వేములవాడ పట్టణంలో హై టెన్షన్ వాతావరణం

– వడ్డీ వ్యాపారుల ఇండ్లు, వ్యాపార సముదాయాలపై పోలీసుల దాడులు
– శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన వైనం
– భారీగా నగదు, విలువైన పత్రాలు స్వాధీనం
– ఓ వ్యాపారి ఇంటి వద్ద 6 గంటల పాటు కొనసాగిన హైడ్రామా
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో ఉత్కంఠకు తెర
– వాట్సప్ మెసేజ్ కు తక్షణమే స్పందించిన ఎస్పీ అఖిల్ మహాజన్ పై ప్రశంసల జల్లులు
నవతెలంగాణ-వేములవాడ
రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం వేములవాడ పట్టణంలోని పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 6 బృందాలతో ఈ దాడుల్లో భారీ ఎత్తున నగదు, పలు కీలక పత్రాలు, ప్రామిసారి నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టణంలోని ఓ వ్యాపారి ఇంట్లో, కార్యాలయంలో జరిపిన దాడుల్లో హైడ్రామా కొనసాగింది. వ్యాపారి దుకాణంలో ఉన్న 3 బీరువాలకు తాళం వేసి ఉంచడం, తాళాలు పగలగొట్టేందుకు వ్యాపారి కుటుంబ సభ్యులు ఒప్పుకొకపోవడం, సదరు అందుబాటులో లేకపోవడంతో సుమారు 6 గంటల పాటు సంఘటన స్థలంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కొంతమంది మీడియా ప్రతినిధులు, ఒక్క ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ అక్కడే పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చివరికి విషయం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి వెళ్లడంతో తర్వాత ఏమైందో ఏమో గాని అరగంట లోపే సంబంధిత వ్యాపారి ఇంటికి చేరుకోగా పట్టణ సీఐ వెంకటేష్ సమక్షంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో బీరువా తాళాలు తెరిచి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ సంబంధిత వ్యాపారి హైదరాబాద్ వెళ్లడంతోనే బీరువాల తాళాలు తెరవడంలో జాప్యం జరిగిందని, ఈ తనిఖీల్లో రూ.9.95లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలు, ప్రామిసరి నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, బాధితులు ఎవరైనా ఉంటే తమకు పిర్యాదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు వెంకట్రాజం, నాగరాజు, రామ్ రెడ్డి, సీసీఎస్ ఎస్సై మారుతి, ఎస్బీ ఎస్సై బాలకృష్ణ, ఎల్లారెడ్డి పేట ఎస్సై ప్రేమ్ దీప్, ఏఎస్సై సోనాతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తక్షణమే స్పందించిన ఎస్పీ..
తనిఖీల్లో భాగంగా పట్టణంలోని మటన్ మార్కెట్ సమీపంలోని ఓ వ్యాపారి కార్యాలయంలో చేపట్టిన తనిఖీల్లో ఉత్కంఠ నెలకొంది. సుమారు 6 గంటల పాటు సదరు వ్యాపారి అందుబాటులో లేకపోవడంతో బీరువా తాళాలు లేక సంఘటన స్థలంలోనే మీడియా ప్రతినిధులు, పోలీసులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వాట్సప్ సాయంతో విషయం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టు, ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న వారు చివరికి వ్యాపారి చేత బీరువా తాళాలు తెరిపించి తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.