నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు ఇప్పటికే మొదలైన కారణంగా తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. తుది ఉత్తర్వులకు లోబడి పరీక్షలు ఉండేలా షరతు విధించాలన్న పిటిషనర్ల వినతిని సైతం తిరస్కరించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్ పి.కార్తీక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు గురువారం పరీక్షలు మొదలయ్యాయనీ, ఈ దశలో పరీక్షలను వాయిదా వేయవద్దన్న ప్రభుత్వ వినితిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే 2.5 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని ప్రభుత్వం చెప్పింది. పరీక్షల వాయిదా కోరుతూ వికారాబాద్ జిల్లా నాగులపల్లికి చెందిన రాంపల్లి అశోక్ ఇతరులు వేసిన పిటిషన్‌లో విద్యా శాఖ కౌంటర్ వేయాలని ఆదేశించింది.