వీరయ్య సహాయం

వీరయ్య సహాయంరుద్రవరంలో వీరయ్యకు నా అనే వాళ్లు ఎవరూ లేరు. ఆ ఊళ్లో ఎవరు వ్యవసాయ పనులకు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లేవాడు. వీరయ్య కచ్చితంగా వస్తాడు కాబట్టి రెండు రోజులు ముందే వీరయ్యకు కబురు పెట్టేవారు. కూలీ ఇంత కావాలని ఎవరినీ అడగడు. వాళ్ళు ఇచ్చింది తీసుకుని, అక్కడే భోజనం చేసేవాడు. కొంతమంది కూలీ ఇవ్వకుండా భోజనం మాత్రమే పెట్టేవారు. ఆ ఊళ్లో అందరికీ తనకు చేతనైనంత సహాయం చేస్తూ తలలో నాలుకలా ఉండేవాడు. ఓ రోజు పక్క ఊరి కాంతయ్య రుద్రవరానికి వచ్చి ”వీరయ్యా… రేపు మా చేలో పని ఉంది నువ్వు రావాలి” అని పిలిచాడు.
”తప్పక వస్తానయ్యా ”అన్నాడు వీరయ్య వినయంగా. చెప్పినట్లుగానే మరుసటి రోజు కాలిబాటన కాంతయ్య వాళ్ల ఊరు వెళ్తున్నాడు. దారిలో ఓ చెట్టు కింద ఇద్దరు పసి పిల్లలు ఆకలి అంటూ ఏడుస్తున్నారు. చుట్టూ చూశాడు. చాలా దూరంగా ఉంది ఆ పిల్లల తల్లి. పిల్లలు ఆకలితో గుక్క పట్టి ఏడుస్తున్నారని వెంటనే ఊరిలోకి పరుగు తీసి తన దగ్గరున్న డబ్బులతో పాలు కొని అంతే వేగంతో పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు పాలు పట్టాడు. పాలు తాగడంతో పిల్లల ఏడుపు ఆగింది.
అప్పుడు వచ్చింది ఆ కన్న తల్లి ”డబ్బులు లేక పాలు పట్టలేక పోయానయ్య, మీ రుణం తీర్చుకోలేను ”అంది. వీరయ్య నవ్వి ”దానిదే ముందమ్మా. పసి పిల్లలు… వాళ్ళు బాగుంటే చాలు. వస్తానమ్మా..” అని వెళ్ళాడు.
వీరయ్య రావడం అలస్యం కావడంతో కాంతయ్య చేలో పని అప్పటికే పూర్తి అయింది. పని లేదు అని కాంతయ్య చెప్పడంతో ”అలాగేనయ్యా” అంటూ వెనక్కి వస్తున్నాడు. ఆకలి బాగా వేస్తోంది. ఏమైనా తిందామంటే డబ్బులు లేవు. పసిపిల్లలకోసం ఖర్చు పెట్టాడు.
అలానే వెళుతుండగా దారిలో ఓ చోట ఓ మూట కనపడింది. విప్పి చూడగానే డబ్బుల నోట్ల కట్టలు. అంత ఆకలితో ఉన్నా, ఎవరివో పాపం పడేసుకు పోయారని మనసులో అనుకుంటూ పట్నం వెళ్ళి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చాడు.
అప్పటికే ఓ వ్యక్తి ఇన్స్పెక్టర్‌ గారితో మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు మూట చూసి ”ఇది నాదే” అన్నాడు ఆ వ్యక్తి సంతోషంగా. దానికి వీరయ్య ”ఇది దారిలో దొరికిందయ్యా. ఎవరిదో పోలీసు వాళ్ళు అందజేస్తారని ఇక్కడ ఇచ్చాను” అన్నాడు.
దానికి ఇన్స్‌పెక్టర్‌ ”ఆ డబ్బు అయనదే. తన కూతురి వివాహం కోసం తీసుకువస్తున్నాడు. దారిలో మూట జారిపోయింది. నీ మంచితనం అభినందించదగ్గది” అన్నాడు.
దానికి వీరయ్య ”డబ్బంతా సరిగ్గా ఉందోలేదో చూసుకోండయ్య నేను వస్తాను ”అని వెళ్ళబోతుండగా
”కొంచెం ఆగయ్యా” అన్నాడు ఆ వ్యక్తి. చటుక్కున ఆగాడు వీరయ్య.
”ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీపరులు వున్నారా అనిపిస్తుంది. ఇదిగో అని ఓ వేయి రూపాయలు ఇచ్చాడు.
”వద్దు అయ్యగోరు” అన్నాడు వీరయ్య.
”మరి ఇంకేం కావాలి ”అన్నాడు ఆ వ్యక్తి.
”ఆకలిగా ఉంది అన్నం పెట్టండి చాలు” అన్నాడు వీరయ్య.
వెంటనే ఆ వ్యక్తి తన ఇంటికి పిలుచుకుపోయి అన్నం పెట్టించాడు. ”ఈ రోజు నుండి నా దగ్గరే ఉండు. నువ్వు చేసిన సహాయం మరువలేను. వ్యవసాయంలో నాకు తోడుగా ఉండు. నాకు తమ్ముళ్లు ఎవరూ లేరు. నువ్వు నా తమ్ముడులాంటివాడివి” అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు.
– కనుమ ఎల్లారెడ్డి, 93915 23027