ఇదిగో యువ సాహిత్యం

Here is youth literatureఇది ఒక ప్రయోగం. ప్రయోజనకరమైన ప్రయోగం. తెలుగు నేలపై ఇది నిజంగా తొలి ప్రయత్నమే. యువ కలాలు తమ రచనలపై అంతరంగాన్ని ఆవిష్కరించారు. యువత ఎందులోనూ తీసిపోదు అని నిరూపించింది ‘తెలంగాణ సాహితి – డివైఎఫ్‌ఐ’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ -2024. తెలుగు నేలపై యువత సాహిత్య రంగంలో వెనుకబడి ఉంది. సాహిత్యం చదవడం లేదు. సాహిత్య సభలకు రావడం లేదు. యువత తమ సజనపై సీరియస్‌గా లేరు అనే చర్చలు ఉండనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నలభై ఏండ్ల లోపు వారి రచనలు సీరియస్‌ ఉండటం లేదు అనే అపవాదు సైతం మోయాల్సి వచ్చింది. కానీ అక్టోబర్‌ 4,5 తేదీల్లో జరిగిన యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ – 2024 అలాంటి అపోహలను తొలిగించే ప్రయత్నం చేసింది.
వర్తమాన సమాజం పట్ల నిబద్దత, రాజకీయ పరిజ్ఞానం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఇలా సాహిత్య సజనకు సరిపడా సరంజామా అంతా యువత దగ్గర సిద్దంగా ఉంది. వస్తు ఎంపిక, నిర్వహణలో సైతం కొత్తదనం సంతరించుకుంది. సాహిత్య రచనలోకి కొత్త కలాలు ప్రవేశంతో వస్తువులో, శిల్పంలో మార్పు వచ్చింది. వ్యక్తీకరణ నైపుణ్యాలు సైతం కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. యువ కలాల సజనాత్మకత మట్టి పరిమళాలతో పులకిస్తుంది. కొత్త ప్రమేయాలు సరికొత్తగా ఆవిష్కరించబడుతున్నాయి. కానీ వారి నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి సరైన వేదికలు ఉండటం లేదు. తమ వ్యక్తీకరణలో ఉండే లోపాలను సరిదిద్దే శిక్షణ కొరవడుతున్నది. ఫలితంగా సాహిత్య సజనలోకి ‘అ’సాహిత్యం ప్రవేశిస్తుంది.
మరి కొత్త కలాలకు, గళాలకు వేదిక ఇస్తున్న వారెందరున్నారు? అందుకే తెలంగాణ సాహితి ఒక అడుగు ముందుకేసి యువతనే వ్యక్తులుగా ఎంపిక చేసి వారి ద్వారా రచనా మెళకువలు పెంచుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యం నుంచి వచ్చిన కొన్ని ఆలోచనల ఫలితంగానే మొదటిసారి యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ జరిగింది. అరవై మంది యువ సజనకారులు నవల, కథ, విమర్శ, పాట, కవిత్వంపై లోతైన విశ్లేషణ చేశారు. మరో వందమంది సజనకారులు ఈ ఫెస్ట్‌ లో సామూహిక కవితా పఠనం, గానం చేశారు. కల్చరల్‌ ఫెస్ట్‌ సైతం ఆలోచింపజేసింది. ఇన్నిరకాల సాహిత్య సజనకారులు ఈ వేదిక మీది నుంచి సారవంతమైన ఆలోచనలు పంచుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఈ యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ తొలి అడుగుగా చరిత్రలో నమోదవుతుంది.
ఆ ఒరవడిలో 4,5 అక్టోబర్‌ 2024న రెండు రోజుల పాటు జరిగిన యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ వేదిక అయింది. లిటరరీ ఫెస్ట్‌ ఆలోచనకు, ప్రణాళికకు, ఆచరణకు తెలంగాణ సాహితి మూలధాతువు. దానికి డివైఎఫ్‌ఐ తోడై నిలిచింది. నిర్దిష్టంగా ఈ రెండు రోజులలో స్వీయ నవలా విశ్లేషణ, స్వీయ కథా విశ్లేషణ, విమర్శపై యువత అవగాహన, సినిమా పాటలపై లోతైన విశ్లేషణ, యువత కవిత్వతత్వం ఇలా ఐదు విభాగాలుగా లిటరరీ ఫెస్ట్‌ కొనసాగింది. తెలుగుభాష భవిష్యత్‌ మీద నిర్దుష్ట కార్యక్రమ రూపకల్పన ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
సమాజంలో అనేక తోవలు, కోవలు, పాయలు ఉంటాయి. ఎవరి మార్గంలో నడిచేవారు వారి బాటసారులతో సంభాషించుకోవాలి. అదే సమయంలో ఏదో కూడలిలో కలిసినప్పుడు, ఉమ్మడి ప్రయాణం గురించి, ప్రయాణపు ఉమ్మడితనం గురించి కూడా మాట్లాడుకోవాలి. భాషాసాంస్కతిక అస్తిత్వం నుంచి చూసినప్పుడు తెలుగువారంతా ఒకటిగా బయటి ప్రపంచానికి కనిపించాలి. ఆ తపనతోనే యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ నిర్వహించాం. ఈ కూడలిలో కలుసుకున్న యువ సాహిత్యకారులు తమ రచనలపై స్వీయ విశ్లేషణ చేయడం, ఒకరి రచనల గురించి మరొకరితో పంచుకోవడం చూస్తే సాహిత్యం సింగడేసిందా అన్నట్టు సాగింది ఈ యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ -2024. – అనంతోజు మోహన్‌కృష్ణ, 88977 65417
సాహిత్య సజనలో ఉన్న యువతీయువకులు చాలామంది పాల్గొన్నారు. నవల, కథ, కవిత్వం, పాట, విమర్శ రాస్తున్నవాళ్ళు ఇందులో ఉన్నారు. ఇలా ఒకే వేదిక మీదకి అందుబాటులో ఉన్న వాళ్లందరూ పాల్గొనటం ఎంతో వైవిధ్యంగా అనిపించింది. వాళ్ళ స్వీయ అనుభవాలను, రచనా ప్రయాణాన్ని రికార్డు చేయడం అద్భుతమైన ప్రయోగం. సమాజం, పుస్తకాలు, వ్యక్తులు, సంస్థలు వాళ్లమీద వేసిన ప్రభావాలను వినడం ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఇప్పటి యువత రాస్తున్న కవిత్వం మీద మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. 1984 తర్వాత పుట్టినవాళ్లు ఒక విభాగంగా, 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఒక విభాగంగా చేసుకొని అధ్యయనం చేశాను. మొదటి విభాగం వారిమీద వివిధ సామాజిక ఉద్యమాల ప్రభావం, వారిదైన అందమైన బాల్యం ఉంది. కానీ రెండవ విభాగంవారికి అవి చాలా తక్కువ. ముఖ్యంగా రెండో విభాగం యువతపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువ. దక్పథం స్పష్టత ఉన్నవాళ్లు, లేనివాళ్ళు ఇద్దరూ ఈ రెండు విభాగాల్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక కొత్త భావచిత్రాల ప్రపంచంలోకి వెళ్లొచ్చిన అనుభూతి ఈ రెండు విభాగాల యువత రాసిన కవిత్వాన్ని చదివితే కలుగుతుందని మాత్రం ప్రకటించగలను.
– డా. ఎస్‌.చందయ్య , అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నిజాం కళాశాల
అభినందనీయం
సమాజంలో ఒక్కరోజులోనే మార్పు రావాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది. అధ్యయనమే సమాజ మార్పునకు మార్గం. శాస్త్రీయ కోణంలో సాహిత్య విశ్లేషణలు ఉండాలని నా ఆకాంక్ష. ఆ దిశగా యువ రచయితలు ముందడుగు వేయాలి. దేనినైనా చేయగలిగే దఢ సంకల్పం యువతలో ఉంటుంది, సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్లడం మంచి పరిణామం. తెలంగాణ సాహితి ప్రయత్నం అభినందనీయం. ప్రశంసనీయం. దారితప్పుతున్న సమాజాన్ని తమ సాహిత్యం ద్వారా బాగు చేయాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. అనేక కొత్త ఒరవడులు పుట్టుకొస్తున్న తరుణంలో సాహిత్యంలో శాస్త్రీయ దక్ఫథాన్ని జొప్పించాలనీ, శాస్త్రీయ కోణంలో విశ్లేషణలు చేయాల్సిన అవసరం మనపై ఉంది. సాహిత్యమనేది సిబ్బి అయితే దాని మీద పొరలుగా పొందికగా సాహిత్యాన్ని (నవల, కథ, విమర్శ, కవిత, పాట) పేర్చడం బతుకమ్మ.
