది దొరికినా చదివేవారు. అప్పట్లో ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉండేది. విద్యార్ధులంతా ప్రతివారం అక్కడికివెళ్ళి చదువుతున్నారా లేదా అనే పర్యవేక్షణ కూడా ఉండేది. అందువల్లనే చదవడం ఆమెకు అలవాటుగా మారింది.
నిరంతర అధ్యయనశీలి
పదో తరగతి చదువుతున్న సమయంలో మహబూబ్‌నగర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు శ్రీహరితో ఆమెకు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో పార్టీలోకి వచ్చారు. 1958లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అమ్మ నవల, వర్లీ ఆదివాసుల తిరుగుబాటు, జెన్నీమార్స్క్ పుస్తకాలు చదివి ఎంతో ఉత్తేజం పొందారు. ఈ అధ్యయనంతో ప్రజల కోసం పని చేయాలనే సంకల్పం ఆమెలో మరింత పెరిగింది. పిల్లల చదువుల కోసం కొంత కాలం ఉద్యమాలకు దూరంగా ఉన్నా వాళ్లు కాస్త ఎదిగిన తర్వాత పార్టీ అనుమతితో ఉద్యమ జీవితం మొదలుపెట్టారు. 80 ఏండ్ల వయసులోనూ అదే ఉత్సాహంతో ఆమె ప్రజాశక్తి, మానవి, పార్టీ సాహిత్యం నిత్యం అధ్యయనం చేసేవారు. అజ్ఞాత సోదరి పేరుతో నాటి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి మోటూరి హనుమంతరావుగారికి పార్టీ కార్యక్రమాల కోసం నిధిని అందించేవారు.
మహిళలను ఏకం చేసి
గ్రామాల్లో మహిళలకు అతి తక్కువ కూలి ఇచ్చి వారి శ్రమను దోచుకుంటుంటే కూలీలను సంఘటితం చేసి విజయాలు సాధించారు. అంతేకాదు 1987లో అత్యంత వెనకబడిన పాలమూరు జిల్లా కరువు తాండవించింది. ఆకలిచావులు కూడా సంభవించాయి. అటువంటి సమయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మిదేవమ్మ కీలకపాత్ర పోషించారు. మహిళలను ఏకం చేసి 16 గ్రామాల్లో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో సీపీఐ(ఎం) తెలుగు రాష్ట్రాలకు చెరో రు.25,000/-ల చొప్పున ఆఫీసుకు వచ్చి అందజేశారు. ఇలా తన శక్తిమేరకు పార్టీకి, ముఖ్యంగా జిల్లాకు ఆర్థికంగా నిధులు సమకూర్చేందుకు చివరికంటా ప్రయత్నించారు.
తల్లికి తలకొరివి పెట్టి…
ఐద్వా ఆధ్వర్యంలో నడిచే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు కన్వీనర్‌గా ఉన్నారు. అనేకమంది బాధిత మహిళలకు అండగా నిలబడ్డారు. లకిëదేవమ్మ తన తల్లి చనిపోయినప్పుడు ఒక్కగానొక్క కూతురయిన తానే తలకొరివి పెడతానని, ఆడపిల్లనైనంత మాత్రాన ఎందుకు తలకొరివి పెట్టకూడదు అని కుటుంబ సభ్యులను ఎదిరించి తల్లికి తలకొరివి పెట్టారు. ఆనాడు మహిళల్లో అదొక పెద్ద చర్చ. మహిళలపై కొనసాగుతున్న సామాజిక కట్టుబాట్లకు అదొక సవాల్‌గా నిలిచింది. ఇలా ఆమె మహిళలను చైతన్యం చేయడం కోసం నిరంతరం తపించేవారు. బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా తన శరీరం అనేక పరిశోధనలకు తోడ్పడాలన్న ఆమె కోరిక మేరకు పార్థివ దేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అందించారు. ఇది కదా మనకు ప్రేరణ. లక్ష్య సాధన కోసం చెయ్యాల్సిన కృషిని అనుక్షణం గుర్తుచేసే ఆదర్శ జీవితం ఆమెది.
ఆమె ఆశయ సాధనలో
లక్ష్మిదేవమ్మ ఉద్యమకారిణి మాత్రమే కాదు మంచి రచయిత కూడా. ఆమె రచనలు సులువైన సరళితో ఉండేవి. మా అమ్మమ్మ కథ, పట్నంలో బతుకుదామని, గుర్తుకొస్తున్నాయి, జీవితం-ఉద్యమం అనే పుస్తకాలు ఆమె రచించారు. చివరి రోజుల్లో ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో హైద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్లో చేరింది. ఆ ఆస్పత్రి బెడ్‌పై ఉండే ఆమె తన నాలుగో పుస్తకం జీవితం – ఉద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆమె ఆశయ సాధనలో వసంత, అర్జున్‌లు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. అలాగే అమ్మమ్మ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమంలో అడుగుపెట్టిన మనుమరాలు మమత ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.
ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచించేవారు
లక్ష్మీదేవమ్మ నాకు మేనత్త కూతురు. 1986లో నేను బి.ఇ.డి వాళ్ల ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమె సీపీఐ(ఎం) సారధ్యంలో అనేక కార్యక్రమాలు చేసేవారు. మహిళలను సమీకరించి సమస్యలపై పోరాటం చేసేలా చైతన్యపరిచేవారు. పార్టీ ఆదేశాల మేరకు అంబలి కేంద్రాలు పెట్టారు. వనపర్తిలో పవనగంటి ఈశ్వర్ భార్య సత్యమ్మ, నాగేశ్వర్ భార్య వీరమ్మలను, నాగిరెడ్డి భార్య విమలమ్మలను కలుపుకుని అనేక కార్యక్రమాలు చేసేవారు. ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచించేవారు.
– రాధా పురుషోత్తం, వనపర్తి
పోరాట పతాకం
చిరునవ్వుకు చిరునామ లక్ష్మిదేవమ్మ.. చిరకాలపు స్నేహాన్ని అందించావమ్మా.. నన్ను ఒంటరిని చేసితివి ఎందుకమ్మా.. అనుదినం నీ జ్ఞాపకాలే అత్తమ్మ… లక్ష్మిదేవమ్మ అజాత శత్రువు. స్నేహశీలి. కల్మషం లేని పసిపిల్లల మనస్తత్వం. ఇంట్లో ఎటు చూసినా ఆమె జ్ఞాపకాలే. ఆమె లేని లోటు బాగా ప్రస్పుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను. తనతో నా అనుబంధం 25 ఏండ్లు. ఎంతో గౌరవం, ప్రేమగా ఉన్నారు. తను ఒక మోడ్రన్ అత్తగారు. లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ తెలుసుకునేవారు. ఇంగ్లీష్, హిందీ భాషలు బాగా తెలుసు కాబట్టి ఆయా భాషల సినిమాలు, పాటలు అర్థం చేసుకునేవారు. ఆమె ఒక మానవతావాది. అందరినీ గౌరవించటం, అందరితోనూ కలిసిపోవటం ఆమె ప్రత్యేకత. మనకు వున్నంతలో ఎదుటి వారికి సహాయం చేయటం ఆమె దగ్గరి నుండి నేర్చుకున్నాను. తనకు పార్టీ అన్నా, పార్టీ కార్యకర్తలన్నా మక్కువ. వారిని కలిసినప్పుడల్లా వారి బాగోగులు అడిగి తెలుసుకునేవారు. వయసు తారతమ్యం లేకుండా అందరినీ పలకరించేవారు. ఆమె జీవితం ఓ పోరాటం. ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. విజేతగా నిలిచారు. చావును కూడా ఎదిరించి, పోరాడి చివరకు అలసిపోయారు. మరణించిన తర్వాత కూడా తన దేహాన్ని ప్రజల కొరకు అందించారు. ఆమె జీవితం మాకు ఆదర్శప్రాయం. – వసంత అర్జున్, చిన్నకోడలు.
ఉద్యమ స్ఫూర్తి
స్ఫూర్తినిచ్చే త్యాగాల అరుణ తారలు ఒక్కొక్కరకుగా నింగికెగసి పోతుంటే మనసులో తీరని బాధ కలచి వేస్తున్నది. నేను కర్నూల్ జిల్లా నుండి ఆమె మహబూబ్‌నగర్ జిల్లా నుండి ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశాలకు హజరయ్యే వారం. చిరునవ్వుతో ఎంతో ఆప్యాయంగా పలకరించే వారు. నిండైన ఆమె ప్రవర్తన నన్నెంతో ఆకర్షిం చేది. అందుకే ఇద్దరం గొప్ప స్నేహితులమయ్యాం. తర్వాత వియ్యపురాళ్లమయ్యాం. పీడిత బాధిత మహిళల సమస్యల పట్ల స్పందించి, వారి పోరాటాల్లో మమేకమై జీవితమంతా పరిమళించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించారు. చివరికంటూ క్రమశిక్షణతో, అత్యంత నిబద్ధతతో జీవిం చారు. మానవతకు వర్గపోరాటాన్ని జోడించి నడిచారు. ఆమె జీవితం త్యాగమయం.
– కె.విశాలక్ష్మి
నమ్మిన సిద్ధాంతం కోసం…
నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలకు వెళ్లడానికి ఎంతో ప్రోత్సహించేది. అమ్మమ్మ పుస్తకాలు బాగా చదివేది. తనకు పర్సనల్లైబ్రరీ ఉండేది. దాని క్యాట్‌లాగ్ తయారు చేయడానికి నన్ను హెల్ప్ అడిగేది. అలా అభ్యుదయ సాహిత్యం నాకూ అలవాట య్యింది. సినిమాలకు కూడా బాగా తీసుకెళ్లేది. డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో చెప్పేది. నలుగురితో కలవడం, సరదా గా ఉండడం అంటే అమ్మమ్మకు బాగా ఇష్టం. లోపల ఎంత కష్టం ఉన్నా పైకి కనబడనిచ్చేవారు కాదు. బయట వాళ్లు చాలా మంది మీకు ఆ పదవులు ఇస్తాము ఈ పదవులు ఇస్తాము అన్నా ఒప్పుకోలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలబడింది.
– మమత.