కోర్టుల్లోని అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేయండి : హైకోర్టు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కోర్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హత ఉన్న వాళ్ల సర్వీసులను రెగ్యులరైజ్‌ చేయాలని హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పదేండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌లను క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అర్హతలున్న వాళ్లను ఖాళీగా ఉన్న గుమాస్తా, టైపిస్టు, సబార్డినేట్‌ పోస్టుల్లో నియమించాలంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ బి.నగేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పైవిధంగా తీర్పు చెప్పిందని పిటిషనర్‌ లాయర్‌ చిక్కుడు ప్రభాకర్‌ తెలిపారు.