ఇది సినిమా టైటిల్‌లా ఉందే. ఏ సినిమాలోనూ హీరో, విలన్ ఒక్కటి కారు కదా? అలా సినిమా తీస్తే జనం చూడరు. అందుకే కమర్షియల్ ప్రొడ్యూసర్ ఎవరు దానికి కమిట్ కారు. నేను చెప్పేదీ మాత్రం రాజకీయాల్లో జరుగుతున్న తీరు గురించి. కొంతమంది హీరోల్లా, అప్పుడప్పుడు విలన్ల మారిపోతుంటారు. కొన్నిసార్లు వారి పాత్రలు కూడా మారుతుంటాయి. అలాంటివి చూసి, చూసి ప్రజలకు కూడా అలవాటైపో యింది. రాజకీయాల్లో అటువంటి ఓ సంఘటన మీకు గుర్తు చేస్తున్న. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ముంచి రాష్ట్రంలో కమలాన్ని వికసింపజేయాలనే కుట్రతో బీజేపీ మునుగోడులో ఉప ఎన్నికకు స్కేచ్ వేసింది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతోపాటు బీజేపీలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. రాజగోపాల్‌రెడ్డి అన్నగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం బీజేపీలో తమ్ముడి విజయం కోసం పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్ విలన్‌గా చూసింది. ఆ సమయంలో ఆయన లండన్ వెళ్లడం, అనుయాయులకు ఫోన్లు చేసి తమ్ముడికి ఓట్లు వేయాలని కోరడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇండియన్ ఫైల్స్ హీరో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ అప్పట్లో వెంకట్‌రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ‘పార్టీలో ఉంటే ఉండండి..లేకపోతే వెళ్లిపోండి’ అంటూ తీవ్ర స్వరంతో గర్జించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో హీరోలా అనిపించినా, వెంకట్‌రెడ్డి విలన్‌లా అనిపించినా పై చేయి మాత్రం ఆయనదే అయింది. అప్పటి నుంచి అద్దంకికి ఏ పదవి రాకుండా అడ్డుపుల్లా వేస్తున్నారని టాక్. పరిస్థితులు మారాయి. ప్రస్తుతం పాత్రలు మారాయి. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి అయ్యారు. అద్దంకి దయాకర్ ఇండియన్ ఫైల్స్ చిత్రం హీరో అయ్యారు. ఆ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు సినిమాటోగ్రఫి మంత్రి కోమ టిరెడ్డిని అద్దంకి ఆహ్వానించారు. కడుపులో తలపెట్టి మరీ ఫొటోకు ఫోజులిచ్చారు. ఆ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో కూడా ఇద్దరు ఎంతో అప్యాయతను పంచుకున్నారు. సినిమాపై కోమటిరెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ఈ అపూర్వ సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులు ‘హీరో, విలన్ ఒక్కటయ్యారు’ అని గుసగుస లాడుకున్నారు.
– గుడిగ రఘు