రాష్ట్రాన్ని తాజాగా రెండు సమస్యలు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. జీవో 29ఇష్యూతో గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయా లేదా? అన్న గందరగోళానికి గురిచేశాయి. వేలాది నిరుద్యోగుల జీవితాలకు ముడిపడి ఉన్న ప్రశ్న ఒకటి అయితే, రెండోది సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్. గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న ఈ శక్తులకు ప్రభుత్వ అనాలోచిత చర్యలు, పనులు అయాచిత ఆయుధాలుగా ఉపయోగపడు తున్నాయి. భాధితులు, సమస్యను ఎదురుకునే వాళ్లు ఈ విచక్షణను అర్థం చేసుకొకుండా ముందుకుపోతే యావత్ సమాజానికే నష్టం. నేడు రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న పని అచ్చంగా అలాగే ఉంది.
పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ఏదో ఒక వివాదం వెంటాడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు గతేడాది నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికి మూడుసార్లు ప్రిలిమ్స్ జరిగినా మెయిన్స్ సమయానికి ఏదో ఒక వివాదం ముంచుకొచ్చి నిర్వహణ సందిగ్ధంలో పడుతున్నది. తాజాగా జీవో 29 ఇష్యుతో షెడ్యూలు ప్రకారం పరీక్షలు జరుగుతాయో లేవో అనే కన్‌ఫ్యూజన్ అభ్యర్థులను కలవరపెట్టింది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చినా రాష్ట్రంలో ఆందోళనలు ఆగలేదు. సోమవారం (మరికొన్ని గంటల్లో పరీక్ష అనగా) సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. దీంతో సోమవారం యధావిధిగా పరీక్షలు జరిగాయి. వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. కానీ, ఈ సమస్యపై ఉద్యోగార్ధుల పక్షం మేమున్నామంటూ తెగ ఫోజులుకొడుతూ, రిజర్వేషన్ల గురించి సైతం గొంతు చించుకుంటూ ఆందోళనకు దిగితున్నట్టుగా బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
తెలంగాణలో రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తున్న కేంద్రమంత్రులు…కేంద్రంలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ రిజర్వేషన్ల ఊసేలేకుండా చేస్తున్నారు. ఇది ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ఊరించి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఆచరణలో యువతరాన్ని నిట్ట నిలువునా ముంచేసింది. మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా పనిచేసే చేవ ఉన్నా.. ఉపాధి దక్కక యువతరం ఈసురో మంటోంది.. భారత్‌లో ఉపాధి పరిస్థితి భయంకరంగా ఉందని నిరుద్యోగిత రేటు, కీలక లేబర్ సూచీలు స్పష్టం చేస్తున్నాయి. వాటిపై పల్లెత్తుమాట మాట్లాడని సదరు బీజేపీ నేతలు రాష్ట్రంలో మాత్రం నిరుద్యోగం గురించి, రిజర్వేషన్ల అమలు గురించి రచ్చ చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
తాజాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్‌లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ‘హిందువులకు చీమునెత్తురు లేదా, గాజులేసుకుని కూర్చొన్నారా’ అంటూ విరుచుకుపడ్డారు. ఇక మాధవిలత అయితే మాటకు ముందు, వెనక సనాతనం, హిందుత్వం తప్ప ప్రజలు, ప్రజా సమస్యలు అనే ముచ్చటే వుండదు. ఈ వివాదంపై ఒక కేంద్ర మంత్రి సమగ్ర విచారణ జరగాలని అంటారు. ఇంకో కేంద్ర మంత్రి వెళ్లి నోరు పారేసుకుంటున్నారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం స్పందిస్తూ ‘నుపుర్‌శర్మకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్‌లో ఒకర్ని గొంతుకోసి చంపేశారనీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని హెచ్చరికలు జారీ చేశారు. అంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇదే పద్ధతిని అనుసరిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి. మత విద్వేషాల మీద వున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై ఉండదు. రోజుకొక వివాదం.. పూటకో రచ్చ చేస్తోన్న నేతల తీరు మారదా? ‘మత మీటర్ లేనిదే కిలోమీటర్ నడవలేని నేతలు’ తెలంగాణలో పాగా కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు చేయని కుట్ర, కుతంత్రం లేదు. ఆ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అప్రదిష్ట పాల్జేసేందుకు ఇక్కడి కమలం నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలను మనం కొట్టిపడేయలేం. అందులో భాగంగానే ప్రతి సందర్భాన్ని తనకు అవకాశంగా మార్చుకుంటుంది. ప్రభుత్వ తప్పిదాలే వారికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ మతతత్వ శక్తులను రానీయకుండా అడ్డుకట్ట వేయాలంటే ప్రజల సమస్యలను, నిరుద్యోగుల భయాలను నివృత్తి చేసి, రిజర్వేషన్లకు ఇబ్బందిగా ఉన్న 29జివోను ప్రభుత్వం విరమించుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించాలి. మతపరమైన ఘర్షణలు తలెత్తకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించాలి. లౌకికపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలి. అప్పుడే గుంటనక్కలకు చెక్ పెట్టగలం!