ప్రతి మసీదు వద్ద ఒక శివలింగాన్ని వెతకవద్దని ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్ ఇటీవల హిందూ సమాజానికి ఓ హెచ్చరిక చేశాడు. భారతదేశం ఓ శక్తివంతమైన దేశంగా ఎదగాలని, అందరూ కలిసి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని కూడా ఆయన సెలవిచ్చారు. మతం స్వరూపంపైనా ధర్మం అంటే ఏమిటి? అనే విషయంపైనా అవగాహనలేకనే గతంలో ఎన్నో ఘోరాలు కూడా జరిగాయని ఆయన వాపోయారు.
అయితే జితేంద్రానంద సరస్వతి మఠాధిపతులు కొందరికి ఇది రుచించటంలేదు. హిందూ మతాన్ని గూర్చి సమరానికి ఆదేశాలు ఇచ్చే అధికారం తమకే సొంతమని, సామాజిక సంస్థల నేతలకు అసలు లేనేలేదని వీరి భావన. ‘మేం అతనికి ఆదేశాలు ఇస్తాం తప్ప అతను మాకు ఆదేశాలు ఇవ్వడం కాదని’ కుండబద్దలు కొట్టారు. కొందరిలో నాయకుడు కావాలనే దుగ్దలోనే ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నట్టు కూడా వారు ఆగ్రహోరోపణలతో ఊగిపోయారు.
ఇప్పుడు అసలు సిసలైన హిందూమతవాదులకు పెద్ద చిక్కొచ్చిపడింది. ఎవరి మాటలు వినాలి? ఆరెస్సెస్ వారివా? లేక పీఠాధిపతులుగా ఉంటున్న మతాచార్యుల వారివా? అని. ఆచార్యులు అంటే ఆచరించే ఆర్యులు కదా! అయితే ఇరువురూ హిందూ ధర్మపక్షపాతులే కనుక ఈ ఘర్షణను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు మేధావులు సైతం సన్నాయి నొక్కులు నొక్కడం విడ్డూరం.మరి హిందువులకు నిజమైన మార్గదర్శకులు ఎవరు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
మనది ఓ ప్రజాస్వామ్యదేశం. కుల, మత, భాషా, ప్రాంతాలకు, బేధాలకు అతీతంగా ప్రజలందరిని సమ దృష్టితో చూసే లౌకికస్ఫూర్తి మన భారత రాజ్యాంగం మనకు కల్పిస్తున్నది. చట్టం దష్టిలో అందరూ సమానమేనన్న మన గణతంత్ర (రిపబ్లిక్) పాలన మనకు అదే విషయాన్ని నొక్కిచెప్తున్నది. అటువంటప్పుడు హిందువులు భారతీ యులు కారా? లేక హిందువులు భారతీయులకన్నా అతీతులా?అన్న అనుమానం పైమాటలు వింటున్నప్పుడు కలుగక మానదు.
‘రాజ్యాంగమే మనకు దిక్సూచి. రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కలసి మెలసి పనిచేయాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉన్నదని’ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఉద్ఘాటించిన విషయం విదితమే. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి ఇది అత్యంత అవశ్యమని కూడా ఆమె ఆ సందర్భంలో తెలిపారు.
కాని మత విద్వేషాల చిచ్చు రగిల్చి, అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొనే ఉన్మత్త దుర్నీతిపరులకు రాష్ట్రపతి మాటల అంతఃసారంగాని, రాజ్యాంగపు సామరస్య జీవనస్ఫూర్తిగాని బోధపడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. లేదా రాజకీయ లబ్దికోసమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే వారి ప్రధాన రహస్య ఎజెండాగా భావించడంలో తప్పేముంటుంది?
రాజ్యాంగ దినోత్సవం (నవంబరు 26) నాటికి రెండ్రోజులు ముందే ఉత్తరప్రదేశ్‌లోని సంభావ ప్రాంతంలో ఊహించని విధóంగా మతహింస జరిగింది. స్థానిక కోర్టు ఉత్తర్యుల మేరకు అక్కడ ఉన్న షాహిజామా మసీదు సర్వేను అడ్డుకోవాలని ప్రయత్నించడంతో ఘర్షణ మొదలైంది. చిలికి చిలికి గాలివానగా మారినట్టు రాళ్లురువ్వడం, పోలీసుల లాఠీచార్జీ, బాష్ప వాయుగోళాలు ప్రయోగం, చివరకు కాల్పులు జరపడం, ఐదుగురు చనిపోవడం సంభవించాయి. దాదాపు రెండున్నర వేలమందిపై ఈ సందర్భంగా పోలీసులు కేసులు నమోదు చేయడం ఆశ్చర్యం గొలిపింది.
ఆ షాహిజామా మసీదు ప్రాంతంలో ఐదువందల ఏండ్ల క్రితం హరిహర ఆలయం ఉండేదని, ఆ ఆలయాన్ని వచ్చి బాబర్ మొఘల్ చక్రవర్తి షాహిజామా మసీదును నిర్మించారని, ఆ నిజాన్ని నిగ్గుతేల్చాలని సుప్రీంకోర్టు న్యాయ వాది విష్ణుశంకర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈయనే జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున లాయర్ కూడా.
మసీదులు, దర్గాల కింద ఆలయాలున్నాయని, వాటిని పునరుద్దరించాలని హిందువులు కోర్టులకు ఎక్కు తున్నంత కాలం మతఘర్షణలు చెలరేగడానికి ఆస్కారమున్నదనే విషయం పైఘటన రుజువు చేస్తున్నది. వారణాసిలో జ్ఞాన వాసి మసీదు వివాదం హిందూ మతవాదులకు అతి ముఖ్య మైనది. ఆ మసీదు కింద విశ్వనాథుని ఆలయం ఉందని, ఆ ఆలయాన్ని కూల్చి, ఆ శిధిలాలపై ఔరంగజేబు 1670 ప్రాంతంలో అక్కడ మసీదు నిర్మించాడని హిందూ మత వాదుల ఆరోపణ. ఇప్పుడు ఇలాంటి వివాదాలే మత ఘర్షణ లకు కారణభూతమం అవుతున్నాయనేది కాదనలేని సత్యం.
1991నాటి ప్రార్థనా మందిరాల చట్టంపై తనతీర్పు వెలువడేంతవరకు మసీదుల కింద మందిరాలు న్నాయని వాదిస్తూ వాటిపై సర్వే జరిపించాలని కోరే వ్యాజ్యాలను అనుమతించరాదని దేశంలోని కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు డిసెంబరు 13న ఆదేశాలు జారీచేసింది. రాజ్యాంగంలోని ‘సౌభ్రాతృత్వం’ అనే పదానికి అర్థం తెలుసు కున్నా, ప్రజలం దరికీ సమానత్వపు హక్కు ఉన్నదనే గ్రహింపు ఉన్న సెక్యుల రిజం అనేది భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణ స్వభావం లో భాగమేనన్నది బోధపడుతుంది. ఈ చిత్తశుద్ధి ఉన్నవారు మాత్రమే హిందువులు భారతీయుల్లో భాగమే అనే స్ఫురణ కు వస్తారు. లేనివారు హిందువులు వేరు, భారతీయులు వేరు అంటూ మత ఘర్షణలకు కారకులవుతారు.
– కె.శాంతారావు, 9959745723