దత్తత స్కూల్లో ‘ హిమాన్షు’ జన్మదిన వేడుకలు

– రూ. కోటి వ్యయంతో నిర్మించిన నూతన భవనం ప్రారంభం
– ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండటం హిమాన్షు గొప్పతనం
– నేటి యువతకు స్ఫూర్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– నూతన భవన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యే గాంధీ
నవతెలంగాణ-మియాపూర్‌
సీఎం కేసీఆర్‌ మనుమడు ఓ క్రిడ్జి పాఠశాల సీఏఎస్‌ అధ్యక్షులు హిమాన్షు.. బుధవారం తన జన్మదినం సందర్భంగా తాను దత్తత తీసుకున్న గచ్చిబౌలి డివిజన్‌ కేశవ్‌నగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ విఫ్‌ గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి హిమాన్షు నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, సీఎస్‌.. హిమాన్షుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండటం.. హిమాన్షు గొప్పతనమని, విద్యార్థులతో ఓ సామాన్యునిగా కలిసిపోయి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నేటి యువతకు స్ఫూర్తి అని అభినందించారు. నూతనంగా నిర్మించిన పాఠశాలలో అంగన్‌వాడీ నుంచి డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పేద విద్యార్థులే వస్తారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ చెబుతుంటారని, అందులో భాగంగా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించటానికి రూ.7200 కోట్లపై చిలుకు నిధులు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్‌పుస్తకాలు అందిస్తూ, డ్రెస్సులు ఇస్తూ, ఉదయం పూట రాగి జావాను అల్పాహారంగా అందిస్తున్నారని తెలిపారు. చాలా మంది ఇంగ్లీష్‌ మీడియం కోసమే ప్రయివేటు పాఠశాలలకు పోతున్నారని, కేసీఆర్‌ గతేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించారని తెలిపారు. 1000 గురుకులాలు స్థాపించి, వాటిలో పాత వాటితో కలుపుకుని 1200 గురుకులాలు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. అన్ని శాఖల్లో కలిపి 1,450 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నా మనుమడు ఏ బియ్యంతో తింటే అదే బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినాలని చెప్పారని, నేటికి అదేవిధంగా అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా రాణించేలా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని, ఆ దిశగా నేడు అడుగులు పడ్డాయన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలని పిలుపునిచ్చారు.