రైతుల్ని అడ్డుకోవద్దు : హైకోర్టు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తమను సొంత భూముల్లోకి వెళ్లనీయడం లేదంటూ గుడాటిపల్లి గ్రామానికి చెందిన బోయిని భాస్కర్‌ ఇతరులు వేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పిటిషనర్లను వాళ్ల భూముల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోరాదని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ఇతరులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్‌, ఇరిగేషన్‌ ఆఫీసర్లు రైతుల విషయంలో సమయమనం పాటించాలని జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హుస్నాబాద్‌ నుంచి రామవరం వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారని, తమ జీవనోపాధి కోసం తమ పొలాల్లోకి వెళ్లి పని చేయడానికి వీలు లేదని చెబుతున్నారని రైతుల లాయర్‌ చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణను 31కి వాయిదా వేసింది.
దానంపై చార్జిషీట్‌ డిస్మిస్‌
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారనే అభియోగాల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కింది కోర్టులో పోలీసులు నమోదు చేసిన చార్జీషీట్‌ను కొట్టివేసింది. 2012 నాటి కేసులో ఆలయ మేనేజర్‌ సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యా దు తర్వాత పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌ ఆయనతో రాజీ చేసుకున్నారు. ఇరువురి మధ్య జరిగిన రాజీ ఒప్పందాన్ని పరిశీలించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పోలీసుల చార్జిషీట్‌ను కొట్టేస్తూ తుది ఉత్తర్వులిచ్చారు.
విచారణను ఎదుర్కొండి
ఓబుళాపురం మైనింగ్‌ లీజులో అక్రమాలు జరిగాయనే కేసులో సీబీఐ కోర్టులో వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేయడాన్ని సవాల్‌ చేసిన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో తన డిశ్చార్జి పిటిషన్‌ ను సీబీఐ కోర్టు కొట్టేయడం అన్యాయమని పిటిషనర్‌ వాదనను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తోసిపుచ్చారు. సీబీఐ కోర్టులోని అభియోగాలపై విచారణను ఎదుర్కొనాలని చెప్పారు.