నవతెలంగాణ -హైదరాబాద్
గతంలోని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పలువురు నాయకులతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను టాప్ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డీజీపీ ఇంటిలిజెన్స్ విభాగాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించి మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచి విచారించింది. ఎస్‌బీఐ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి.