– అజ్ఞాతవాసి సూచన మేరకు ఆగిన రిజిస్ట్రేషన్లు..!
– రెండు రోజులుగా ఎదురు చూస్తున్న రైతులు..
– సెలవు పై వెళ్లిన తహసీల్దార్
– కార్యాలయానికి తాళం వేసిన రైతులు
నవతెలంగాణ-కొత్తూరు
మండలంలోని పెంజర్ల రెవెన్యూ పరిధిలోని 255 సర్వే నెంబర్లో రైతులు మంగళవారం స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ జానకి రిజిస్ట్రేషన్ చేయకుండా అందులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సాధ్య సాధ్యాలు పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని, కలెక్టర్ కార్యాలయంలో తనకు పని ఉందని అక్కడి నుంచి వేళ్లారు. దీంతో రైతులు చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లి పోయారు. అయితే బుధవారం తిరిగి రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న రైతులు తహసీల్దార్ జానకి సెలవుపై వెళ్లిందని సోమవారం వరకు రాకపోవచ్చని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా కార్యాల యానికి తాళం వేసి, నిరసన చేపట్టారు. సమా చారం అందుకున్న షాద్నగర్ ఆర్డీవో దళితులతో ఫోన్లో మాట్లాడారు. సాయంత్రం తాను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. సాయంత్రం ఆర్డీవో కార్యాలయం నుంచి డిప్యూటీ తహసీల్దార్ నాన్యనాయక్ రిజి స్ట్రేషన్లు చేసేందుకు పంపిం చారు. ఆయన కూడా సదరు 255 సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉందని గతంలో అధికారులు ఏలా రిజిస్ట్రేషన్ చేశారో తమకు తెలియదన్నారు. ధరణిలో లేని నిషేధం మాన్యువల్ రికార్డులో ఎలా ఉంటుం దని రైతులు ప్రశ్నించారు. కావాలనే అధికారులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయ కుండా కాలయాపన చేస్తున్నారని, తమ అవసరాల కోసం భూములను అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డు తగిలి మమ్మల్ని ఇబ్బంది పెడుతు న్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్లు చేసి తమను ఆదుకోవాలని దళిత రైతుల కోరుతున్నారు.