తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం

Highest Inflation in Telangana– కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అన్ని రంగాల్లో బీఆర్‌ఎస్‌ సర్కారు విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. తెలంగాణతో తనకు 2008 నుంచి అనుబంధముందని తెలిపారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలోనే ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉందని చెప్పారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలూ ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. వ్యాట్‌ ఎక్కువగా వసూలు చేస్తోందన్నారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉందన్నారు. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణలో అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ అయ్యారని గుర్తు చేశారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కారు విఫలమైందన్నారు. రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారిందన్నారు. విద్య, వైద్యానికి కేటాయింపులు దారుణంగా పడిపోయాయని విమర్శించారు. పోషకాహార లోపంతో ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.