హై రిటర్న్స్‌.. రిస్క్‌ ఫ్రీ

– తక్కువ సమయంలో అధిక లాభాలంటూ గాలం
-రూ.61,66,807.40 ప్రాఫిట్‌ అంటూ మోసం
– ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో రూ.28.50లక్షలు స్వాహా
నవతెలంగాణ-సిటీబ్యూరో
తక్కువ సమయంలో హై రిటర్న్స్‌ వస్తాయని ఓ వ్యాపారిని నమ్మించిన సైబర్‌ నేరస్తులు లక్షలు దండుకున్నారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యాపారిని టార్గెట్‌ చేసి ‘వీఐపీ 101 ఏబీఏంఎల్‌ స్టాక్‌ స్ట్రాటజీ గ్రూప్‌’ పేరుతో వాట్సాప్‌లో పోస్టులు పెట్టారు. ఆ తర్వాత ఏబీఏంఎల్‌ స్టాక్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌ ప్రతినిధినంటూ ఫోన్‌ చేశారు. తమ సంస్థ స్టాక్స్‌ అండ్‌ ఐపీఓలపై పెట్టుబడుల కోసం సలహాలు, సూచనలు అందిస్తుందని నమ్మించారు. తాము చెప్పిన విధంగా నిన్వెస్ట్‌మెంట్‌ (ట్రేడింగ్‌) చేయాలని, రిస్క్‌ ఫ్రీ అన్నారు. తక్కువ సమయంలో హై రిటర్న్స్‌ వస్తాయని కొన్ని లింక్స్‌ పంపించారు. బ్యాంక్‌ అకౌంట్స్‌, ఇతర వివరాలను సేకరించారు. అంతేకాకుండా ‘ఆదిత్యా బిర్లా మనీ లిమిటెడ్‌'(ఏబీఎంఎల్‌) పేరుతో ఉన్న బ్యాంక్‌ ఎకౌంట్స్‌కు ఫండ్స్‌ పంపించాలని చెప్పారు. ముందుగా చిన్నచిన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయించిన సైబర్‌ నేరస్తులు ఆ తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. మొత్తం రూ.28,50,894లను ఇన్వెస్ట్‌మెంట్‌ చేయించిన సైబర్‌ నేరస్తులు మీ ఎకౌంట్‌లో రూ.61,66,807.40 ప్రాఫిట్‌ వచ్చిందని ఫేక్‌ ఎకౌంట్‌ను చూపించారు. ఆ డబ్బుల్లో కొంత స్టాక్స్‌పై, మరికొంత ఐపీఓలతోపాటు బాధితుని భార్య పేరుపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేశామని చెప్పారు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరడంతో మరికొంత డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలని ఒత్తిడి చేశారు. అవసరమైన నిధులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయకుంటే ఇబ్బం దులు తప్పవని, ఎకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుందన్నారు. లీగల్‌ సమస్యలు వస్తాయని బాధితునితోపాటు అతని భార్యను కూడా బెదిరించారు. అనుమానం వచ్చిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీ సులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులకు ఆర్థిక లావా దేవీల వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచించారు. ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌లో అధిక లాభాలొస్తాయని ఎవరైనా చెప్పితే నమ్మి మోసపోద్దని తెలిపారు. సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930 ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.