‘మహా’ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

– స్పీకర్‌తో పాటు 14 మందికి
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నోటీసులు పంపింది. మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌తో పాటు ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యే లు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. థాక్రే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న నార్వేకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పిటిషన్లు దాఖల య్యాయి. పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌. గిరీష్‌ కులకర్ణి, జస్టిస్‌ ఫిర్దోష్‌ పూనివాలాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మహారాష్ట్ర లెజిస్లేచర్‌ సెక్రెటేరియట్‌కు కూడా నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 8 లోపు ప్రతివాదులందరూ తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది.