ఆగష్టు ఆరు! అది మానవ జాతి సిగ్గుపడాల్సిన భయంకరమైన దుర్ఘటన! రెండవ ప్రపంచ యుద్ధంలో 1945 ఆగష్టు 6న హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబుకు ఆ క్షణంలోనే లక్షల మంది దారుణంగా చనిపోయారు. తరువాత కూడా దాని ప్రభావంవల్ల అనేక దశాబ్దాలపాటు ప్రజలు రకరకాల రోగాలతో మరణించారు. మరణయాతనకు గురయ్యారు. అక్కడి వాతావరణం చాలా సంవత్సరాల వరకూ విషపూరితమైంది. యుద్ధాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద నాయకులు చనిపోరు. జనమూ, అమాయకులైన పిల్లలూ చనిపోతారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలపాలౌతారు. అత్యంత దయనీయంగా మరణిస్తారు. అందుకే అందరూ యుద్ధాలు లేని ప్రపంచాన్నీ, మనుషులూ, జంతువులూ, సుఖసంతోషాలతో శాంతియుతంగా జీవించగలిగే ప్రపంచాన్నీ సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రయత్నంలో భాగంగా ‘ప్రపంచ శాంతిని కోరుకుందాం’ అన్న పేరుతో ‘భారత జ్ఞాన విజ్ఞాన సమితి’, న్యూఢిల్లీ వారు ‘జాతీయ సాక్షరతా మిషన్’ వారి సహాయంతో అరవైకి పైగా పుస్తకాలు ప్రచురించారు. ‘చదువుల ఉద్యమం’ పేరుతో గ్రామీణ ప్రజల్లో, పిల్లల్లో చదవటం పట్ల ఆసక్తి కలిగించటానికి వారు ఈ పుస్తకాలను ప్రచురించారు. వాటిలో హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబులకు సంబంధించిన నిజమైన కథలతో నాలుగు పుస్తకాలున్నాయి.
వీటిలో ‘మంటలలో హిరోషిమా’ కథను ‘తోషీ మారుకీ’ రాశారు. ”నాకు పిల్లలుగానీ చుట్టాలూ, బంధువులు గానీ ఎవరూ లేరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నామనువలు, మనవరాళ్ళ కోసం ఈ కథ రాశాను” అని తోషీ మారూకి రాశారు. మనసులను దహించివేసే నిజమైన కథ ఇది. ఈ కథ చదివిన వాళ్ళ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. హిరోషిమా విధ్వంసాన్ని చూపించే చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసిన రచయితతో ఒక మహిళ చెప్పిన అనుభవం ఈ కథలో ఉంటుంది. ఆమె వెక్కుతూ, ఏడుస్తూ అణుబాంబు విస్ఫోటనం నాటి తన అనుభవాలను మొత్తం చెప్పింది. తన భర్తను వీపున మోస్తూ, పిల్లచేయిపట్టుకొని పరిగెత్తిన తన అనుభవాలు చెప్పింది. క్లుప్తంగా ఆ కథ ఇది…
‘జపానులోని హిరోషిమా పట్టణంలో ఆకాశం నీలంగా ఉంది. అక్కడి ఏడు నదులూ మెల్లగా ప్రవహిస్తున్నాయి. మాయి ఏడు సంవత్సరాల పాప. ఆమె అక్కడ అమ్మానాన్నలతో ఉంటోంది. సాధారణమైన జనజీవితం వాళ్ళది. ఆగస్టు 6, 1945న ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు అమెరికా వాయుసేన ‘ఇన్‌లో గో’ అనే విమానంలోంచి హిరోషిమా పైన అణుబాంబును వదిలింది. ఆ బాంబుకు ‘లిటిల్ బారు’ అని వాళ్ళు పేరు పెట్టారు.
ఆ బాంబు విస్ఫోటనానికి మాయి స్పృహతప్పి పడిపోయింది. ఆమెకు తెలివి వచ్చేసరికి శిథిలాల కింద ఉంది. ఆమె మీద పడిన దూలాన్ని అమ్మ ఎంతో కష్టపడి తొలగించింది. వాళ్ళ నాన్న మంటలలో చిక్కుకుపోయాడు. ఆకాశం నిండా నల్లటి మబ్బులు నిండి ఉన్నాయి. గాయాలతో ఉన్న అమ్మ వేగంగా ఆ మంటల్లోకి చొరబడి నాన్నను బయటికి తెచ్చింది. బాగా కాలిన గాయాలు. ఆమె తన భర్తను వీపు మీద వేసుకొని, మాయి చెయ్యి పట్టుకొని పరుగెత్త సాగింది. అక్కడ చాలామంది పిల్లల బట్టలు పూర్తిగా కాలిపోవటం, వాళ్ళ పెదాలు కనురెప్పలు ఉబ్బి ఉండటం కనిపించింది. వాళ్ళు అటూ ఇటూ పరిగెత్తుతూ, అరుస్తూ భూతాల మాదిరి తిరుగుతున్నారు. బలహీనంగా పడిపోతున్నారు. ఎటు చూసినా గాయాలతో కనబడే మనుషుల గుంపులే.
ఆ జనమంతా నది వైపు పరిగెత్తారు. పక్షులు కూడా రెక్కలు కాలిపోయి, పడిపోయి చనిపోతున్నాయి. పరిగెత్తుతున్న మాయికి ఒక చిన్న వయస్సు స్త్రీ కనబడింది. ఆమె ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకొని ఏడుస్తూ పరిగెత్తుతున్నది. ‘పిల్లాడు పాలు తాగడం లేదు. వీడు చనిపోయాడు’ అని ఏడుస్తూ చెప్పింది. ఆ పిల్లాడిని హృదయానికి హత్తుకొని నదిలోకి దిగింది. అగ్ని కీలలు వేగంగా వాళ్ళను వెన్నంటే వస్తున్నాయి.
మాయి నదిలో మునిగి, కొన్ని గుటకల నీళ్ళు మింగింది. అమ్మ మాయి తల పట్టుకొని నీళ్ళలోంచి లేపింది. మూడు రోజులు గడిచాయి. వాళ్ళు అక్కడ అలా పడివున్నారు. మాయి ఆకలితో ఏడ్చింది. ఒక ముసలి మనిషి ఆమెకు తన సంచిలోంచి అన్నంముద్ద తీసిచ్చింది. తరువాత ఆ ముసలి మనిషి పడిపోయి చనిపోయింది. బాంబు పడిన నాలుగు రోజులదాకా మాయి తన చేతుల్లోంచి తనకు ఇష్టమైన చాప్ స్టిక్స్‌ను విడిచిపెట్టలేదు.
వారికి సహాయం చేయడానికి ఒక అగ్ని మాపక దళం వచ్చింది. కూలిపోయిన బడిలో ఆ ఏర్పాట్లు చేశారు. మొత్తం హిరోషిమాలో ఒక్క ఇల్లుగానీ, ఒక్క చెట్టుగానీ మిగలలేదు. చివరికి గడ్డిపరకలు కూడా కాలిపోయాయి. మొత్తం నగరం కాలి బూడిదైపోయింది. హిరోషిమా ఒక పెద్ద శ్మశానంలా కనబడుతోంది.
ఆగస్టు 9 నాడు జపాన్‌లోని మరొక నగరం ‘నాగసాకి’ మీద కూడా అమెరికా ఆటంబాంబు వేసింది. అక్కడ కూడా హిరోషిమా లాగే వేలాదిమంది చనిపోయారు. ఇళ్ళూ, ఆసుపత్రులూ, బళ్ళూ అన్నీ సర్వనాశనమైపోయాయి. అంతటి ప్రళయ కారక బాంబును అప్పటి వరకు ఎవరూ ప్రపంచంలో ప్రయోగించలేదు. దానిలోంచి వెలువడిన విషపూరిత ఆణుధార్మిక కిరణాల వల్ల సంవత్సరాలపాటు ప్రజలు రోగాలతో చనిపోయారు. మాయి కూడా ఎత్తు, బరువూ పెరగకుండా అలా ఉండిపోయింది. ఆమె తలలోనూ, శరీరంలోనూ గుచ్చుకుపోయిన ముక్కలు చాలా కాలం అలా ఉండిపోయాయి.
అణుబాంబు వల్ల వచ్చిన రోగాలకు ఎటువంటి చికిత్సా లేదు. మాయి వాళ్ళ నాన్న కూడా దగ్గుతూ రక్తం కక్కుకునే వాడు. వంటిమీదంతా మచ్చలు ఏర్పడ్డాయి. కొంత కాలానికి అతడు చనిపోయాడు…” క్లుప్తంగా ఆ పుస్తకంలో ఉన్న కథ ఇది. ఈ పుస్తకానికి హిందీ అనువాదాన్ని అరవింద గుప్త చేశారు. తెలుగు అనువాదకులు కె. సురేశ్. తోషీ మారుకి బొమ్మల ఆధారంగా అవినాష్ దేశ్‌పాండే చక్కని చిత్రాలు వేశారు.
ఈ నాలుగు పుస్తకాల్లో మిగతా వాటిని గురించికూడా చాలా క్లుప్తంగానైనా తెలుసుకోవలసిన సందర్భం ఇది. వీటిలో ‘సడాకో కాగితపు పక్షులు’ అనే పుస్తకాన్ని ‘ఎలినా కోయర్’ రచించారు. హిరోషిమాపై బాంబుదాడి జరిగినప్పుడు ‘సడాకో’ అనే బాలికకు రెండు సంవత్సరాలు. తరువాత ఆ బాంబు రేడియేషన్‌తో ఆ పాపకు క్యాన్సర్ వచ్చింది. ఆ జబ్చుతో ఆ బాలిక ఎలా పోరాడింది? ఆమె బతికిందా? అనే విషయాలు కంట తడిపెట్టించేలా రాసిన కథ ఇది. యుద్ధాలను తీవ్రంగా వ్యతిరేకించే పుస్తకం ఇది. ప్రతి సంవత్సరం శాంతి దినోత్సవం నాడు పిల్లలు సడాకో స్మారక స్థూపాన్ని కాగితపు పక్షులతో అలంకరిస్తారు. ఇవే మా కన్నీళ్ళు, ఇవే మా వేడుకోళ్ళు. ప్రపంచంలో శాంతి వెల్లివిరియాలి” అనే మాటలు ఆ స్మారక స్థూపం మీద ఉంటాయి. ఈ పుస్తకానికి హిందీ అనువాదం అరవింద గుప్తా చేశారు. తెలుగు అనువాదం కె. సురేశ్ చేశారు. ‘రోనాల్డ్ హిమ్లర్’ బొమ్మల ఆధారంగ తెలుగులో అవినాష్ దేశ్‌పాండే బొమ్మలు వేశారు.
‘షిన్ మూడు చక్రాల సైకిల్’ అనే పుస్తకాన్ని ‘తాత్సుహారు కోడామా’ రాశారు. హిరోషిమాపై బాంబు పడినప్పుడు ‘షిన్’ అనే మూడు సంవత్సరాల అమాయక బాలుడు తన మూడు చక్రాల సైకిల్ తొక్కుకుంటున్నాడు. తరువాత అతడు అత్యంత విషాదంగా మరణిస్తాడు. అతని సైకిల్ ముక్కలై శిథిలాల కింద దొరుకుతుంది. ఆ సైకిల్ తరువాత హిరోషిమాలోని శాంతి సంగ్రహాలయంలో ప్రపంచ వ్యాప్తంగా బాలలకు శాంతి సందేశమౌతుంది. యుద్ధం విధ్వంసకతను ఎప్పుడూ గుర్తుచేసే కథ ఇది. ఈ కథను అరవింద గుప్తా హిందీలోనూ, కె. సురేశ్ తెలుగులోనూ అనువాదం చేశారు. బొమ్మలు ‘నోరుయూకీ ఎండో’ వేసిన వాటి ఆధారంగా తెలుగులో అవినాశ్ దేశ్‌పాండే వేశారు.
‘ప్రాణమిచ్చిన ఏనుగులు’ కథను ‘యుకియొ త్సుచియా’ రచించారు. యుద్ధంవల్ల కేవలం దేశాలు, ప్రజలే కాదు మూగ జంతువులు కూడా బలౌతాయి. అలా అక్కడి జంతు ప్రదర్శనశాలలో అన్ని జంతువులనూ చంపేశారు. వాటిలో అత్యంత దయనీయంగా చనిపోయిన జంతువులు, వాటిలో మూడు ఏనుగుల హృదయ విదారకమైన కథ ఇది. ‘మనుషులూ, జంతువులూ సుఖసంతోషాలతో జీవించే యుద్ధాలు లేని ప్రపంచాన్ని కలగన్న పుస్తకం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిల్లలందరి కోసం ఈ కథలు రాశామని’ ఈ రచయితలు చెప్పుకున్నారు. అరవింద గుప్త హిందీలోకీ, కె. సురేశ్ తెలుగులోకీ అనువాదం చేశారు. ‘టెడ్ లుఎన్’ బొమ్మల ఆధారంగా తెలుగులో శర్మిష్ఠ సన్యాల్ వేసిన బొమ్మలున్నాయి.
సుమారు ముప్పై, నలబై పేజీలలోపు ఉన్న చిన్నచిన్న కథల పుస్తకాలు ఇవి. హింసా ప్రవృత్తి, యుద్ధ కాంక్షలు పెరిగిపోతున్న ఈ కాలంలో పిల్లలూ పెద్దలూ తప్పకుండా చదవవలసిన పుస్తకాలు ఇవి. వీటిని తెలుగులో జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. ప్రముఖ పుస్తకాల షాపుల్లోకానీ, జనవిజ్ఞాన వేదిక వారిదగ్గర కానీ, మంచి పుస్తకం వారి దగ్గరకానీ ఈ పుస్తకాలు లభించే అవకాశం ఉంది. మీరు కూడా వీలుచేసుకొని తప్పకుండా సంపాదించుకొని చదువుతారు కదా!
– డా. వి.ఆర్.శర్మ. 9177887749