– డా.మామిడి హరికష్ణ,
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు
యువతిపై గురుతర బాధ్యత ఉంది రచనకు కావాల్సిన వస్తువును ఎంపిక చేసుకోవడం, బాధ్యతాయుతమైన లక్ష్యం వైపు అడుగులు వేయడం లాంటి గురుతర బాధ్యత యువ రచయితలపై ఉంది. ఉన్నతమైన రచనలు శతాబ్దాన్ని, యుగాన్ని ప్రభావితం చేసే చోదక శక్తులుగా ఉంటాయన్నారు. రచయితలు ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్ని ఓపికగా వినే లక్షణాన్ని అలవర్చుకోవాలి. అంతర్జాతీయ సంస్థల స్థాయిలో వారి రచనలపై వారి మాటల్లోనే తెలియజేయడం అభినందనీయం. ఈ కొత్త ఒరవడికి తెలంగాణ సాహితి బాటలు వేసింది.
– డా.ఎస్‌. రఘు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం
నేను రాసిన నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. అయినా ఆ నవల నేపథ్యాన్ని వివరించే అవకాశం నాకు ఈ ఫెస్ట్‌ ద్వారానే వచ్చింది. ఇంత మంది తమ స్వీయ నవల నేపథ్యాన్ని వివరించడం… గొప్ప అనుభూతిని ఇచ్చింది.
– గడ్డం మోహన్‌ రావు, నవల రచయిత
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గ్రహీత
మనం ఎక్కడో ఉండి రాస్తూ మన పరిధిలోని రచయితలు, వాళ్ల పుస్తకాల వరకు మాత్రమే అవగాహనతో ఉంటాం. కానీ మనకు అవతల చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని, ఎన్నో ఏళ్లుగా సాహితీకషి చేస్తున్నారని తెలుసుకోవడం అవసరం. అప్పుడే మనల్ని, మన పనిని జాగ్రత్తగా అంచనా వేసుకుంటాం. లేకపోతే మనం మాత్రమే గొప్ప అనే అహంకారపు నీడ మన మీద పడుతుంది. అది చాలా ప్రమాదం. ఇలాంటి కార్యక్రమాల్లో అందర్నీ కలుసుకోవడం, వారి రచనల గురించి తెలుసుకోవడం వల్ల మన ఎక్కడ ఉన్నాం, ఏం రాస్తున్నాం, ఇంకా ఏం రాయాలి.. అనేవి తెలుస్తాయి. ఆ అవకాశం ఈ ఫెస్ట్‌ ఇచ్చింది. యువతనంతా వేదిక ఎక్కించి, వారి రచనల గురించి వారినే మాట్లాడి, విశ్లేషించుకోమనడం బాగుంది.
– సాయి వంశీ (విశీ), కథా రచయిత
యువత ప్రాపంచిక దక్పథంతో రచనలు చేయాలి సమాజం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో యువత రచనలపై దష్టి సారించడం ప్రవాహానికి ఎదురు ఈదడమే. తనకేంటి లాభం అని ఆశిస్తున్న కాలంలో సమాజంలోని ప్రజలను చైతన్యపర్చడానికి యువ రచయితలు ముందుకు రావడం అభినందనీయం. మంచి లక్ష్యం, సజనాత్మకతతో కూడుకున్న రచనలు ఎల్లకాలం నిలబడి ఉంటాయి. ప్రతి రచనకూ భాష ముఖ్యమైనదనీ, రచనలెప్పుడూ ప్రజల భాషలో ఉండేలా యువ రచయితలు నిలబడతారు. ప్రతి రచనలోనూ ప్రాపంచిక దక్పథం ఉండాలి. గొంతులేని సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేలా రచనలు రావాలని, ఎక్కువ మంది అమ్మాయిలు రచనారంగం వైపు రావటం మంచి పరిణామం.
– కె.ఆనందాచారి, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి
యూత్‌ ట్రెండ్‌ సెట్‌
యువ కవులకు కవిత్వం పట్ల అభిలాష ఉంది. మారుతున్న కాలంలోనూ కవిత్వం చెప్పడంలో యూత్‌ ట్రెండ్‌ సెట్‌ చేయడం సంతోషంగా ఉంది. యువ కవులు సొంత అనుభవాలను రాస్తూనే, సమాజ సమస్యలతో అనుసంధానం కావాలి. నవల, పాట, కవిత్వం, నాటకం, కథ తదితరాంశాల్లో నోటి మీద చెప్పగలిగే వారున్నారు. సాహిత్యంలో ఏ అంశంపైనైనా తమదైన ముద్ర యువత వేసుకుంటున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం.
– ఏనుగు నరసింహారెడ్డి, ప్రముఖ కవి, రచయిత
తెలంగాణ సాహితి డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 4,5 తేదీల్లో జరిగిన ‘యూత్‌ లిటరరీ ఫెస్ట్‌’ ఓ కొత్త అనుభూతిని కలిగించింది. యవకవులు, రచయితలు తమ తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకోవడానికి ఓ వేదికనిచ్చింది. పాట, కవిత్వం, కథ, విమర్శ, నవల ప్రక్రియల్లో రచనలు చేస్తున్న ఎంతోమంది యువకవులకు, రచయితలకు అసలు సిసలైన చర్చావేదికలా నిలిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నేను సభాధ్యక్షత వహించిన పాటల సెషన్‌లో నాతో పాటు పాల్గొన్న చాలామంది గీతరచయితలు తమ పాటల ప్రస్థానాన్ని గురించి చెప్పుకునే అవకాశం దొరికింది. వారి వారి సాధక బాధకాలను గురించి, సినీరంగంలో నేడు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి, సన్నివేశానికి అనుగుణంగా, బాణీకి తగ్గట్టుగా పాట రాయడానికి వారు పడే కష్టం గురించి.. ఇలా ఎన్నో విషయాలు ఒకరినొకరు పంచుకోవడానికి అవకాశాన్నిచ్చింది తెలంగాణ సాహితి, డివైఎఫ్‌ఐ ఇలా యువకవులతో, రచయితలతో కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోని క్రియేటివిటీని వెలికితీయడానికి అవకాశముంటుంది. యూత్‌ కి తమ భావాలను స్వేచ్ఛగా వేదికపై వినిపించుకోవడానికి అవకాశముంటుంది.
– డా. తిరునగరి శరత్‌ చంద్ర, కవి, సినీగీతరచయిత
తెలంగాణ సాహితి, డివైఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యూత్‌ ఫెస్ట్‌హొఎంతో మందిలో ఆలోచనను రేకెత్తించింది. కొత్తగా కవిత్వం, కథ, నవల, పాట రాసేవాళ్ళకు కావలసిన మెలకువలెన్నో నేర్పింది. నలభై సంవత్సరాల లోపు యువకులను వేదికకు పిలిచి వారి స్వీయ అనుభవాలను పంచుకోమని చెప్పి వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ ఫెస్ట్‌ లో భాగంగా కవిత్వ విభాగంలో నేను పాల్గొన్నాను. నా సాహితీ ప్రయాణాన్ని, నాకు తెలిసిన కవిత్వానుభవాలను పంచుకున్నాను. తోటి కవుల సాహితీ ప్రస్థానాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కథకులు, నవలాకారులు, విమర్శకులు, సినీ గీతరచయితల అనుభవాలను వినటమే కాకుండా ఆ మిత్రులందరిని కలుసుకునే అవకాశం కలిగింది. అన్ని ప్రక్రియల మీద సాధికారికంగా చర్చ జరిగింది. తెలిసిన విషయాలు పంచుకున్నాం. తెలియని విషయాలను ఎన్నో తెలుసుకున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. యువకులకు మార్గదర్శనం చేయటంలో ఈ ఫెస్ట్‌ విజయవంతమయింది.
– తండ హరీష్‌, యువకవి, విమర్శకులు
ఒక పాట సష్టికి సంగీత దర్శకుని తర్వాత ముఖ్య భూమిక పోషించేది గేయ రచయిత. కానీ తను కనపడడు, వినపడడు. కేవలం యూట్యూబ్‌లో పేరు వరకే పరిమితమౌతాడు. అలాంటి గేయ రచయితలను ఒకచోట కలిపి, వాళ్ళనోట పాటగురించి, వాళ్ళకష్టాలు, అవమానాలు, ప్రశంశలు, విమర్శలు విజయాలు అందుకుంటున్న తీరు నలుగురితో పంచుకునే అవకాశం కల్పించడం గొప్ప విషయం. దీని వలన ఎందరో మిత్రులతో పరిచయాలు, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు ఆత్మస్థైర్యం కూడా పెంపొందించుకునే అవకాశం కలిగింది. నిర్వాహకులకు ధన్యవాదాలు
– గడ్డం వీరు
సినిమా అనగానే దర్శక, నిర్మాతల పేర్లే గుర్తు పెట్టుకుంటారు కాని గీతరచయితల పేర్లు గుర్తు పెట్టుకోకపోవడం ఒకింత బాధాకరం. సినిమాపాటలు రాస్తాం.. కాని విడుదలవ్వడానికి చాలా కాలం పడుతుంది.. సినీరంగంలో గుర్తుండిపోయే పాటలు రాసిన కవే నిలబడతాడు.
– కడలి సత్యనారాయణ, సినీగీతరచయిత
లిటరరీ ఫెస్ట్‌ కవులు, కళాకారులకు మంచి అనుభూతిని మిగిల్చిన సమ్మేళనం. పాటలపై స్వీయ విశ్లేషణలో పాల్గొనడం, మాట్లాడడం చాలా ఆనందాన్ని మిగిల్చిన సందర్భం. పాట రాయడం వెనుక ఉన్న అంతరంగాన్ని, రాసిన తర్వాత ఆ పాట ఒప్పించడానికి నడిపే తతంగాన్ని తెలియజేయడం ఈ సభలో ముఖ్య ఘట్టం. తత్కారాల మేళవింపులో, ఛీత్కారాల, అవమానాల భారాలను అధిగమించి పాటల పూదోటలు పూయిస్తున్న ఈ తరం సినీ గేయరచయితల అంతరంగాలను ఆవిష్కరించినందుకు తెలంగాణ సాహితికి అభినందనలు.
– నాగరాజు కువ్వారపు, సినీ గేయ రచయిత

ఏదో ఊహాలోకంలో ఉండి పట్టీ పట్టనట్లు ట్రాన్స్‌లో రాసేవి కాదు ఆ కథలు. పూర్తి హోష్‌లో ఉండి జోష్‌తో రాస్తుంది. తెలియని జీవితాలు, వాటి నేపథ్యాలు తెలియపర్చడం తన దక్పథం. రచనలో చదువరులు లీనమై ఎక్కడో ఒక దగ్గర తమను తాము చూసుకోగలగాలి. సొంత గాథలను వినిపించే సాహసం చేయాలి అనేది నా ప్రగాఢ భావన.
– మానస ఎండ్లూరి
సినిమాపాట అనగానే చాలామందికి చిన్న చూపు ఉంది. కాని సినిమా పాట రచన అనేది చాలా కష్టతరమైనది. అది అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో కష్టపడి ప్రయాణం చేసేవాళ్ళకు సినిమాపరిశ్రమ ఎప్పుడూ స్వాగతం చెబుతుంది. నా అనుభవాలను పంచుకోవడానికి ఓ వేదికను కల్పించిన తెలంగాణ సాహితికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది లబ్ద ప్రతిష్ఠులతో కలిసి వేదికను పంచుకోవడం సంతోషంగా ఉంది.
– పూర్ణాచారి, సినీగీత రచయిత

తెలంగాణ సాహితి, డివైఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ యూత్‌ ఫెస్ట్‌-2024 చాలా బాగా జరిగింది. సాహిత్య కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి కానీ ఇందులో యూత్‌ కోసం యువతనే ముందుపెట్టి రెండు రోజుల పాటు వివిధ అంశాల (నవల, కథ, కవిత్వం, పాట, విమర్శ) మీద ఫెస్ట్‌ నిర్వహించడం సాహిత్య రంగంలో కొత్త సాంప్రదాయానికి నాంది. వారి వారి అంశాలను విశ్లేషించే వ్యక్తులతో పాటు, సభాధ్యక్షలు కూడా యువతే ఉండటం ఇక భవిష్యత్తు మీదే అని నిర్దేశించినట్టుగా ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సభను సజావుగా నిర్వహించే వీలు ఉంటుంది. ఇందులో యువత ఎవరు రాసిన రచనల మీద వారే విశ్లేషణ చేయడం ద్వారా వారి రచనా నేపథ్యం, ఎలాంటి సందర్భంలో రాశారు, వేటిని ఆధారం చేసుకొని రాశారనే అంశాలు తెలిశాయి. కొత్తగా రేసేవారు, కొన్ని రాసి ఆగినవారికి ఈ ఫెస్ట్‌.. స్ఫూర్తి దాయకం. ఈ ఫెస్ట్‌ వల్ల వెంటనే ఫలితం కాకున్నా దీనిలో దీర్ఘకాలిక ప్రయోజనం దాగి ఉందని నా అభిప్రాయం
. – బద్ది గణేశ్‌, యువ కథా రచయిత
విరామం లేని ప్రయత్నాలే యువ రచయితల విజయానికి సోపానాలు. సోషల్‌ మీడియా మీద అతిగా ఆధారపడొద్దు. ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించుకోవాల్సిన అవసరం రచయితలపైన వుంది.
– నస్రీన్‌ఖాన్‌, ప్రముఖ రచయిత్రి
రచయితలు, కవులు తమ రచనల ద్వారా సమాజానికి మార్గ నిర్దేశం చేస్తారు. అందులో ఇంతమంది యువత వుండడం స్ఫూర్తిదాయకం. యువ తరచయితలను ప్రోత్సహించడంలో డివైఎఫ్‌ఐ సైతం ఎప్పుడూ ముందు వరుసలో వుంటుంది.
 – ఆనగంటి వెంకటేష్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
కొత్త రచనలకు, కొత్త రచయితలకు చక్కని మార్గాన్ని సూచించే విధంగా ఉంది. కేవలం పెద్ద రచయితలకే కాకుండా నవతరానికి, వారి ఆలోచనలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, వారి రచనలను మరింత మెరుగు పరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. యువత సాహిత్యంలోకి రావాలంటూ వేదికల మీద చెప్తూ, యువత రచనల్లోని తప్పులను మాత్రమే వెలికి తీసి దానిని సరిదిద్దుకునేల చేయకుండా, వారు చేస్తున్న తప్పేంటో చెప్పకుండా ఉంటున్న తరుణంలో యువతకు మంచి ప్రోత్సాహంలా నిలిచింది తెలంగాణ సాహితి, డివైఎఫ్‌ఐ. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కతజ్ఞతలు – కెపి లక్ష్మీనరసింహ
యువత సాహిత్య అభిప్రాయాలు పంచుకోవడమే అరుదైన విషయం. అలాంటిది మా రచనలపై మాతోనే మాట్లాడించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. కొత్త రచయితలు తయారు కావడానికి ఇదొక మంచి వేదిక.
– మన్‌ ప్రీతమ్‌ కె.వి. యువ కథా రచయిత
సాహిత్య విమర్శ చాలా స్పష్టంగా ఉండాలి. వ్యక్తులను బట్టి విమర్శ ఉండదు. నిస్సందేహంగా రచనలపై భిన్న పార్శ్వాలు బయటకు రావాలి. అలా విమర్శ చేసినప్పుడే మంచి రచనలు బయటకు వస్తాయి. యువత తమ రచనలను మెరుగు పరుచుకోవడానికి ఇలాంటి చర్చలు నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది.
– బండారి రాజ్‌ కుమార్‌, యువకవి, విమర్శకులు
తెలంగాణ సాహితీ, డివైఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన యూత్‌ లిటరరీ ఫెస్ట్‌ యువ రచయితలకు ఎంతగానో తోడ్పడుతోంది. నవల, కథ, కవిత, పాట, విమర్శల్లో స్వీయ విశ్లేషణా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఉపయోగకరం. కొత్తవారికి, ఇప్పటికే రాస్తున్న యువతకి రచనా నిర్వహణకి సంబంధించిన మెలకువలు, వస్తువు ఎంపిక చేసుకునే పద్ధతులు, నిర్వహణలో బిగువు, రచనకి దక్పథం కలిగి ఉండాల్సిన అవసరం అర్థం చేయించేలా ఫెస్ట్‌ జరిగింది. సుమారు అరవై మందికి పైగా యువ సజనకారులను ఒకే చోట పోగేసి మాట్లాడించించిన తీరు అద్భుతంగా అనిపించింది. దీనికి ప్రధానంగా కషి చేసిన తెలంగాణ సాహితీ యువ సమన్వయకర్త అనంతోజు మోహన కష్ణని అభినందించాల్సిందే.
తెలంగాణ సాహితీ, డివైఎఫ్‌ఐ కి జేజేలు. – ఎం. విప్లవకుమార్‌
మనకు తెలియని ఒక ఉద్వేగానికి గురైనప్పుడు రాసేదే కవిత్వం. వర్తమాన కవులు రాస్తున్న కవిత్వంపై ఒక పరిశీలన చేస్తే యువత ఉద్యమ కవిత్వం, సంఘటనాత్మక కవిత్వం, మైనారిటీ కవిత్వం, దళిత కవిత్వం, స్త్రీ వాద కవిత్వం ఇలా ఏ అంశంల నైనా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇలాంటి వేదికలు ఆ కషిని మరింత బలోపేతం చేస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
తగుళ్ళ గోపాల్‌,
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
యువ కథకులు వాళ్ల కథ నేపథ్యాన్ని వివరిస్తూ కథ రాయడానికి ఎదురైన సందర్భాలను, తమ చుట్టూ వున్న సామాజిక విషయాలు అధ్యయనం చేయడం, ఇవన్నీ అందరితో పంచుకోవడం, వారి నుండి నేనూ నేర్చుకోవడం బాగుంది. ఇంత మంచి అవకాశం యువ కథా రచయితలకు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ సాహితీ టీంకి అభినందనలు. – శ్రీ ఊహా, కథా రచయిత్రి
భాషా, సాంస్కతిక, సామాజిక, రాజకీయ, ఉద్యమ భావజాల వ్యాప్తికి నవల గొప్ప కాన్వాస్‌. ఈ నేల బిడ్డల అమరత్వాన్ని, గోసతో తండ్లాడిన బడుగు బతుకుల్ని, మట్టిమనుషుల తత్వాన్ని, ప్రేమను చిత్రికగట్టుటకు నవల ఒక వేదిక. నవల రాయడమంటే గిజిగాడు గూడు కట్టిన విధం, అవ్వ శిబ్బి అల్లిన రీతి. తెలంగాణలో సాకబోసిన అక్షర కన్నీళ్ళతో నవల ఊరబోనం అవుతుంది. అస్తిత్వాన్ని కాపాడుకోడానికి, వత్తికులాల ఉనికికి నవల రాయడం అవసరం. ప్రజలమనిషి నుండి పొత్తి దాకా తెలంగాణ నవలలు దారి పొడవునా అల్లబడిన చైతన్యపాఠాలు, మరిచిన త్యాగాలను రికార్డ్‌ చేసిన పతాకాలు. తెలంగాణ సాహితి నిర్వహించిన ప్రతీ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం అత్యధికం. అది సముచితం. రెండు రోజుల లిటరరీ ఫెస్ట్‌ యువ రచయితలకు, కవులకు లభించిన అరుదైన ప్లాట్‌ ఫామ్‌. కొత్త రచనా దారికి ఇది వినూత్న పాదు. యువసజనకు నాడీకేంద్రం. ఇదొక కార్యశాల, సాహితీకర్మాగారం.
– డా. నర్రా ప్రవీణ్‌ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు,
నర్రా ఫౌండేషన్‌, తెలంగాణ తెలుగు పరిశోధక మండలి
ఈ తరం యువకులను, వారి సాహిత్యాన్ని, ఆ సాహిత్యం మీద చర్చాగోష్టిని ఒకే వేదిక మీద చూడటం చాలా సంతోషంగా అనిపించింది. అత్యంత కష్టసాధ్యమైన పనిని సఫలీకతం చేసినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో సినీ గీత రచయితగా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– డా. మల్లెగోడ గంగా ప్రసాద్‌, సినీగీతరచయిత