ఆర్థిక అక్రమాలపై ఏపీ సీఎం సహా 41 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక అవకతవ కలకు పాల్పడుతోందని, ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని వైసీపీ రెబల్‌ ఎమ్‌పి రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్ర హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఏపీసీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41మందికి నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఎజి శ్రీరామ్‌ వాదించారు. ప్రజాప్రయోజనం లేకుండా వ్యక్తి గత కారణాలతోనే రఘురామ పిటిషన్‌ వేశారని పేర్కొన్నారు. పిటిషన్‌ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది.