ఎన్నికల్లో హైటెక్‌ ప్రచారం

Hi-tech campaign in elections– రాష్ట్రంలో ఆరు హెలికాప్టర్ల చక్కర్లు
– నామినేషన్ల తర్వాత మరిన్నీ…
– ఖర్చు పార్టీల ఖాతాల్లోకి సీఈసీ, డీజీసీఏ అనుమతి తప్పనిసరి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైటెక్‌ ప్రచారం జోరుగా సాగుతున్నది. నోటిఫికేషన్‌ సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ పార్టీల హడావిడి పెరుగుతున్నది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఈ ఆధునిక ప్రచారం చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు రెండు చొప్పున ఆరు హెలికాప్టర్లను వాడుకుంటున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నాయి. పార్టీకి రెండు చొప్పున హెలికాప్టర్లను సమకూర్చుకున్న ఈ మూడు పార్టీలు, ఇందుకోసం భారీగానే ఖర్చుపెడుతున్నాయి. ముంబయి, బెంగళూరు, ఢిల్లీకి చెందిన సివిల్‌ ఏవియేషన్‌ సంస్థల నుంచి హెలికాప్టర్లను సమకూర్చు కుంటున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హెలికాప్టర్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. గంటకు కనీసం లక్ష చొప్పున ఆయా ఏవియేషన్‌ సంస్థలు పార్టీల నుంచి రెంట్‌ వసూలు చేస్తున్నాయి. గంటకు ఒక రేటయితే, రోజంతా వాడుకుంటే మరో రేటును ఆయా సంస్థలు అమలుచేస్తున్నాయి. ఒకరోజు మొత్తం కావాలంటే రూ. 12 లక్షల నుంచి 15 లక్షలు ఇవ్వాలంటూ సివిల్‌ ఏవియేషన్‌ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హెలికాప్టర్లకు డిమాండ్‌ పెరుగుతున్నది. హైదరాబాద్‌లో హెలికాప్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర మెట్రో నగరాల నుంచి వాటిని పార్టీలు తెప్పించుకుంటున్నాయి. వాటి నిర్వహణ మాత్రం ఆయా కంపెనీలదే. పోలింగ్‌ తేదీకి సరిగ్గా ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వేగంగా ప్రచారం చేయాలంటే రోడ్డుమార్గంలో సాధ్యంకాదు. అందుకే ఆకాశమార్గాన ప్రతిరోజూ రెండు, మూడు బహిరంగసభలకు హాజరవుతూ హడావిడి చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఏకంగా దాదాపు రెండు హెలికాప్టర్లను రెండు నెలలపాటు అద్దెకు తీసుకుంది. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు వీటిని వాడుతున్నారు. నామినేషన్ల తర్వాత అవసరమైతే మరో రెండింటిని అద్దెకు తీసుకుని సుడిగాలి ప్రచారం చేయాలని ఆపార్టీ నిర్ణయించుకుంది.
కాంగ్రెస్‌ బీజేపీ సైతం ఇప్ప్పటికే రెండు చొప్పున వినియోగిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, మాణిక్‌రావ్రు ఠాక్రే, డికే శివకుమార్‌, శ్రీధర్‌బాబు, మధుయాష్కి గౌడ్‌ వాడుతున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండిసంజరు, లక్ష్మన్‌, బిఎల్‌ సంతోష్‌, ఇతర జాతీయ నేతలు వాటిని వినియోగించుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరో మూడు, నాలుగు హెలికాప్టర్లను ఈ రెండు పార్టీలు సమకూర్చుకునే అవకాశముందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచే హెలికాప్టర్‌ ప్రచారం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లను వాడారు. అప్పట్లోనే ఐదింటిని అద్దెకుతీసుకుని ఇతర ప్రధాన నేతలు వినియోగించుకున్నారు.
ఇప్పుడా హెలికాప్టర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే హెలికాప్టర్ల ప్రచారం ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు. ముందస్తుగా భారత ఎన్నికల సంఘం(సీఈసీ) అనుమతి తీసుకోవాలి.
అదొక్కటే సరిపోదు సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ నుంచి కూడా పర్మిషన్‌ అవసరమే. ఆతర్వాత ఎన్నికల కమిషన్‌ నిర్ణీత వేళల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునే వీలుంది. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ నేతలు విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తెలంగాణను చుట్టే ప్రయత్నం చేస్తున్నారు.