నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పార్టీ మారే విషయంలో ఎవరిష్టం వారిదని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన అంశంపై ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదని ఆయన చెప్పటం సరిగాదన్నారు. ఆయన కాదంటే కాకుండా పోదన్నారు.
బీజేపీపై నిందలేయడం తగదు : లక్ష్మణ్
పార్టీకి రాజీనామా చేసి పోతూ రాజగోపాల్‌రెడ్డి నిందలేయడం సరిగాదని ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. కార్యకర్తలు శ్రమించడం వల్లనే పార్టీ ఈ స్థాయికి ఎదిగిందన్నారు. జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరి ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగాదన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధ్యానత్య కల్పించిందన్నారు. ఇలా చేయడం తగదన్నారు.
నేను బీజేపీలోనే ఉంటా : వివేక్
తాను బీజేపీలోనే ఉంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డి మాట మార్చారు : ఈటల
తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పిన రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు ఎలా మాటమార్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో తానే గెలుస్తానని చెప్పారు. మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ..రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారటం దురదృష్టకరమని చెప్పారు. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అని భావించి అందరూ ఆ పార్టీ వైపు మళ్లుతున్నారని తెలిపారు. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు.